వ్యక్తిగత ప్రతిష్టా.. పార్టీ ప్రతిష్టా.. పాదయాత్రలు చెబుతున్న నిజాలు

వ్యక్తిగత ప్రతిష్టా.. పార్టీ ప్రతిష్టా.. పాదయాత్రలు చెబుతున్న నిజాలు
x
Highlights

రాజకీయ పార్టీలు చేసే ఏ పాదయాత్రకయినా కొన్ని లక్ష్యాలుంటాయి. ఒకటి వ్యక్తిగత ప్రతిష్ట. రెండు పార్టీ ఇమేజ్.. మూడు అధికారం. వైఎస్ తన పాదయాత్రతో...

రాజకీయ పార్టీలు చేసే ఏ పాదయాత్రకయినా కొన్ని లక్ష్యాలుంటాయి. ఒకటి వ్యక్తిగత ప్రతిష్ట. రెండు పార్టీ ఇమేజ్.. మూడు అధికారం. వైఎస్ తన పాదయాత్రతో వీటన్నింటినీ సాధించారు. చంద్రబాబు కూడా ఈ మూడింటినీ అందుకున్నారు. మరిప్పుడు జగన్‌ దాన్ని సాధించగలరా? ఒక్క దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టగలరా? జగన్‌ రాజకీయ భవిష్యత్తు ఎలా వుంటుంది? పాదయాత్రలు రాజకీయ గెలుపునకు సోపానాలుగా మారిన సందర్భమిది.. వైఎస్ చేసిన పాదయాత్ర నిద్రాణంగా పడివున్న కాంగ్రెస్ శ్రేణులకు జవజీవాలనందించింది. ఇక పాదయాత్రలో తనకు ఎదురైన సమస్యలు, అనుభవాలను ఒక డైరీలో రాసుకున్న వైఎస్‌... ఆ తర్వాత పార్టీ మేనిఫెస్టోలో వాటికి స్థానం కల్పించారు. మరే రాష్ట్రంలోనూ లేని ఇక్కడ మాత్రమే వున్న ప్రజాకర్షక పథకాలవే. ఆత్మహత్యల బాట పట్టిన రైతుకు మానసిక ధైర్యం కల్పించారు. ఉచిత కరెంటు సౌకర్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే కరెంటు బకాయిల మాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు ఆరోగ్య ధీమా కల్పించిన ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, పావలా వడ్డీ, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్... ఇలా ముఖ్యమంత్రిగా వైఎస్ తెరతీసిన సామాన్యుని సంక్షేమ పథకాలన్నీ ప్రజా ప్రస్థానంలోనే పురుడు పోసుకున్నాయి. ప్రజా సమస్యల అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చిన సమస్యల పరిష్కారానికి సంక్షేమ పథకాలను రచించింది వైఎస్ ప్రభుత్వం.

వైఎస్ చేపట్టిన పథకాలన్నీ బడుగు, పేద, బలహీన వర్గాల వారికి ఇతోధికంగా ఉపయోగపడ్డాయి. మరి చంద్రబాబు పాదయాత్ర కూడా ఇలాగే సాగింది. పాదయాత్రతో చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ట.. పార్టీ ప్రతిష్ట పెరగడం ఖాయంగా మారింది. చివరకు అధికారాన్ని కట్టబెట్టింది. వైఎస్‌ లాగే చంద్రబాబు కూడా రైతులను ఇతర విభిన్న వర్గాలను తన యాత్రలో కలుపుకున్నారు. తాను మారిన మనిషిననీ తనను నమ్మాలంటూ భరోసా కల్పించడం సక్సెస్‌ అయ్యారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను గుర్తించి వాటికి తగిన ప్రణాళికలు రచిస్తూ పకడ్బందీగా యాత్ర కొనసాగించారు. చివరకు అధికారాన్ని అందుకున్నారు.

ఒక వైఎస్‌... ఒక చంద్రబాబే కాదు... దానికి ముందు తర్వాత కూడా పాదయాత్రలు కొనసాగాయి. 2009లో వైఎస్ ‌చనిపోయిన తర్వాత జగన్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మాటను ధిక్కరిస్తూ సాగించిన ఓదార్పుయాత్ర కూడా సంచలనమే. ఇక జగన్‌ జైల్లో వుండటంతో పార్టీ ఉనికిని కాపాడేందుకు జగన్ సోదరి షర్మిల రంగంలోకి దిగారు. పార్టీని ప్రజల్లో నిలబెట్టడానికి షర్మిల నడుం బిగించారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట పట్టారు. అదే సమయంలో పచ్చ దండు కూడా కదం తొక్కింది. వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు చేసిన మహా పాదయాత్ర ప్రభంజనంలా సాగింది. వాస్తవానికి 2014కి ముందు తెలుగుదేశానికి అగ్నిపరీక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బ తిన్న పార్టీని సంస్కరించడానికి చంద్రబాబు సమాయత్తమైన సందర్భం. అప్పట్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఓ వైపు, వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్‌లో ఏర్పడ్డ అనిశ్చితి... అటు తిరిగి ఇటు తిరిగి తెలుగుదేశానికే దెబ్బగా మారిన సమయంలో ఎంచుకున్న పాదయాత్ర... అధికారాన్ని హస్తగతమయ్యేలా చేసింది.

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... సమయమూ, సందర్భాన్ని బట్టి... పాదయాత్రలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేశాయనే చెప్పాలి. మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం సమయంలోనూ, అస్పృశ్యత నివారణ కోసం పాదయాత్రలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక భూదాన ఉద్యమ నేత వినోబాబావే 1951లో పాదయాత్ర చేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ జాతీయ సమ్యైక్యత బావన కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర సాగించారు. మన తెలుగువారికీ ఇచ్చాపురం నుంచి మద్రాస్ వరకు రైతు సమస్యలపై రైతు సంఘాల నేతలు పాదయాత్ర చేసిన చరిత్ర ఉంది. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ కూడా ఆ రాష్ట్రం అంతా ఒక యాత్ర చేసి వచ్చి జనాన్ని ఆకట్టుకున్నారు. ఇలా యాత్రా స్పెషల్ వ్యక్తిగత జీవితాలనే కాదు... పార్టీ ప్రతిష్ఠను పెంచిందనే చెప్పాలి. మరి జగన్‌ యాత్రను జనం ఆదరిస్తారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories