మనసును మథిస్తున్న కేసీఆర్‌.. కేబినెట్‌ ఏ నిర్ణయం తీసుకుంటారు?

మనసును మథిస్తున్న కేసీఆర్‌.. కేబినెట్‌ ఏ నిర్ణయం తీసుకుంటారు?
x
Highlights

కేసీఆర్..... అంత త్వరగా ఎవరికీ అర్థం కారు. అలా అర్థమై ఉంటే ఆయన కేసీఆరే కాదు. ఇతరులను బాగా అర్థం చేసుకుంటూ.....తాను మాత్రం ఇతరులకు అర్థం కాని వ్యక్తే...

కేసీఆర్..... అంత త్వరగా ఎవరికీ అర్థం కారు. అలా అర్థమై ఉంటే ఆయన కేసీఆరే కాదు. ఇతరులను బాగా అర్థం చేసుకుంటూ.....తాను మాత్రం ఇతరులకు అర్థం కాని వ్యక్తే కేసీఆర్. అందుకే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో ఎవరూ తేల్చిచెప్పలేకపోతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోనో, మెజారిటీలేని ప్రభుత్వంలోనో ఈ తరహా సమస్య తలెత్తితే దాన్ని కాస్త అర్థం చేసుకోవచ్చు. పూర్తి మెజారిటీ ఉన్నా, తిరుగులేని నాయకుడిగా ఉన్నా కూడా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణను కేసీఆర్ పెద్దగా బయటపడడం లేదు. క్యాబినెట్ లో ఉన్న ఒక్క సహచరుడితోనే నెట్టుకువస్తున్నారు. మరి ఆయన అలా ఎందుకు చేస్తున్నారు? అదిగో...ఇదిగో అంటున్న జోస్యాలు, అంచనాలు ఎందుకు తప్పయిపోతున్నాయి? ఇంతకూ కేసీఆర్ మనస్సులో ఏముంది ? మంత్రివర్గ విస్తరణ దశలవారీగా జరుగుతుందా? కేటీఆర్, హరీశ్ లకు స్థానం దక్కుతుందా? పాత మంత్రుల మాటేమిటి?

యక్ష ప్రశ్నలు....బేతాళ ప్రశ్నలు....లాంటి వాటికి సమాధానం చెప్పడం కష్టం. వాటికే కాదు....తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని చర్యలకు సమాధానాలు అన్వేషించడం కూడా కష్టమే. ఎవరూ ఊహించని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో మేటి కేసీఆర్. ఒక విధంగా ఆ సాహసమే నాడు ఆయనను ఉద్యమనాయకుడిగా, ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వ సారథిగా చేసింది. ఉద్యమ కాలంలో కేసీఆర్ కు ఎంతో సన్నిహితంగా ఉన్న వారు సైతం ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో ఊహించలేకపోయారు. తాజాగా మంత్రివర్గ విస్తరణలోనూ ఇదే సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద మంత్రివర్గాలు, అతి చిన్న మంత్రివర్గాలు....ఇలా రకరకాలుగా మంత్రివర్గ కూర్పులో రికార్డులు, సంచలనాలు సృష్టించిన వారున్నారు. తాజాగా కేసీఆర్ మాత్రం సీఎంగా బాధ్యతలు చేపట్టినా పూర్తిస్థాయి మంత్రివర్గం లేకుండానే పాలన కొనసాగిస్తున్నారు. ఆ విధంగా ఆయన సరికొత్త రికార్డు, సంచలనం సృష్టించారు. మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడానికి అసలైన కారణాలు ఏమిటో ఎవరికీ తెలియదు....ఒక్క కేసీఆర్ కు తప్ప. మంత్రివర్గ విస్తరణపై వెలువడుతున్న వార్తలన్నీ రకరకాల లీక్ లతో కూడిన ఊహాగానాలే. అవన్నీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా అంచనాలను తప్పిపోయాయి. కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేసి రెండు నెలలు గడిచినా....ఒక్క సహచరుడితోనే మంత్రివర్గాన్ని ఏర్పరిచారు. రెండు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడలేదు.

రాష్ట్ర మంత్రివర్గానికి భారతరాజ్యాంగం పెద్ద పీట వేసింది. 163, 164 ఆర్టికల్స్ లో రాష్ట్ర మంత్రి మండలి గురించి ప్రస్తావించింది. ముఖ్యమంత్రి అధిపతిగా మంత్రివర్గం ఉండాలని.....స్వీయ విచక్షణాధికారాలు మినహా మిగిలిన అంశాల్లో రాష్ట్రపాలనలో గవర్నర్ కు మంత్రి మండలి తోడ్పడాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర అసెంబ్లీకి మంత్రివర్గం ఉమ్మడిగా బాధ్యత వహిస్తుంది. 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం....ఒక రాష్ట్రానికి కనీసం 12 మందితో కూడిన మంత్రివర్గం ఉండాలి. గరిష్ఠ సంఖ్య విషయానికి వస్తే.....రాష్ట్ర అసెంబీ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా మంత్రివర్గం ఉండవచ్చు. 2004 జూలై 7 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. మంత్రివర్గంలో కనిష్ఠ సంఖ్యను, గరిష్ఠ సంఖ్యను సూచించినప్పటికీ, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎన్నాళ్ళలో మంత్రివర్గాన్ని ఏర్పరచాలనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. సంకీర్ణ ప్రభుత్వాలు, మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భాలు మినహాయిస్తే.... సీఎం ప్రమాణ సందర్భంలోనే లేదా ఒకటి, రెండు వారాల్లోగా లేదా నెలలోగా కనీస మంత్రివర్గం ఏర్పడడం ఆనవాయితీగా వస్తోంది.

మంత్రివర్గంలోని సభ్యుల సంఖ్యపై నియంత్రణ లేనప్పుడు జంబో మంత్రివర్గాలు ఏర్పాటైన సందర్భాలు ఉన్నాయి. 88 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని నిర్వహించిన ఘనత ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉండిన ములాయం సింగ్ యాదవ్ కి దక్కింది. కాంగ్రెస్ సభ్యులకు సైతం మంత్రి పదవులు ఇచ్చేందుకు ఒక దశలో 105 కు సైతం మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆయన యోచించారు. ఈ విషయంలో బీహార్ కూడా వెనుకబడి లేదు. ముఖ్యమంత్రిగా రబ్రీదేవి ఉన్న సమయంలో మంత్రుల సంఖ్య 82కు చేరింది. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు. మహారాష్ట్రలో సుశీల్ కుమార్ షిండే సీఎంగా ఉన్న సమయంలో 69 మంది మంత్రులుగా ఉన్నారు. అందులో 23 మంది కేబినెట్ మంత్రులు. ఇక టి. అంజయ్య కాలంలో ఆయన మంత్రివర్గం 61 మంది మంత్రులతో జంబో కేబినెట్ గా ప్రసిద్ధి చెందింది. కేంద్రం సూచన మేరకు మంత్రుల సంఖ్యను ఆయన 45కు తగ్గించారు. పశ్చిమ బెంగాల్ లో బుద్ధదేవ్ భట్టాచార్య సీఎంగా ఉన్న కాలంలో 44 మంది మంత్రులుగా ఉన్నారు. ఇక అతి తక్కువ మంది మంత్రులతో కొనసాగిన మంత్రివర్గాలు కూడా ఉన్నాయి. పుదుచ్చేరికి ఎన్. రంగస్వామికి సీఎంగా ఉన్న సమయంలో కేవలం ఐదుగురే మంత్రులుగా ఉన్నారు. ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఆరుగురితోనే మంత్రివర్గం కొనసాగింది. హర్యానాకు ఓంప్రకాశ్ చౌతాలా సీఎంగా ఉన్న కాలంలో 11 మంది మంత్రులుగా ఉన్నారు. గోవాలో మంత్రుల సంఖ్య 13గా ఉండింది. మొత్తం మీద 91వ రాజ్యాంగ సవరణ అమల్లోకి రావడంతో కనిష్ఠ సభ్యుల సంఖ్య 12గా, గరిష్ఠ సభ్యుల సంఖ్య అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15 శాతంగా ఉంది.

మంత్రివర్గంలోని మంత్రుల సంఖ్యకు గరిష్ఠ పరిమితి విధించడంపై అసంతృప్తి వ్యక్తమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నిబంధన ప్రకారం తెలంగాణలో కనిష్ఠంగా 12 మంది, గరిష్ఠంగా 18 మంది మాత్రమే మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గరిష్ఠ సంఖ్య విషయంలో అసంతృప్తి వెలిబుచ్చారు. అందుకే ఆయన పార్లమెంటరీ కార్యదర్శులను కూడా నియమించే యోచన చేశారు. గతంలో కూడా ఆయన పార్లమెంటరీ కార్యదర్శులను నియమించినా.... ఆ విషయం న్యాయస్థానాలకు ఎక్కింది. హైకోర్టు ఉత్తర్వులతో వారికి ఆ పదవులు పోయాయి. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలుపొందింది. పాతవారితో పాటుగా కొత్తవారు సైతం మంత్రిపదవులు కోరుకుంటున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణలో సీఎంతో సహా18 మంది కంటే ఎక్కువ మంది మంత్రివర్గంలో ఉండేందుకు వీల్లేదు. దీంతో మంత్రివర్గ కూర్పు కత్తి మీద సాములా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories