మహబూబ్ నగర్‌ లోక్‌సభ బరిలో ముగ్గురు రెడ్లే.. ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతారో?

మహబూబ్ నగర్‌ లోక్‌సభ బరిలో ముగ్గురు రెడ్లే.. ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతారో?
x
Highlights

మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ నియోజకవర్గంలో ప్రతీసారీ పోటీ రసవత్తరంగా కొనసాగుతూ వస్తుంది. జనరల్ స్థానమైన మహబూబ్‍నగర్ పార్లమెంటు నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి...

మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ నియోజకవర్గంలో ప్రతీసారీ పోటీ రసవత్తరంగా కొనసాగుతూ వస్తుంది. జనరల్ స్థానమైన మహబూబ్‍నగర్ పార్లమెంటు నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు బరిలో నిలుస్తుండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడ్డ జిల్లాగా గుర్తింపు పొందిన ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలో మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ స్థానంలో మొదటి నుంచీ రసవత్తర పోటీ కొనసాగుతూ వస్తుంది. 2014లో 72.94 శాతం పోలింగ్ నమోదైంది.

ఈసారి ఓటింగ్ శాతంపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ నుంచి ఇప్పటి దాక అత్యధికంగా కాంగ్ర్రెస్ పార్టీనే జెండా ఎగరవేయగా పోటీ చేసిన రెండుసార్లు గులాబీ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలవడంతో మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ స్థానంపై ఈసారి జెండా ఎగరేసి హ్యాట్రిక్‌ సాధించాలన్న పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ కూడా తమ ఓటు బ్యాంకును కాపాడుకుని, విజయం సాధించాలని చూస్తుంది. జిల్లాపై మంచి పట్టున్న నాయకురాలు డీకే అరుణ చేరికతో కూడా కమలం ఇప్పుడు కదంతొక్కతోంది.

మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ సెగ్మెంట్‍‌లో జడ్చర్ల, కొడంగల్‍, మక్తల్‍, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్‌తో పాటు మహబూబ్‍నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఓటర్లు 15 లక్షల ఒక వేయి 993 మంది ఉండగా ఇందులో పురుషులు 7 లక్షల 50 వేల 289 కాగా మహిళలు 7 లక్షల 51 వేల 577 మంది ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌‍, టీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ రసవత్తరంగా కొనసాగింది. టీఆర్‌ఎస్‌ తరపున జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి జైపాల్‍‌రెడ్డి బీజేపీ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి పోటీ చేశారు. ఇందులో జితేందర్‌రెడ్డి. జైపాల్‍‌రెడ్డిపై 2,590 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించగా నాగం మూడో స్థానానికి పరిమితమయ్యారు. టీఆర్ఎస్‌కు 3లక్షల 34 వేల 228 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 3లక్షల 31 వేల 638 ఓట్లు పోలయ్యాయి.

2014 ఎన్నికల్లో ఓట్లు, ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆ ఎన్నికల్లో 10 లక్షల 14 వేల 800 ఓట్లు పోలవగా టీఆర్ఎస్‌ అభ్యర్థి జితేందర్‌రెడ్డికి 3 లక్షల 34 వేల 228 ఓట్లు కాగా 32.94 శాతం ఓట్‌ షేర్‌ దక్కింది. ఇక గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి జైపాల్‌రెడ్డికి 3లక్షల 31వేల 638 ఓట్లు, 32.68 శాతం ఓట్‌షేర్‌, అలాగే బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డికి 2లక్షల 72 వేల 791 ఓట్లు, 26.88 శాతం ఓట్‌ షేర్‌ లభించింది. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పోరులో టీఆర్ఎస్‌ అభ్యర్థి జితేందర్‌రెడ్డి విజేతగా నిలవగా వచ్చిన మెజారిటీ కేవలం 2 వేల 590 మాత్రమే.

ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి వంశీచందర్‌రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ బరిలో నిలిచారు. ఇంతకుముందు కాంగ్రెస్‌లో ఉన్న ప్రస్తుత బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రభావం చాలా ఉంటుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్‌ దానికి తగ్గ వ్యూహాలను రచిస్తుంటే ఈసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలన్న పట్టుదలతో ఉంది టీఆర్ఎస్‌. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతితో సత్తా చాటాలన్నది బీజేపీ ఆలోచన.

ఇక ముగ్గురు అభ్యర్థుల బలాబలాల్లో మొదటగా బీజేపి అభ్యర్థి డీకే అరుణ గురించి తెలుసుకుందాం. జిల్లాలో ప్రభావం చూపించగల నాయకురాలు. మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలో పార్టీని శాసించిన అనుభవం ఉంది. రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా గుర్తింపు ఉంది. ఇప్పుడు బీజేపి నుంచి పోటీ చేస్తుండటంతో తాను పోటీ చేస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మార్చగల అనుభవం కలిగిఉండటం. బలమైన క్యాడర్, ఓట్‍ బ్యాంక్ ఉన్నా బీజేపి పార్టీలో చేరడం మైనస్‌గా చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్న ఆరోపణలు. తమ్ముడు మక్తల్‍ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఫ్యామిలీతో విబేధాలు, సీనియర్‍ కాంగ్రెస్ నాయకుడు, బావ అయిన డీకే సమరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉండటం కూడా బలహీనతలేనని చెబుతున్నారు.

ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని చూద్దాం. కల్వకుర్తి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా గుర్తింపు, రాహుల్‍కు అత్యంత సన్నిహిత్యమన్న పేరు, జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండటం వంశీకి కలిసి వచ్చే అంశం. ఇక తనకంటూ ప్రత్యేకంగా క్యాడర్ లేకపోవడం మైనస్‌. కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నియోజకవర్గాన్నిపట్టించుకోలేదన్న ఆరోపణలు.

చివరగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గురించి చూద్దాం. ఉమ్మడి జిల్లా నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా గుర్తింపు. జిల్లా వాసులకే తమ ఫార్మా కంపెనీలో ఉద్యాగావకాశాలు కల్పించారన్న పేరు కలిసి వచ్చే అంశం. అధికార పార్టీ నుంచి బరిలోకి దిగడం ప్లస్‌. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు గెలుపుకోసం కృషిచేయడం కలిసిరావచ్చు. ఇక అటు రాజకీయాలకు, ఇటు జిల్లా ప్రజలకు కొత్తవాడు కావడం మైనస్. ప్రచారానికి సమయం లేకపోవడంతో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్‌ క్యాడర్ పైనే పూర్తిగా ఆధారపడాల్సి రావడం కూడా ఎంఎస్‌రెడ్డికి ఇబ్బందిగా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories