పార్లమెంట్‌ ఎన్నికలపై భవన్‌ ఏమంటోంది?

పార్లమెంట్‌ ఎన్నికలపై భవన్‌ ఏమంటోంది?
x
Highlights

అసెంబ్లీ తరహాలోనే అధికార టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోందా ? సిట్టింగ్‌లకు సీట్లివ్వడం ద్వారా మరో భారీ విజయానికి సీఎంకేసీఆర్ వ్యూహ రచన...

అసెంబ్లీ తరహాలోనే అధికార టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోందా ? సిట్టింగ్‌లకు సీట్లివ్వడం ద్వారా మరో భారీ విజయానికి సీఎంకేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారా ? మెజార్టీ స్ధానాల్లో సిట్టింగ్‌లనే పోటీచేయించాలని కేసీఆర్ భావిస్తున్నారా ? అసంతృప్తులు, ఆశావాహులను బుజ్జగించేందుకు కేసీఆర్ .. ప్రణాళిక సిద్ధం చేశారా ? అంటే అవుననే సమాధానం హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్ నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్ వరకు వినిపిస్తోంది.

గులాబి పార్టీలో పార్లమెంట్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. మొత్తం 17 స్ధానాలకు గాను 16 సీట్లు లక్ష్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం చేస్తుంటే ... ఆశావాహుల్లో కొత్త సందడి ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే తమకే ఎంపీ సీటు ఇస్తారని మెజార్టీ ఎంపీలు భావిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌ నుంచి వెళ్లిపోయిన చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని మినహాయిస్తే 10 మంది సిట్టింగ్‌లతో పాటు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన మరో ముగ్గురు ఎంపీలున్నారు. అయితే వీరిలో పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డిలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో .. ఎంపీలుగా పోటీ చేసే అవకాశం లేనట్టే. వీరు కాక మిగిలిన 11 మందిలో ఎంత మందికి సీట్లు దక్కుతాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌ .. పార్టీ తరపున వీలైనన్ని ఎక్కువ స్ధానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఆచితూచి అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఎంపీ వినోద్‌ పేరును మాత్రమే ప్రకటించారు. ఇదే సమయంలో చేవేళ్ల నుంచి మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డిని బ‌రిలో దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మ‌రోవైపు మ‌ల్కాజ్ గిరి నుంచి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, లేదంటే మేయర్ బొంతు రామ్మోహన్‌లను దింపే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తు్న్నాయి.

పెద్దప‌ల్లి టికెట్‌‌ను మాజీ ఎంపీ వివేక్ ఆశిస్తున్నా .. తాజా పరిణామాల నేపధ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సమయంలో .... ప్రస్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీటు కేటాయించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్‌ స్ధానంపై గులాబి జెండా ఎగుర వేయాలని బలంగా భావిస్తున్న కేటీఆర్ బలమైన అభ్యర్ధి కోసం అన్వేషిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఢీ కొట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక నల్లగొండ నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతూ ఉండటం ... గుత్తా సుముఖంగా లేకపోవడంతో బలమైన అభ్యర్ధి కోసం కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. తేరా చిన్నప‌రెడ్డి, ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆరు నుంచి ఏడు చోట్ల సిట్టింగ్‌లకు సీట్లు ఖాయమనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. మిగిలిన చోట్ల బలమైన నాయకులను ఎంపిక చేసే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. పరిస్ధితులు ఎలా ఉన్నా శాసనసభలో ప్రారంభమైన కారు జోరు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కొనసాగుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories