మంచుకొండల్లో మారణహోమం వెనుక మతలబేంటి?

మంచుకొండల్లో మారణహోమం వెనుక మతలబేంటి?
x
Highlights

మంచు కొండల్లో నిప్పు రాజుకుంది.. జమ్మూ కశ్మీర్ లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మహ్మద్ ఆత్మాహుతి దాడి మన దేశానికి ముప్పేట పొంచి ఉన్న ప్రమాదాన్ని...

మంచు కొండల్లో నిప్పు రాజుకుంది.. జమ్మూ కశ్మీర్ లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మహ్మద్ ఆత్మాహుతి దాడి మన దేశానికి ముప్పేట పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియచెబుతోంది. భారత గడ్డపై కొంత కాలంగా కనిపించని ఆత్మాహుతి దాడులు మళ్లీ మొదలయ్యా యనిపిస్తోంది. భారత సరిహద్దులు మూడువైపులా ఎంత బలహీనంగా ఉన్నాయో జరుగుతున్న పరిణామాలే తెలియ చేస్తున్నాయి.. కశ్మీర్ లో సమస్య రావణ కాష్టంలా రగులుతుండగానే తాజాగా పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ బుసకొడుతోంది. ఇక ఈశాన్య సరిహద్దుల్లో చైనా ఎప్పటినుంచో సైలెంట్ గా చొరబాట్లు కానిస్తూనే ఉంది.

భారత్ కు ముప్పేట ముప్పు ఏ రూపంలో ముంచుకొస్తోందో ఇప్పుడు చూద్దాం.. ముందు కశ్మీర్ గురించి.. కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ అధీన రేఖను దాటి చొరబాట్లకు పాల్పడటం, కవ్వింపు కాల్పులకు పాల్పడటం కొన్నాళ్ల నుంచి మనం చూస్తున్నదే.. ఇప్పుడు ఆత్మాహుతి దళాలు కశ్మీర్ లోయను ఏకంగా చొరబాట్ల ప్రాంతంగా మార్చేశాయి.కశ్మీర్ లోయపై పట్టు కోసం ఇటు భారత్, అటు పాకిస్థాన్ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఆ ఫలితమే ఇప్పుడు నిశ్శబ్దం తాండవించాల్సిన మంచుకొండల్లో ఎప్పుడూ తూటాల శబ్దాలు మార్మోగుతూనే ఉంటాయి.అల్లర్లకు బలైన కుటుంబాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, రాళ్ల దాడులు, యువత ధర్నాలు, బంద్ లు, రాస్తారోకోలు, మూక దాడులు..బాంబుల మోతలతో భూతల స్వర్గం కాస్తా నరకంగా మారిపోయింది.

స్వాతంత్ర్య కాలంలోనూ, ఆతర్వాత 1987లో రాజీవ్, ఫరూక్ అబ్దుల్లా ఒప్పందం కాలంలో మాత్రమే మంచుకొండల్లో ప్రశాంతత కనిపించింది . అప్పట్లో ఎన్నికలను రిగ్గింగ్ చేశారంటూ ఇస్లామిక్ పార్టీలు గోల పెట్టాయి.కశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని కొందరు కోరుకుంటే.. మరికొన్ని వర్గాలు భారత్ నియంత్రణను, మరికొన్ని వర్గాలు పాకిస్థాన్ కంట్రోల్ ను కోరుకున్నాయి. ఈ క్రమంలోనే లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ జిహాద్ ఏ ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిదీన్, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, జైషే మహ్మద్ లాంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. ముస్లిం ఛాందస వాద వర్గాల జోక్యంతో ఈ ఆందోళనలు, ఆ తర్వాత కాలంలో జిహాదీ దాడులకు, ఫిదాయీ దాడులకు కారణమయ్యాయి. నిరుద్యోగ కశ్మీర్ యువతను ఆకర్షించిన ఉగ్రవాద ముఠాలు వారికి శిక్షణ నిచ్చి భారత భద్రతా దళాలపై రాళ్ల దాడులకు పురికొల్పాయి. చొరబాటుదార్ల మాటలను నమ్మి మతం మత్తులో మునిగిన యువత ఉగ్రవాద శిక్షణ పొంది ఇదిగో ఇలా దాడులకు పాల్పడుతోంది. గురువారం నాటి దాడులకు కారకుడైన అదిల్ అహ్మద్ దార్ కూడా అలాంటి వాడే..జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాటి సంస్థలు ఉత్తర కశ్మీర్ పై పట్టు సంపాదించాయి. 2016లో ఉరీ దాడులు, పఠాన్ కోట్ విమానాశ్రయంపై దాడులు అలాంటివే..

Show Full Article
Print Article
Next Story
More Stories