Top
logo

సంప్రదాయాలా... చట్టాలా... ఆచారాలకు ఏంటీ అడ్డుకట్ట

సంప్రదాయాలా... చట్టాలా... ఆచారాలకు ఏంటీ అడ్డుకట్ట
X
Highlights

శతాబ్దాల సనాతన సాంప్రదాయాలు ఒకవైపు. ఆధునిక రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ నినాదాలు మరోవైపు. ఆచారాలు...

శతాబ్దాల సనాతన సాంప్రదాయాలు ఒకవైపు. ఆధునిక రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ నినాదాలు మరోవైపు. ఆచారాలు ఒకవైపు...ప్రాథమిక హక్కులు మరోవైపు. శబరిమల, శనిసింగణాపూర్, హజీ అలీ దర్గా, ట్రిపుల్‌ తలాక్, జల్లికట్టు, దేవరగట్టు, కోడిపందేలు...ఇలా ఆలయాల ప్రవేశాలు, సంప్రదాయ క్రీడలు...వీటిపై హక్కుల కార్యకర్తల ఉద్యమాలు, కోర్టు తీర్పులు, దేశంలో మరోసారి చర్చకు పెడుతున్నాయి. రాజకీయ పార్టీలు మాత్రం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, భక్తిలోనూ వైషమ్యాలు నూరిపోస్తున్నాయి. మరి సమానత్వమా....రాజ్యాంగమా...ఈ చర్చకు అర్థవంతమైన ముగింపు లేదా?

శబరిమల గర్భగుడిలోకి తొలిసారి ప్రవేశించి చరిత్ర సృష్టించారు మహిళలు. అనేక ఆచారాల కంచెలను దాటి స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెల్లడైన చాలారోజులకు, ఆ తీర్పు అమలు జరిగినట్టయ్యింది. ఇప్పుడు అదే కేరళతో పాటు దేశమంతా చర్చనీయాంశమైంది. ఆలయం మైలపడిందని, తలుపులు మూసేశారు. సంప్రోక్షణ తర్వాత ద్వారాలు తెరిచారు. మహిళా సంఘాలకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తించారు. శబరిమల గిరులు మరోసారి రణక్షేత్రాన్ని తలపిస్తున్నాయి.సనాతన భారతదేశంలో కొన్ని దశాబ్దాలుగా ఇదే చర్చ. ఒకవైపు మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, మరోవైపు కనపడని ఆధ్యాత్మిక వివక్షా సంకెళ్లపై రాజ్యాంగబద్ద హక్కులతో పోరాటాలు...నిత్యం సంఘర్షిస్తూనే ఉన్నాయి. శబరిమల, శనిసింగణాపూర్, జల్లికట్టు, హజీ అలీ దర్గా, దేవరగట్టు, ట్రిపుల్ తలాక్, ఇంకా ఎన్నో, మరెన్నో అంశాలు, సాంప్రదాయాలు వర్సెస్ చట్టాలుగా సంఘర్షించుకుంటున్నాయి.

తరతరాల ఆచారాలు ఒకటి చెబుతుంటే, రాజ్యాంగం మరోటి అంటోంది. సంప్రదాయం ఒకటి అంటుంటే, సమానత్వం మరోటి ఘంటాపథంగా చెబుతోంది. కోర్టులు, అనేక అంశాలపై విస్పష్టమై తీర్పులిస్తుండటంతో, వాడీవేడీ చర్చనీయాంశలయ్యాయి. ఇప్పుడెందుకు మళ్లీ మతాలు, ఆలయాలపై చర్చ మొదలైందంటే, తొలిసారి శబరిమల ఆలయంలో ప్రవేశించి చరిత్ర సృష్టించారు మహిళలు. సహజంగానే దీనిపై సమర్థింపులు, విమర్శలు హీటెక్కిస్తున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వుల తర్వాత మొదటిసారి అయ్యప్ప ఆలయ ప్రవేశం చేశారు మహిళలు. ఎన్నో ఒడిదుడుకులు, తిరస్కారాల తర్వాత ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లారు. వీరిద్దరూ 50 సంవత్సరాలలోపు వాళ్లే కావడంతో కోర్టు ఉత్తర్వులను అమలు జరిపినట్లైంది. కోజికోడ్ జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పంబ చేరుకున్నారు. అక్కడి నుంచి సన్నిధానానికి వచ్చారు. తెల్లవారుజామున 3:45 గంటలకు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారు. కొందరు యూనిఫాంలో ఉన్న పోలీసులు, మఫ్టీ పోలీసులు వారిని స్వయంగా ఆలయ గర్భ గుడిలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు. వీరిద్దరూ హడావుడిగా శబరిమల ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల వీళ్లు ఒకసారి విఫలయత్నం చేశారు. అప్పుడు అయ్యప్ప భక్తులు వీరిని అడ్డుకున్నారు. ఈసారి మాత్రం విజయం సాధించారు.

మహిళలు దర్శనం చేసుకున్న విషయాన్ని కేరళ సీఎం విజయన్ కూడా ధృవీకరించారు. మహిళలు ఎవరు అడిగినా భద్రత కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అయితే, మహిళలు ప్రవేశించారన్న వార్త, కేరళకే కాదు, దేశవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. దీంతో వెంటనే ఆలయ నిర్వాహకులు గుడిని మూసివేశారు. గుడి అపవిత్రమైందని, సంప్రోక్షణ చేశారు. ఆ తర్వాత గానీ తిరిగి అయ్యప్ప తలుపులు తెరుచుకోలేదు. అయితే మహిళా సంఘాలు మాత్రం, శబరిమల ప్రవేశాన్ని గొప్ప విజయంగా అభివర్ణిస్తున్నాయి. కనపడని సంకెళ్లపై విజయం సాధించామని సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు మహిళల ప్రవేశంపై భక్తులు మండిపడుతున్నారు. త్రివేండ్రం, తిరువనంతపురంతో పాటు అనేక నగరాల్లో నిరసన చేపట్టారు. దొంగల్లా అర్థరాత్రి పూట వెళ్లారని నినాదాలు చేశారు. ఆలయ పవిత్రను భంగపరిచే కుట్రగా అభివర్ణించారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అయ్యప్ప ఆలయం పరిసరాలు, రణక్షేత్రంగా ఎలా రగిలిపోయాయి దేశమంతా చూసింది. 50 ఏళ్లలోపు వారిని స్వయంగా భక్తులు అడ్డుకోవడం, వారిని దాటి వెళ్లేందుకు కొందరు ప్రయత్నించడంతో, శబరిగిరులు యుద్ధక్షేత్రాన్ని తలపించాయి. రాజకీయ పార్టీలు కూడా, వెంటవెంటనే రంగులు మార్చడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యాఖ్యలు చేయడంతో, ఈ వివాదం ఆరనిజ్వాలగా రగులుతూనే ఉంది.

Next Story