మోడీకి ఈసారి నల్లేరు మీద నడకేం కాదు... ఎందుకు?

మోడీకి ఈసారి నల్లేరు మీద నడకేం కాదు... ఎందుకు?
x
Highlights

కష్టపడితే చాయ్ వాలా సైతం ప్రధాని కాగలరని నిరూపించిన మోడీ ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారా? విపక్షాలే కాదు.. స్వపక్షంలోనూ ఆయనపై...

కష్టపడితే చాయ్ వాలా సైతం ప్రధాని కాగలరని నిరూపించిన మోడీ ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారా? విపక్షాలే కాదు.. స్వపక్షంలోనూ ఆయనపై పెరుగుతున్న వ్యతిరేకత ఈసారి గెలుపు అంత సులభం కాదని తేల్చేస్తోందా. ఢిల్లీ వేదికగా జరిగిన ఒకరోజు దీక్షలో పరిణామాలు ఇవే సంకేతాలనిస్తున్నాయి. ప్రధాని మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? వచ్చే ఎన్నికల్లో మోడీ ని ఢీకొట్టేందుకు విపక్షాలు గట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాయని ఇవాల్టి ఢిల్లీ పరిణామాలు తెలియ చేస్తున్నాయి. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష కేంద్ర స్థాయిలో విపక్షాలను ఏకం చేసింది. హోదా సాధన పోరులో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ఒక రోజు దీక్ష దాదాపు 23 పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. చంద్రబాబు సారధ్యంలో జరిగిన ఒకరోజు నిరస దీక్షకు ప్రతిపక్షాలు భారీగా తరలి రావడం విశేషం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్.. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్,నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ లాంటి హేమా హేమీలు ఈ వేదికపై ఆసీనులయ్యారు. ఒకరి తర్వాత ఒకరు మోడీపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకతో కలసి యూపీలో రోడ్ షోలో పాల్గొనాల్సి ఉండటంతో దీక్షా స్థలి దగ్గర కొంత సమయం మాత్రమే గడిపారు. వివాదరహితుడైన మన్మోహన్ తో చంద్రబాబు చాలా సన్నిహితంగా మంతనాలు జరపడం కనిపించింది. అంతేకాదు.. రాహుల్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, శతృఘ్న సిన్హా లాంటి సీనియర్లతో చంద్రబాబు అత్యంత సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించారు. వచ్చే ఎన్నికల్లో మోడీని ఢీకొట్టేందుకు హోదా పోరాట వేదికను ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ సీఎం తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పారు.. తన రాజకీయ చతురతను వినియోగించి మోడీ వ్యతిరేకులను ఏకం చేయగలిగారు.. గత కొంత కాలంగా బిజెపికి దూరంగా ఉంటున్న శివసేన సైతం చంద్రబాబు కూటమికి మద్దతు తెలిపింది. శివసేన నేత సంజయ్ రౌత్ ఏపీ భవన్ కు వచ్చి తన మద్దతు ప్రకటించారు.

ఇక బిజెపిలో మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యశ్వంత్ సిన్హా, స్టార్ కాంపెయినర్ శత్రుఘ్న సిన్హా కూడా ఈ దీక్షకు సంఘీభావం ప్రకటించడం ఇవాల్టి సమావేశానికే హైలెట్. గుంటూరులో మోడీ చంద్రబాబును విమర్శించడంలో స్థాయి దిగి ప్రవర్తించారన్నారు సిన్హా.. మొత్తం మీద చంద్రబాబు నేతృత్వంలో ఒకరోజు ఢిల్లీ దీక్ష ప్రతిపక్షాల ఐక్యవేదికలా కనిపించింది. మరోవైపు యూపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక కూడా ఇవాళ యూపీలో నిర్వహించిన రోడ్ షో కాంగ్రెస్ బల ప్రదర్శన వేదికగా మారింది.. ఒకే రోజు రెండు భారీ ప్రదర్శనలు మోడీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులభం కాదని తేల్చేశాయి. మోడీ, అమిత్ షా జోడి పార్టీలో ఏకపక్ష పోకడలు పోతోందని మండిపడుతున్న ఆరెస్సెస్ వచ్చే ఎన్నికల్లో నితిన్ గడ్కరీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తుందన్న వార్తలొస్తున్నాయి.. ఏతావాతా మోడీకి 2019 ఎన్నికలు అంత సులభంగా మాత్రం ఉండబోవు.

Show Full Article
Print Article
Next Story
More Stories