ఆశా నిరాశల మధ్య.. ఆశావహులు ఇలా ఆశలు పెట్టుకోవాల్సిందేనా?

ఆశా నిరాశల మధ్య.. ఆశావహులు ఇలా ఆశలు పెట్టుకోవాల్సిందేనా?
x
Highlights

టీఆర్ఎస్ అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ సాధించింది. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు కావస్తోంది. ప్రజాబలం ఉన్న నాయకుడిగా ఆయన తన సత్తా...

టీఆర్ఎస్ అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ సాధించింది. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు కావస్తోంది. ప్రజాబలం ఉన్న నాయకుడిగా ఆయన తన సత్తా చాటుకున్నారు. అలాంటి వ్యక్తికి మంత్రివర్గ కూర్పులో పెద్దగా ఇబ్బందులు ఎదురు కావాల్సిన అవసరం కూడా లేదు. అయినా మంత్రివర్గ విస్తరణ అదిగో....ఇదిగో అన్నట్లుగా ఎప్పటికప్పుడు ముందుకెళ్తూనే ఉంది. ఎందుకలా జరుగుతోంది అనే అంశం అందరికీ ఆసక్తిదాయకంగా మారింది. సీఎంగా కేసీఆర్ 2018 డిసెంబర్ 18న ప్రమాణ స్వీకారం చేశారు. అదే సందర్భంలో కొందరినైనా మంత్రులుగా తీసుకుంటారని అంతా భావించారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మహమూద్ అలీ ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ అదిగో....ఇదిగో అన్నట్లుగా ముందుకెళ్తూనే ఉంది. దీంతో టీఆర్ఎస్ నాయకులంతా అయోమయంలో పడిపోయారు. మొదట్లో సంక్రాంతి పండుగ తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండగలదని భావించారు. అప్పుడు కూడా వారికి నిరాశే ఎదురైంది. జనవరి చివర్లో ఐదురోజుల యాగం జరిగింది. అదయ్యాక మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం జరిగింది. ఆ తరువాత కూడా మంత్రివర్గ విస్తరణ జరుగలేదు. రెండు నెలలుగా ఒకే ఒక్క మంత్రివర్గ సహచరుడితో కేసీఆర్ రాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్ ముందరి కాళ్ళకు బంధం వేస్తున్న అంశమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వ్యతిరేకించే పరిస్థితులేవీ లేవు. అయినా కూడా మంత్రివర్గ విస్తరణలో జాప్యం ఎందుకు జరుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో రకరకాల ఊహాగానాలు తెరమీదకు రావడం మొదలైంది. వివిధ కారణాలతో కేటీఆర్, హరీశ్ రావులకు మంత్రి వర్గంలో స్థానం లభించకపోవచ్చనే వాదనలు వినవచ్చాయి. పాతవారి స్థానంలో కొత్తవారికి అధికంగా పదవులు దక్కే అవకాశం ఉందన్న మాటలూ వినవచ్చాయి. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో సీఎంతో సహా కనిష్ఠంగా 12 మంది, గరిష్ఠంగా 18 మంది మంత్రివర్గంలో ఉండవచ్చు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇప్పటి వరకూ ఎలాంటి మంత్రివర్గ సమావేశాలు జరుగలేదు. ఒక డజనుకుపైగా సమీక్షా సమావేశాలను కేసీఆర్ తన అధికారిక నివాసం, కార్యాలయమైన ప్రగతిభవన్ లోనే నిర్వహించారు. హోమ్, పోలీసు విభాగాలకు సంబంధించిన కొన్ని సమీక్షా సమావేశాల్లో మాత్రం మహమూద్ అలీ పాల్గొన్నారు. దీంతో అసలు మంత్రివర్గ విస్తరణలో ఎందుకు జాప్యమవుతోంది అనే అంశంపై అందరి దృష్టి పడింది.

కొన్ని విభాగాలను ఏకీకృతం చేయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారన్న వాదనలు వినవస్తున్నాయి. ఆ వాదనలో ఎంత నిజం ఉందోగానీ, అలాంటి అవసరమైతే ఉంది. పరస్పర సంబంధం ఉన్న విభాగాలను కలిపేస్తే మరింత పకడ్బందీగా సేవలు అందించేందుకు అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 60 విభాగాలు ఉన్నాయి. సీఎంతో సహా 18 మంది వీటి బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విభాగాలను ఏకీకృతం చేసే అంశంపైనే ఐఏెఎస్ అధికారుల బృందం పని చేస్తోందని కొందరు చెబుతున్నారు. ఆ కసరత్తు పూర్తయితే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పార్టీ నాయకులు అంటున్నారు. మరో కథనం ప్రకారం.... మంత్రివర్గ విస్తరణకు సరైన ముహూర్తం ఇంకా కుదరలేదు. శాఖల కేటాయింపులో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరుగుతున్నదని అనేవారూ ఉన్నారు.

టీఆర్ఎస్ సాధించిన ఘన విజయం అటు ప్రపజల్లో, ఇటు నాయకుల్లో ఎన్నో ఆకాంక్షలను పెంచింది. ప్రాతినిథ్య సమీకరణాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముస్లిం వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తూ మహమూద్ అలీ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి టీఆర్ఎస్ గట్టి మద్దతు పొందింది. ఆ వర్గాల ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. ఉన్న 16 మంత్రి పదవులకు గట్టిగా పోటీపడుతున్న వారి సంఖ్య రెట్టింపుగా ఉంది. దాంతో ఎంపికలో కొంత జాప్యం చేసుకుంటున్నదని పార్టీ నాయకులు అంటున్నారు. మిగిలిన పదహారు మందిని ఎంచుకోవడంలో ఎన్నో కుల, వర్గ, రాజకీయ సమీకరణాల మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉంది. రాబోయే లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో కేసీఆర్ బిజీగా ఉన్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆ కసరత్తు పూర్తయిన తరువాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మరికొందరు అంటున్నారు.

విపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించే యోచనలో టీఆర్ఎస్ ఉందని, అందుకే మంత్రివర్గ కూర్పు జాప్యమవుతోందన్న విమర్శలూ వినవస్తున్నాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో నెగ్గింది. కొంతమేరకు తన బలాన్ని చాటుకుంది. మరో వైపున లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ గెలుచుకునే వ్యూహంతో టీఆర్ఎస్ ఉంది. అలా చేయాలంటే విపక్షాన్ని మరింత బలహీనం చేయాల్సి ఉంటుంది. అలా చేసేందుకు మంత్రివర్గ విస్తరణను ఉపయోగించుకునే అవకాశం ఉందని ప్రత్యర్థులు భావిస్తున్నారు. తెలంగాణలో అన్ని లోక్ సభ స్థానాల్లోనూ విజయం సాధిస్తే....కేంద్రంలో కింగ్ మేకర్ కావచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ ఎత్తుగడనే నిజమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలహీనం కావడం ఖాయం. పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడంపై విపక్షాలు కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ....ఈ జాప్యం మరింకెన్నాళ్ళు అన్నదే సస్పెన్స్ గా మారింది. ఆ చిక్కుముడిని విప్పగలిగేది కేసీఆర్ ఒక్కరే. ఆయన గుప్పిట విప్పే వరకూ వేచి ఉండడం మినహా చేయగలిగిందేమీ లేదు. అప్పటి వరకూ ఆశావహులు అలా ఎదురుచూస్తూ ఉండాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories