ఏపీ తరహాలోనే తెలంగాణలో చచ్చిపోనుందా?

ఏపీ తరహాలోనే తెలంగాణలో చచ్చిపోనుందా?
x
Highlights

అసలే గందరగోళంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కరుడుకట్టిన నేతల వలసలు సలసలా కాగేలా చేస్తున్నాయి. మొదట్లో అంటే వైఎస్‌ బతికున్న కాలంలో ఆపరేషన్‌...

అసలే గందరగోళంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కరుడుకట్టిన నేతల వలసలు సలసలా కాగేలా చేస్తున్నాయి. మొదట్లో అంటే వైఎస్‌ బతికున్న కాలంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపిన కాంగ్రెస్‌లో ఇప్పుడు ఆ పార్టీకే బూమరాంగ్ ఫలితాన్నిస్తోంది. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోడానికి ఇప్పటికే నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్‌కు టీఆర్ఎస్‌, బీజేపీలు వేస్తున్న వలకు తమ నేతలు చిక్కకుండా కాపాడుకోవడం తలకు మించిన భారమే అవుతోంది.

కాంగ్రెస్‌లో వున్న ఈ అసంబద్ధ, గందరగోళ వైఖరే ఆ పార్టీ పరువు తీసేస్తోంది. ఏ విషయంలోనూ ఓ స్పష్టమైన , పారదర్శకమైన విధానం లేకపోవడం ఆపార్టీకి పెద్ద మైనస్.. అదే ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. పార్టీని ఒక్క తాటిపై నడిపించే సమర్ధుడైన నేత కరువవడం కాంగ్రెస్‌కు పెద్ద లోపమే. పార్టీ పరువు ప్రతిష్టలు దారుణంగా పడిపోయిన ఈ తరుణంలో చావైనా బతుకైనా కాంగ్రెస్‌తోనే అన్న నాయకులు కూడా ఒక్కొక్కరుగా చేయి జారిపోవడం హస్తం మనోనిబ్బరాన్ని పూర్తిగా దెబ్బతీసినట్టవుతుంది.

తెలంగాణ కాంగ్రెస్ మునిగిపోయే పడవా అంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికల తర్వాత కనుమరుగు కాబోతుదంటూ జోస్యం చెబుతున్నారు. ఏపీ తరహాలోనే తెలంగాణలో కాంగ్రెస్ చచ్చిపోనుందన్న ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు బీజేపీ వైపు వెళ్తారన్న ఊహాగానాల మధ్య తెలంగాణ కాంగ్రెస్‌ ఇప్పుడు కకావికలమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించలేనంతగా అమలవుతున్న ఈ వ్యూహంతో తెలంగాణ కాంగ్రెస్ పతన దశకు పడిపోతుందన్న భయం కార్యకర్తలను కూడా వెంటాడుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడినట్లే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ కుదేలవుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న తెలంగాణలో ఆ పార్టీ తమకలసు పోటీయే కాదంటుందిప్పుడు టీఆర్ఎస్‌. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేయాలన్నది గులాబీ వ్యూహంగా కనపడుతుందంటున్నారు హస్తం పార్టీ నేతలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకున్నా కూడా అసలు రాష్ట్రంలో..సభలో ప్రతిపక్ష గొంతు లేకుండా చేసేందుకే టీఆర్ఎస్ పనిచేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచిన వారంతా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెబుతున్నా అది ఎవరి అభివృద్ధి అన్నదే తేలాల్సి ఉంది. కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ప్రభుత్వానికి ఢోకా ఉండదనుకున్న సమయంలో ఫిరాయింపులను ప్రోత్సహించినా కొంతలో కొంత అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడా పరిస్థితులే లేవు. అసలు కాంగ్రెస్‌లో ఇప్పుడు ఆ దిశగా ఆలోచించే నేత కూడా ఎవరూ లేరు. కానీ అవసరం లేకపోయినా మరి ఈ స్థాయిలో ఎందుకీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న ప్రశ్నకు కేవలం రాజకీయ కారణాలే సమాధానం చెప్పాల్సి వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories