Top
logo

ప్రియాంక ఎంట్రీ ఎవరి గుండెల్లో అలజడి

ప్రియాంక ఎంట్రీ ఎవరి గుండెల్లో అలజడి
X
Highlights

ఒకవైపు భర్త రాబర్ట్‌ వాద్రాను ఈడీ ప్రశ్నిస్తోంది. కుంభకోణాల చిట్టా ముందు పెట్టి, ఉక్కిరిబిక్కిరి చేస్తోంది....

ఒకవైపు భర్త రాబర్ట్‌ వాద్రాను ఈడీ ప్రశ్నిస్తోంది. కుంభకోణాల చిట్టా ముందు పెట్టి, ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు ఇవేవీ పట్టించుకోకుండా, అదిరేది లేదు, బెదిరేది లేదూ అంటూ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరప్రదేశ్‌‌లో గ్రాండ్‌గా ఎంటరయ్యారు ప్రియాంక గాంధీ. ఒకవైపు అన్న రాహుల్, మరోవైపు సీనియర్ ‌నేతలతో కలిసి అభివాదం చేస్తూ, 25 కిలోమీటర్లు రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్‌ తూర్పు ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, తొలిసారి యూపీలో అడుగుపెట్టారు ప్రియాంకా గాంధీ. రోడ్‌ షోతో, ప్రస్థానం మొదలైంది. జనంతో లక్నో వీధులు హోరెత్తాయి.

ప్రియాంక సోదరుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తోడుగా ఈ రోడ్‌ షో ప్రారంభించారు. బస్సుపైన నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. పశ్చిమ యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ జ్యోతిరాధిత్య సింధియా కూడా, ఈ ర్యాలీలో పాల్గొన్నారు. లక్నోలోని అమౌసి ఎయిర్‌పోర్టు నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వరకు 25 కిలోమీటర్ల మేర ఈ ప్రదర్శన సాగింది. రోడ్డు వెంబడి భారీ సంఖ్యలో జనం, ప్రియాంకకు స్వాగతం పలికారు. దేశంలోనే అత్యధిక పార్లమెంట్‌ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీ తూర్పు బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుతం ఆమె పరిధిలో ఉన్న 40 లోక్‌సభ స్థానాల్లో, బీజేపీ కంచుకోటలుగా చెప్పుకొనే స్థానాలున్నాయి. వాటిలో ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎంపీగా పనిచేసిన గోరఖ్‌పూర్‌ సీట్లు అత్యంత కీలకం. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నారు ప్రియాంక.

ప్రధాన కార్యదర్శిగా, ప్రియాంక ఉత్తరప్రదేశ్ ప్రవేశాన్ని చాలా గ్రాండ్‌గా ఆర్గనైజ్ చేసింది కాంగ్రెస్. ఈ రోడ్‌ షో ద్వారా కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేసింది. ఇందిర పోలికలు, హావభావాలున్న ప్రియాంకను జనంలో తీసుకొచ్చి, యూపీలో మళ్లీ కాంగ్రెస్‌ మూలాలను పునరుజ్జీవింపజేసే ప్రయత్నం చేసింది. ఒకవైపు భర్త రాబర్ట్ వాద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా సడలని ధైర్యం ఆమె ముఖంలో కనిపించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ, అదరను బెదరను అని, ప్రత్యర్థి పార్టీలకు సమర సంకేతాలిచ్చారు ప్రియాంక. అనేక సమీకరణాల నేపథ్యంలో, యూపీలో ప్రియాంకాస్త్రాన్ని సంధించింది కాంగ్రెస్. ఈ రాష్ట్రంలో యాదవులు, దళితుల ఓట్లు ఎస్పీ, బీఎస్పీలకే వెళతాయి. ఇక మిగిలిన ఓట్లు ముస్లింలు, అగ్రవర్ణాలు. ముస్లింలలో కొందరు ఎస్పీ, బీఎస్పీకి మళ్లితే, మిగతావారి ఓట్లు కాంగ్రెస్‌వే. ముస్లిం ఓట్ల మీద బీజేపీకి అసలు ఆశల్లేవు. ఇక మిగిలిన అగ్రవర్ణాల ఓట్ల మీదే బీజేపీ ఆశలు. వీటిని చీల్చాలన్నదే కాంగ్రెస్ వ్యూహం. అందుకే అగ్రవర్ణాలను ఆకర్షించేందుకు, ప్రియాంకను ఆయుధంగా ప్రయోగించింది.

ముందు నుంచి ‍యూపీలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు కూడా, బ్రాహ్మణులు, ఠాకూర్‌లు వంటి ఇతర అగ్రవర్ణాలే. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో, వారంతా బీజేపీ వైపు మళ్లారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీలతో కాకుండా, కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో, అగ్రవర్ణాల ఓట్లు చీలతాయని బీజేపీ భావన. అందుకే మొన్న పదిశాతం రిజర్వేషన్ అస్త్రం ప్రకటించింది. బీజేపీ స్ట్రాటజీని సవాల్ చేసేందుకు, కాంగ్రెస్‌ ప్రియాంకను ప్రయోగించింది. కీలకమైన యూపీని ప్రియాంకకు అప్పగించడంతో, మిగతా రాష్ట్రాలపై రాహుల్‌ దృష్టిపెట్టడానికి వీలుకలుగుతుంది. మొత్తానికి ప్రియాంక గాంధీ, ఉత్తరప్రదేశ్‌ రోడ్‌ షో అదిరిపోయిందని కాంగ్రెస్ శ్రేణులు సంబరపడుతున్నాయి. ప్రియాంక రాకతో తమకు వచ్చే నష్టమేమీలేదని ఎస్పీ, బీఎస్పీలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే, నేరుగా తలపడకపోయినా, కాంగ్రెస్‌తో వాటికి అవగాహన ఉందని తెలుస్తోంది. ఉమ్మడి శత్రువు బీజేపీ కావడంతో, చాలా స్థానాల్లో అవగాహన ఉండొచ్చు. అందుకే ప్రియాంక రాకతో బీజేపీ వ్యతిరేక పక్షాలకు జోష్ వస్తుందని, ఎస్పీ, బీఎస్పీలు భావిస్తున్నాయి. చూడాలి, యూపీలో ప్రియాంక ప్రయోగం ఎలాంటి ఫలితాలిస్తుందో...

Next Story