2019.. ఒకరకంగా రాహుల్‌కు లిట్మస్‌ టెస్ట్

2019..  ఒకరకంగా రాహుల్‌కు లిట్మస్‌ టెస్ట్
x
Highlights

పప్పూ అన్నారు. అజ్ణాని అన్నారు. మాట్లాడ్డం రాదని ఎద్దేవా చేశారు. వారసత్వమే తప్ప నాయకత్వ లక్షణాల్లేవని దెప్పి పొడిచారు. ఐరన్‌లెగ్‌ అని ముద్రేశారు....

పప్పూ అన్నారు. అజ్ణాని అన్నారు. మాట్లాడ్డం రాదని ఎద్దేవా చేశారు. వారసత్వమే తప్ప నాయకత్వ లక్షణాల్లేవని దెప్పి పొడిచారు. ఐరన్‌లెగ్‌ అని ముద్రేశారు. పరాజయాల పాదమని స్టాంపేశారు. ఇప్పుడు అవేనోళ్లు మూతపడుతున్నాయి. వెక్కిరించిన నొసళ్లే డంగవుతున్నాయి. గుజరాత్‌‌లో మోడీని వణికించి, కర్ణాటకలో అపర చాణక్యం ప్రదర్శించి, కాషాయ కంచుకోట్లాంటి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేసి, తూటాల్లాటి మాటలు దూస్తూ, మిత్రో...అబ్‌ కౌన్ హై పప్పు అంటున్నాడు రాహుల్‌ గాంధీ.

మూడు రాష్ట్రాల విజయంతో ఉరకలేస్తున్న రాహుల్‌కు, తాను ఎదుర్కోబోతున్నది యోధుడులాంటి మోడీనని తెలుసు. అందుకే పకడ్బందీ వ్యూహాలకు పథక రచన చేస్తున్నారు. త్రీ స్టేట్స్ విక్టరీ ఫార్ములానే, వచ్చే సార్వత్రిక సమరంలో అప్లై చేయాలనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నారు. తనకు ప్రధాని కావాలన్న ఆశలేదంటున్న రాహుల్, బీజేపీ వ్యతిరేక పక్షాలను ఒకే గూటికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను సంధించిన రాఫెల్‌ అస్త్రం, మధ్యలోనే నిర్వీర్యం కావడం నిరాశ మిగల్చినా కొత్త నినాదాల కోసం ఆయన వెతుకుతున్నారు. శక్తియాప్‌ ద్వారా వేల మందితో నిత్యం సంభాషిస్తూ ఇన్‌పుట్స్‌ సేకరిస్తున్న రాహుల్‌, తాను కూడా బూత్‌-లెవల్‌ మంత్రాంగంతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే బీజేపీ వ్యతిరేకపక్షాలతో మహాకూటమి నిర్మిస్తానంటున్న రాహుల్‌కు, కూటమి ఐక్యత అంత ఈజీగా లేదు. ముఖ్యంగా ఢిల్లీలో అధికారానికి కీలకమైన యూపీలో, ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు ముందుకు రాకపోవడం పెద్ద మైనస్. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను మమత వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ ఫెడరల్‌ ప్రయత్నాలు కాంగ్రెెస్‌కు ఇబ్బంది కలిగించేవే. మూడు రాష్ట్రాల విజయంతో నాయకత్వానికి తిరుగులేదనిపించుకున్న రాహుల్‌కు, మరికొన్ని పార్టీలు మద్దతునివ్వాలి. లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, అంతిమంగా మోడీకే లాభం చేకూరుతుంది. విపక్షాల ఐక్యతకు, ఆయా పార్టీల్లో రాహుల్‌ మరింత నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. నిధుల కొరత, అనేక రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడం కాంగ్రెస్‌కు మైనస్‌. అయినా మోడీని ఢీకొంటానని, రాహుల్‌ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే, రాహుల్‌కు మరో ఐదేళ్లు ప్రతిపక్షమే. కాంగ్రెస్‌ పెద్ద పార్టీగా అవతరించి, సంకీర్ణమే వస్తే, మోడీని గద్దె దింపేందుకు ప్రధాని పదవినీ వదులుకుని, మిగతా పక్షాల నాయకులకు ప్రధాని పీఠం కట్టబెట్టక తప్పదు. ఇలా అనేక సవాళ్లు రాహుల్‌ ముందుంచుతోంది 2019.

Show Full Article
Print Article
Next Story
More Stories