Top
logo

తోట త్రిమూర్తులు చూపు ఎటు వైపు?

తోట త్రిమూర్తులు చూపు ఎటు వైపు?
X
Highlights

కాపు కాయడంలో ఆయనకు తిరుగులేదు. కాపు కాయడానికి ఆయన ఎంతకైనా తెగిస్తానంటారు. పార్టీల కంటే కాపు కాయడమే తన...

కాపు కాయడంలో ఆయనకు తిరుగులేదు. కాపు కాయడానికి ఆయన ఎంతకైనా తెగిస్తానంటారు. పార్టీల కంటే కాపు కాయడమే తన లక్ష్యమంటాడు. కానీ ఇప్పుడు కాపు కాయడానికి మరోవైపు మళ్లుతానంటున్నారు. ఏ వైపు వెళ్లాలో అర్థంకాక సతమతమవుతున్నాడు. రకరకాల పరిస్థితుల నేపథ్యంలో, ఏ గట్టునుండాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇంతకీ ఆయనెవరు?

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక ముద్ర వేయడంతో పాటు, వర్గాన్ని సమకూర్చుకున్నారు రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. ప్రస్తుతం ఆయన చూపు ఎటు అనేది గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న చర్చ. ఆ ఒక్కటి అడక్కు ఇంకా ఏదైనా పర్వాలేదు అనే రీతిలో తెలుగుదేశం నుంచి ఆయనకి మంత్రి పదవి తప్ప మిగిలిన అన్ని రాజమర్యాదలు అందుతున్నాయి. అయినా గానీ అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుంది ఎమ్మెల్యే తోట పరిస్థితి. అందుకే మరో గట్టు వైపు చూస్తున్నారు.

ఇండిపెండెంట్‌గా గెలిచి సత్తా చాటుకున్న తోట, తిరిగి తెలుగుదేశంలో చేరారు. అలా మరో రెండుసార్లు అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, ఓసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిన్నకాక మొన్న గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తుంటే, తననెందుకు పట్టించుకోవడం లేదన్న ఆవేదన, ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది.తోట పార్టీ మారడం ఖాయమనిచ ఆ నోట ఈ నోట బయటికి వినిపిస్తోంది. దీంతో ఇతర పార్టీల్లో చేరే నాయకులు తోటతో తరచూ మంతనాలు జరుపుతున్నారు.

తెలుగుదేశంకు రాజీనామా చేసి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్‌‌లు తోటతో మంతనాలు జరిపారన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే, ఈ నాయకులంతా కాపు నేతలే. ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన వర్గం కాపునే. దీంతో అటు పవన్‌, ఇటు టీడీపీకి చెక్‌ పెట్టేందుకు కీలకమైన కాపు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్. అందుకు ఆమంచి, అవంతిలను రంగంలోకి దించారు. మొన్న విజయవాడలో గోదావరి జిల్లాల కాపు నేతలతో ఆమంచి రహస్యంగా సమావేశమయ్యారు. తమ సామాజికవర్గం సంక్షేమం కోసమే, తోటతో పాటు, ఇతర కాపు నాయకులతో చర్చించామని బాహాటంగా చెప్పారు ఆమంచి కృష్ణమోహన్. దీంతో తోట చూపు వైసీపీ వైపు ఉందని రామచంద్రాపురంలో చర్చ సాగుతోంది.

కాపు నాయకుడిగా ఎదిగిన తోట త్రిమూర్తులు తమ సామాజిక వర్గం కోసం ఏదైనా చేస్తాం అంటూ పదేపదే చెబుతుంటారు.ఆ మాటకొస్తే తన సామాజిక వర్గం తర్వాతే పార్టీ అని బల్ల గుద్ది చెప్పిన సందర్భారాలెన్నో ఉన్నాయి. అందుకే ఎమ్మెల్యే తోట తన సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేనలో చేరడం ఖాయమనే వాదనఉంది. గతంలో సైతం ఆయన ప్రజారాజ్యం తరపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే అప్పుడు ఆ టిక్కెట్ తెచ్చుకునేందుకే తోటకు ప్రజారాజ్యంలో చుక్కలు చూపించారనే వాదన ఉంది. ఇప్పుడు సైతం జనసేన నుంచి స్పష్టమైన హామీ, లభించకపోవడంతో తోట సరైన నిర్ణయం తీసుకోలేదని మరో వాదన. జిల్లాలో ఆయనతోపాటు బలమైన నేతలందర్నీ, జనసేన వైపు తరలించే బలమైన నేతగా ఉన్న తోట పట్ల, అధినేత పవన్‌ కళ్యాణ్ సరైన అంచనా వేయలేదని, ఆయన సామాజికవర్గంలో చర్చ జరుగుతోంది.

ఆయన ఒక్కరే కాదు ఆయన సూచించిన వ్యక్తులకూ టిక్కెట్లు ఇవ్వాలన్న వాదన తోటది. అయితే జనసేనలో కొంతమంది నేతలు తమ మనుగడ కోసం తోట పట్ల పవన్ కళ్యాణ్‌కు తప్పుడు సమాచారం అందిస్తున్నారన్న వాదన ఉంది.అసలు తోట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అని ప్రచారం విస్తృతంగా సాగింది ఓ దశలో. అయితే జగన్ మండపేట నుంచి పోటీ చేయాలని సూచించడంతో తోట ఆ ప్రతిపాదన పట్ల మొగ్గు చూపలేదని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను బట్టి, జగన్ సైతం తోట కోరుకున్న సీటునును ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

టీడీపీలో అన్నీ సజావుగా సాగుతున్న దశలో తోట, పార్టీ మారవలసిన అవసరం ఏముందని మరో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు తోట. కుమారుని వివాహం అంగరంగ వైభవంగా చేశారు. వివాహ విందుని సైతం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాండ్‌గా ఆర్గనైజ్ చేశారు. ఇవన్నీ ఆయన ముందస్తు వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. మొత్తం మీద తోట టీడీపీలోనే ఉన్నా లేదా అటు వైసీపీ ఇటు జనసేనలోకి వెళ్ళినా తన చరిష్మాతో పట్టు సాధించాలన్న స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం నాయకులు పదే పదే బుజ్జగిస్తున్నా, తెగే తాడుని ఎంతకాలం పట్టుకుంటామని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల ముంగిట్లో ఏ గట్టున ఉండాలో తెలియక, ఇంకా సతమతమవుతూనే ఉన్నారు తోట.

Next Story