బాబు పోరాటం ఈవీఎంలపైనేనా?

బాబు పోరాటం ఈవీఎంలపైనేనా?
x
Highlights

ఈవీఎంల అవకతవకలపై కొన్ని రోజులుగా ఎన్నో కథనాలు ప్రచారం అవుతున్నాయి. రకరకాల అనుమానాలు రోజు రోజుకూ వ్యక్తం అవుతున్నాయి. వీటిని కొట్టిపారేసే అవకాశమూ ...


ఈవీఎంల అవకతవకలపై కొన్ని రోజులుగా ఎన్నో కథనాలు ప్రచారం అవుతున్నాయి. రకరకాల అనుమానాలు రోజు రోజుకూ వ్యక్తం అవుతున్నాయి. వీటిని కొట్టిపారేసే అవకాశమూ లేదు. ఎందుకంటే, టెక్నాలజీలో లోపాలు సహజంగానే ఉంటాయి. ఎప్పటికప్పుడు లోపాల్ని సరిచేసుకుంటూ వెళుతుంటారు. ఇపుడు ఈవీఎం లకు సంబంధించీ అదేవిధంగా ఎందుకు ఆలోచించడం లేదన్నది ప్రశ్న. ఇక రాజకీయ కోణంలో చూస్తే.. ఈవీఎం ల పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలుపెరుగని పోరాటాన్ని చేస్తూ వస్తున్నారు. లోపాలున్నాయంటూ మొదట్నుంచీ చెప్పుకొస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు అనుమానాలన్నిటినీ రాజకీయ కోణంలోనే అందరూ చూస్తున్నారు. సుప్రీం కోర్టులో ఇటీవల చంద్రబాబు, ఇతర పార్టీల నాయకులు వేసిన పిటిషన్ ను కొట్టివేశారు. దీనితో ఆయన ప్రత్యర్ధులు ఈ అంశాన్ని విపరీతంగా బాబు వైఫల్యం అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ, నిజానికి చంద్రబాబు నాయుడు ఈవీఎం ల పై తన అనుమానాల్ని ఎప్పుడో వ్యక్తీకరించారు. దానికి ఇపుడు బాబును విపరీతంగా విమర్శస్తున్న బీజేపీ నాయకుడు జీవీఎల్ ప్రత్యక్ష సాక్షి. అయన రాసిన పుస్తకానికి ముందు మాట రాస్తూనే అప్పట్లో ఈవీఎం ల విధానంపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. అటు తరువాత కూడా పలు సార్లు తన అసహనాన్ని ప్రకటిస్తూనే వచ్చారు. అయితే, ఇపుడు చంద్రబాబు చేస్తున్న పోరాటాన్ని ఓటమి ముందున్న భయంతో ముందుగానే నెపాన్ని ఈవీఎం ల పై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ప్రత్యర్థులు విరుచుకు పడుతున్నారు. నిజానికి.. ఆయనే అలా చేయాలనుకుంటే అసలు ఈవీఎంల విషయాన్నే ఎత్తేవారు కాదనేది లాజికల్ గా ఆలోచించేవారికి అర్థం అవుతుంది. ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతుంటే కనుక ఓటమి ఎదురైన తరువాత ఇంక చెప్పుకోవడానికి ఏమి మిగలదు. ప్రత్యర్థులు అంతలా విమర్శిస్తున్నప్పటికీ తానూ ఈవీఎంల విషయంలో పక్కకి జరిగేది లేదని ఆయన చెబుతుండడం గమనార్హం. కోర్టు నిర్ణయాన్ని ప్రకటించినా.. ఈవీఎం ల పై తన పోరాటం ఆగదని చెబుతున్న వైనాన్ని అందరూ చుస్తూనే ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడు పదేపదే ఒక అంశంపై విస్తృతంగా అభ్యంతరాన్ని వినిపిస్తున్నారంటే దానిలోని మర్మమేమిటన్నది ఆలోచించాల్సిందే. చంద్రబాబు అనుమానిస్తున్నది ఈవీఎంలను కూడా కాదు. ఈవీఎంలు పనిచేస్తాయి. కానీ కొందరు దుష్టశక్తుల చేతిలో అధికారం ఉన్న నేపథ్యంలో వాటిని ఏమైనా మాయ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు అవి లేకపోతే జరిగే నష్టం ఏముందని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఇపుడున్న పరిస్థితుల్లో వీవీ పాట్లు అయినా లెక్కించండి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాని ఈవీఎంలను కాదు బాబు వ్యతిరేకిస్తున్నది. టెక్నాలజీని బాబు ఎపుడూ వ్యతిరేకించరు. అది మంచి చేతుల్లో ఉన్నపుడు మాత్రమే మంచి జరుగుతున్నది చంద్రబాబు వాదన. ఏదిఏమైనా ఈవీఎంల పనితీరుపై ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వం చొరవ తీసుకుని పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories