మోడీ మిషన్‌.. సౌత్‌ఇండియా... వర్కవుట్‌ అవుతుందా?

మోడీ మిషన్‌.. సౌత్‌ఇండియా... వర్కవుట్‌ అవుతుందా?
x
Highlights

భారతీయ జనతా పార్టీకి పట్టున్న ప్రాంతం ఉత్తరాది. అందులోనూ ఉత్తరప్రదేశ్‌, కాషాయానికి ఆయువు పట్టు. 2014 ఎన్నికల్లో 71 స్థానాలు అక్కడే సాధించింది. ఈ...

భారతీయ జనతా పార్టీకి పట్టున్న ప్రాంతం ఉత్తరాది. అందులోనూ ఉత్తరప్రదేశ్‌, కాషాయానికి ఆయువు పట్టు. 2014 ఎన్నికల్లో 71 స్థానాలు అక్కడే సాధించింది. ఈ విజయమే, ఢిల్లీకి రాచబాటపరిచింది. కానీ ఇప్పుడు ఆస్థాయిలో సీట్లు సాధించడం కష్టమని భావిస్తున్నారు నరేంద్ర మోడీ. హిందీ హార్ట్‌ల్యాండ్‌ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఉత్తరాదినే నమ్ముకుంటే, మళ్లీ అధికారం కష్టమని భావిస్తున్న నరేంద్ర మోడీ, దక్షిణాదిపై దృష్టిపెట్టారు.

ప్రధాని నరేంద్ర మోడీ, ఈమధ్య వరుసగా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అనేక అభివృద్ది కార్యక్రమాలు, ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు. వ్యూహాత్మకంగా ప్రసంగాలు చేస్తున్నారు. తమిళనాడు, కేరళలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ, అక్కడ ఏర్పాటు చేసిన సభల్లో ప్రాంతీయ పార్టీలను పల్లెత్తు మాటా అనకపోవడం ఎత్తుగడలో భాగమేనని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో కలిపి 120 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఒక్క కర్ణాటకలోనే, బీజేపీ అధికారాన్ని దక్కించుకోగలిగింది. అలాగే 27 లోక్‌సభ స్థానాలకు 2014 ఎన్నికల్లో 17 సీట్లు సాధించింది. కర్ణాటకను తప్పిస్తే, మిగతా 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ బలం నామమాత్రమే. అందుకే తమకు కాస్తోకూస్తో అవకాశమున్న కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మోడీ.

తమిళనాడు, కేరళ పర్యటనలతో దక్షిణాదిలో మోడీ, ఎన్నికల శంఖం పూరించినట్టయ్యింది. మధురైలో ఎయిమ్స్‌‌కు శంకుస్థాపన చేశారు. అధికార అన్నాడీఎంకేను కానీ, ప్రతిపక్ష డీఎంకేను కానీ, ఆయన పల్లెత్తు మాటా అనలేదు. కేవలం కాంగ్రెస్‌, కమ్యూనిస్టులను విమర్శించడానికే పరిమితమయ్యారు. ఇది అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు కోరుకుంటోందనడానికి సంకేతంగా, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌తో కలిసి నడుస్తామని అధికారికంగా ప్రకటించిన డీఎంకేను సైతం విమర్శించకపోవడం, ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికల తర్వాత డీఎంకే సపోర్ట్‌ కూడా అవసరం రావొచ్చన్న ముందస్తు ఆలోచనతోనే, మోడీ వ్యూహాత్మకంగా ప్రసంగాలు చేశారని తెలుస్తోంది. మొత్తానికి మోడీ మిషన్‌ సౌతిండియా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories