logo

పాదయాత్రలే ప్రత్యామ్నాయ వేదికలా... యాత్రలతో దక్కిన ఫలమేంటి?

పాదయాత్రలే ప్రత్యామ్నాయ వేదికలా... యాత్రలతో దక్కిన ఫలమేంటి?

రాజకీయాల ట్రెండ్ మారుతోంది. కేవలం అయిదేళ్ల కోసారి మాత్రమే ప్రజల ముఖం చూసే నేతలు ఇప్పుడు రూట్ మార్చారు. ఎన్నికలకు ముందే వారికి చేరువవ్వాలని, మనసు గెలవాలని ప్రణాళికలు రచించుకుంటున్నారు. పాదయాత్రలతో పలకరిస్తున్నారు. మీకోసం వస్తున్నా అని ఒకరంటే.. ఇది మరో ప్రజా ప్రస్థానం అని మరొకరంటున్నారు. ిిఇనుము వేడి మీదే వంగుతుందన్నట్లు ప్రజాసమస్యలని పట్టించుకున్నప్పుడే ప్రజలకు చేరువ కావడం సాధ్యపడుతుందని మన నేతలు నమ్ముతున్నారా? ప్రజల మనసు గెలిచేందుకు పాదయాత్రలే ప్రాతిపదికలవుతాయా?

పాదయాత్ర.. ప్రజా సమస్యలను తెలుసుకోడానికిదో ప్రత్యామ్నాయ వేదిక.. రాజకీయ నాయకులు చాలా అలవోకగా చేస్తున్న విన్యాసం. ప్రజల కోసం నేతలు నడుచుకుంటూ రావడం ఇప్పుడున్న రాజకీయాల్లో నయా ట్రెండ్.. గతంలో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం కోసం చైతన్య రథంపై తిరిగితే ఇప్పుడు ఎన్నికలకు ముందే గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం నేతలు పాదయాత్ర చేపడుతున్నారు. ఇక- తెలుగుదేశం.. పిలుస్తోంది రా.. కదలిరా.. అంటూ అప్పట్లో చైతన్య రథంపై అన్న ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునందుకుని యావత్ తెలుగు జాతి పులకించిపోయింది. ఎన్టీఆర్‌కి వున్న చరిష్మాకి తోడు.. ఆయన వాగ్ధాటి, నటనా వైదుష్యం ఆయనకు బాగా ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన తెలుగు ప్రజలు ఎన్టీఆర్ పిలుపందుకుని వీధుల్లోకి పరిగెత్తారు. చైతన్యరథం కదిలిన చోటల్లా నేల ఈనిందా అన్నంతగా జనం తరలివచ్చారు. అప్పటి వరకూ ఎన్నికల ప్రచారం అంటే బహిరంగ సభలు, ర్యాలీలకే పరిమితం. ఆ దశలో ఎన్టీఆర్ చైతన్య రథ యాత్ర కొత్త ట్రెండ్ సృష్టించింది. ఆ తర్వాత బిజెపి శ్రేణులు అడ్వానీ ఆధ్వర్యంలో సాగించిన రథ యాత్రను విశేషంగా చెప్పుకోవచ్చు. జనంలో ఈ రెండు యాత్రలు బాగా సక్సెస్ అయ్యాయి.

ఆ తర్వాత నుంచే యాత్రల ట్రెండ్ మారింది. అప్పటి వరకూ వాహనాల్లోనే సాగిన యాత్రకు వైఎస్ కొత్త కలరింగ్ ఇచ్చారు. అదే పాదయాత్ర.. తానే ప్రజల వద్దకు నడుచుకుంటూ వెళ్లడం. ఇది ప్రజల మనసును బాగా హత్తుకుంది. వైఎస్ చేసిన పాదయాత్ర ఎడారిలాంటి కాంగ్రెస్‌కి జవజీవాలనిచ్చింది. పాదయాత్రలకే వైఎస్ ప్రజాప్రస్థానం ఓ రోల్ మోడల్‌గా నిలిచింది. చంద్రబాబు హైటెక్ పాలనలో కనీసావసరాలే కరువవడంతో ప్రజలు అసహనంతో రగిలిపోతున్న వేళ వైఎస్ చేపట్టిన పాదయాత్ర,. అప్పటి దాక ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు వరంగా మారింది. పేదోళ్లను ఖాళీ కంచం వెక్కిరిస్తుంటే, పెద్దోళ్లు సైబర్ మేడలు చూసుకుని మురిసిపోతున్న రోజుల్లో వైఎస్‌ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం రాష్ట్ర రాజకీయాలనే మార్చివేసింది. జనం గొంతుకయ్యేందుకు, వారి వెతలు వినేందుకు, ఆశాగీతికగా ముందుకు నడిచింది వైఎస్‌ ప్రజాప్రస్థానం. ఈ పాదయాత్ర వైఎస్ వ్యక్తిగత జీవితంలోనూ మార్పులు తీసుకొచ్చింది. ఈ యాత్రతో తనలో కోపం నరం తెగిపోయిందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. తనలో దూకుడు స్వభావానికి పాదయాత్ర బ్రేకలు వేసిందనీ చెప్పుకొచ్చారు. మరిప్పుడు ఆయన కుమారుడు ప్రజా సంకల్ప యాత్రకు ఇవాళ ముగింపు పలుకుతున్నారు. మరి తండ్రికి కలిసొచ్చిన పాదయాత్ర జగన్‌కు కలసి వస్తుందా... చూడాలి.

Santosh

Santosh

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top