పోలింగ్‌ డే అంటే హాలీడేనా? ఓటర్లు ఎందుకిలా ఆలోచిస్తున్నారు?

పోలింగ్‌ డే అంటే హాలీడేనా? ఓటర్లు ఎందుకిలా ఆలోచిస్తున్నారు?
x
Highlights

పోలింగ్‌ డే అంటే హాలీడేనా? ఓటర్లు ఎందుకిలా ఆలోచిస్తున్నారు? తగ్గుతున్న పోలింగ్‌ శాతం ఏం చెబుతుంది? ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతంలోపు నమోదవడం...

పోలింగ్‌ డే అంటే హాలీడేనా? ఓటర్లు ఎందుకిలా ఆలోచిస్తున్నారు? తగ్గుతున్న పోలింగ్‌ శాతం ఏం చెబుతుంది? ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతంలోపు నమోదవడం దేనికి సంకేతం. ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా మారని తీరును ఏమనాలి? అసలు సిటీ జనులు ఏమనుకుంటున్నారు?

హైదరాబాద్‌లో పోలింగ్‌ శాతం ఎన్నికలకెన్నికలకూ మారిపోతోంది. కాలం పోటీ పడే సాంకేతిక యుగంలో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పనిచేసే ఓటర్లు పోలింగ్‌ను లైట్‌ తీసుకున్నట్టు కనపడుతుంది. పోలింగ్‌ డేను సెలవు దినంగా భావిస్తున్న నగర ప్రజలు వరుస సెలవులకు ముందు పోలింగ్‌ జరిగిందా ఇక అంతే. టూర్‌లకు వెళ్తూ ఓటు వేయడాన్ని విస్మరిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. డిసెంబరులో పోలింగ్‌ శుక్రవారం జరగగా శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో కొంత మంది అవుటింగ్‌కు వెళ్లారు. దీంతో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది.

హైదరాబాద్‌లో చదువుకున్న వారి సంఖ్య ఎక్కువే. కానీ ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రం వారు ఆసక్తి చూపడం లేదు. అసెంబ్లీ, లోక్‌సభ, గ్రేటర్‌ ఎన్నికలు ఏవైనా పోలింగ్‌ శాతం క్రమేణా తగ్గుతోంది. 2009 ఎన్నికల్లో నగరంలో 53.67 శాతం పోలింగ్‌ నమోదవగా 2014లో 52.99గా ఉంది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 45.27. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఏడెనిమిది శాతం పోలింగ్‌ తగ్గింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు 6 లక్షల బోగస్‌ ఓటర్లను తొలగించినప్పటికీ పోలింగ్‌ శాతం మాత్రం పెరగలేదు. తాజాగా 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ నగరంలో పోలింగ్‌ 50 శాతం మించలేదు. ప్రభుత్వ విభాగాలు ప్రచారం చేసినా ఓటర్లు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.

గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు వేర్వేరుగా జరగలేదు. ప్రస్తుతం కేవలం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. దీంతో పోలింగ్‌ శాతం మరింత తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. వార్డులో ఒక ప్రాంతంలో ఈవీఎంలను ఏర్పాటుచేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. దివ్యాంగుల కోసం పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపులు, ఇతర వసతులతోపాటు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. గతంలో రాజకీయ పార్టీలు వాహనాల్లో ఓటర్లను తీసుకురాగా గత కొన్నాళ్లుగా ప్రభుత్వ విభాగాలు కూడా ఆ బాధ్యత తీసుకున్నాయు. ఇంటింటికి పోలింగ్‌ స్లిప్పులు కూడా పంపిణీ చేస్తున్నారు. కాని నగరంలో మాత్రం పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories