మన సంస్కృతిని మనమే ధ్వంసం చేసుకుంటున్నామా... ఇదే ఇప్పటి ట్రెండా?

మన సంస్కృతిని మనమే ధ్వంసం చేసుకుంటున్నామా... ఇదే ఇప్పటి ట్రెండా?
x
Highlights

ఎన్నో యురోపియన్ దేశాలు లౌకిక దేశాలుగా చలామణిలో ఉన్నాయి. అంత మాత్రాన అవి తమ క్రైస్తవ మత సంప్రదాయాలపై ముసుగులు వేయడం లేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ...

ఎన్నో యురోపియన్ దేశాలు లౌకిక దేశాలుగా చలామణిలో ఉన్నాయి. అంత మాత్రాన అవి తమ క్రైస్తవ మత సంప్రదాయాలపై ముసుగులు వేయడం లేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ వాటిని పాటిస్తూనే ఉన్నాయి. ఇండోనేషియా లాంటి దేశాల సంస్కృతిలో రామాయణం ఒక ముఖ్యభాగం. ముస్లింల ప్రాబల్యం ఉన్నప్పటికీ అవి రామాయణ సంస్కృతికి పట్టం కడుతూనే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మన సంస్కృతిని మనమే ధ్వంసం చేసుకోవడం దేశంలో ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారుతోంది.

అమెరికా లౌకిక రాజ్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆ దేశ కరెన్సీపై ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ఉంటుంది. 1864 నుంచే ఆ సంప్రదాయం అమెరికాలో కొనసాగుతోంది. ఈ విషయంలో కొన్ని సంస్థలు కోర్టుకెక్కాయి. ఆ నినాదాన్ని మార్చేందుకు కోర్టులు అంగీకరించలేదు. అన్ని మతాలను సమానంగా చూస్తున్నంత కాలం ఆ నినాదాన్ని కొనసాగించేందుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేసింది. అమెరికాలో నిర్వహించిన పలు సర్వేల్లో 90 శాతం మంది ఆ నినాదాన్ని సమర్థించారు. అలా సమర్థించిన వారిలో భిన్న మతాల వారు, నాస్తికులు కూడా ఉన్నారు. అలా సమర్థించేందుకు ప్రధాన కారణం....అది మతంతో కాకుండా ఒక సంస్కృతితో ముడిపడి ఉండడమే. మరి అలాంటి వాతావరణం భారతదేశంలో ఎందుకు ఉండడం లేదు? అందుకు ప్రధాన కారణం....అటు మైనారిటీ వర్గాలు...ఇటు మెజారిటీ వర్గం కూడా అభద్రతాభావానికి లోనవుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ధోరణులు కూడా అందుకు ఒక కారణమే. పార్టీల దృక్పథాలు ఎలా ఉన్నప్పటికీ సంస్కృతి విషయంలో మాత్రం అవన్నీ ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది.

దేశంలో ఎన్నో క్రైస్తవ విద్యాసంస్థల్లో మతపరమైన ప్రార్థనలు జరుగుతుంటాయి. లక్షలాది హిందూ విద్యార్థులు సైతం ఆ ప్రార్థనల్లో పాల్గొంటారు. వాటి విషయంలో దేశంలో ఎక్కడా పెద్దగా వ్యతిరేకత రాలేదు. సంఘ్ పరివార్ అనుకూల సంస్థలు నిర్వహించే సంస్థల్లో హిందూ ప్రార్థనలు జరుగుతుంటాయి. అన్య మతాలకు చెందిన విద్యార్థులు కూడా వాటిల్లో పాల్గొంటారు. అక్కడ కూడా పెద్దగా వ్యతిరేకత రాలేదు. అలాంటప్పుడు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రాచీన సంస్కృత శ్లోకాలను పఠించే విషయంలోనే అభ్యంతరాలు రావడం దేశంలో ఉద్రిక్తతలు పెంచే అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. పరమత సహనం అనేది అన్ని మతాలకు చెందిన వారిలోనూ కనిపించినప్పడు మాత్రమే యావత్ దేశం ఒక జాతిగా మనగలుగుతుంది. లేకపోతే మతాల ఆధారంగా జాతులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories