మహాకౌశలం ఎవరిది! మధ్యప్రదేశ్‌లో సార్వత్రిక సమరం

మహాకౌశలం ఎవరిది! మధ్యప్రదేశ్‌లో సార్వత్రిక సమరం
x
Highlights

మధ్యప్రదేశ్‌లో సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఈనెల 29న పోలింగ్‌ జరగనుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే మూడు...

మధ్యప్రదేశ్‌లో సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఈనెల 29న పోలింగ్‌ జరగనుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే మూడు దశల పోలింగ్‌ ముగియగా మధ్యప్రదేశ్‌లో మాత్రం ఇదే తొలి దశ కానుంది. రాష్ట్రంలోని మొత్తం 29 లోక్‌సభ స్థానాల్లో అత్యంత కీలకమైన ఛింద్‌వాడా, జబల్‌పుర్‌, మండ్లా, బాలాఘాట్‌, సీధీ, శహడోల్‌ సీట్లకు తొలుత ఎన్నికలు జరగనున్నాయి.

ఛింద్‌వాడా నుంచి నకుల్‌నాథ్‌లో పోటీ చేస్తుండగా, రాకేశ్‌‌సింగ్‌ జబల్‌పుర్‌ బరిలో ఉన్నారు. ఛింద్‌వాడా నుంచి కమల్‌నాథ్‌ 9 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ దఫా తన కుమారుడు నకుల్‌ను కాంగ్రెస్‌ తరఫున బరిలో దించారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఆరెస్సెస్‌ కార్యకర్త నాథన్‌ షా కవరేతి పోటీలో ఉన్నారు. నాథన్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడంపై బీజేపీ తొలుత అసమ్మతి చెలరేగింది. నకుల్‌ విజయానికి పరోక్షంగా సహకరించేందుకే కాంగ్రెస్‌తో కుమ్మక్కై బలహీన అభ్యర్థిని బరిలో దించారని అసమ్మతివర్గాలు ఆరోపించాయి. 1980 నుంచి కమల్‌నాథ్‌ బరిలో లేకుండా ఛింద్‌వాడా లోక్‌సభ సీటుకు ఎన్నికలు జరగనుండటం ఇది రెండోసారి మాత్రమే.

ఇక- మండ్లాఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలుపొందిన ఫగ్గన్‌ సింగ్‌ కులస్తేను బీజేపీ మరోసారి బరిలో దించింది. 2014లో కులస్తే ఇక్కడ లక్షకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఓంకార్‌ సింగ్‌ మరావీని తప్పించి ఈ దఫా కమల్‌ మరావీకి కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంటే దాదాపు 1.22 లక్షల ఓట్లు ఎక్కువగా దక్కించుకోవడం కాంగ్రెస్‌కు సానుకూలాంశం.

జబల్‌పుర్‌‌లో 28 ఏళ్లుగా బీజేపీదే హవా. చివరగా 1991లో కాంగ్రెస్‌ ఈ సీటును దక్కించుకుంది. గత ఎన్నికల్లో కమలదళం తరఫున రాకేశ్‌ సింగ్‌ రెండు లక్షలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. మళ్లీ ఆయనే బరిలో దిగారు. అంతర్గత కలహాలు బీజేపీని కలవరపరుస్తున్నాయి. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న ఏకైక స్థానం బాలాఘాట్‌. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బోధ్‌ సింగ్‌ ఇక్కడ విజయం సాధించారు. అనంతరం అంతర్గత కలహాలతో బోధ్‌ పార్టీని వీడాల్సి వచ్చింది. ప్రస్తుతం కమలదళం ధాల్‌ సింగ్‌ బిసేన్‌కు టికెట్‌ కేటాయించింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మధు భగత్‌ను కాంగ్రెస్‌ ఇక్కడ బరిలో దించింది.

సిట్టింగ్‌ ఎంపీ రీతి పాఠక్‌పై సీధీపై బీజేపీ భరోసా ఉంచింది. ఆమెకే మళ్లీ టికెట్‌ కేటాయించింది. ఈ స్థానంలో గిరిజనుల ఓట్లు 37 శాతం, ఓబీసీల ఓట్లు 28 శాతం ఉన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య శహడోల్‌‌లో ఆసక్తికర పోరు నడుస్తోంది. కమలదళం హిమాద్రీ సింగ్‌ను పోటీలో నిలిపింది. లోక్‌సభ ఎన్నికలతోపాటే ఈ నెల 29న ఛింద్‌వాడా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ తరఫున సీఎం కమల్‌నాథ్‌ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనపై బీజేపీ యువ నేత వివేక్‌ సాహుని బరిలో దింపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories