హామీల వానలో తడుస్తుందెవరు... తరిస్తుందెవరు?

హామీల వానలో తడుస్తుందెవరు... తరిస్తుందెవరు?
x
Highlights

ఎన్నికలు అనగానే గుర్తుకొచ్చేవి వాగ్దానాలే. ఒక్కోసారి ఒక్క వాగ్దానం ఇవ్వడమే విజయతీరాన్ని చేరుస్తుంది. ఆ వాగ్దానం ఇవ్వకపోవడమే పరాజయం పాలు చేస్తుంది....

ఎన్నికలు అనగానే గుర్తుకొచ్చేవి వాగ్దానాలే. ఒక్కోసారి ఒక్క వాగ్దానం ఇవ్వడమే విజయతీరాన్ని చేరుస్తుంది. ఆ వాగ్దానం ఇవ్వకపోవడమే పరాజయం పాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల సందర్భంలో ఇది నిజమైంది. రైతు రుణ మాఫీ వాగ్దానమే ఇందుకు ఉదాహరణ. తాజాగా ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం మరోసారి వాగ్దానాల అస్త్రాలను సంధిస్తున్నాయి. ఇప్పటి వరకూ వాగ్దానాలు చేయడంలో వైెఎస్ జగన్ వన్ మ్యాన్ షో జరిగింది. ఇక ఇప్పుడు తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. కొత్త కొత్త సంక్షేమ పథకాలతో ప్రజలను ముంచెత్తారు. అసలు ఎవరు ఎలాంటి హామీలను ఇస్తున్నారు.....ఎదుటి వారి హామీలను ఇతరులు ఎలా సొంతం చేసుకుంటున్నారు....ఇంతగా వాగ్దానాలు చేయాల్సిన అవసరం ఉందా....ఎందుకు ఇలాంటి హామీలు ఇస్తున్నారు.....ఈ హామీలన్నీ ఆచరణసాధ్యమా....హామీల భారాన్ని ఆంధ్రప్రదేశ్ తట్టుకోగలదా....

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మొన్నటి వరకు పాదయాత్రలతో.... ఆ తరువాత శంఖారావాలతో విపక్ష నేత వైెఎస్ జగన్ అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. టీడీపీ మాత్రం హామీల విషయంలో మౌనంగానే ఉంటూనే తన చేతలతో కొత్త సంక్షేమ పథకాలను నెరవేర్చడం మొదలెట్టింది. అవన్నీ ఎన్నికలను ఉద్దేశించినవే అయినప్పటికీ నేరుగా ఆ విషయం మాత్రం టీడీపీ ప్రస్తావించడం లేదు. జగన్ ఇచ్చే హామీలను కొద్దిపాటి మార్పులతో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం....తమ పథకాలను తెలుగుదేశం కాపీ కొడుతున్నదని వైెఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శించడం.....తాము సైతం గతంలోనే వాటిని ప్రస్తావించామని తెలుగుదేశం వారు అనడం.... కొనసాగుతూనే ఉంది. ఎన్నికల వేళ ఇక తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు హామీల యుద్ధానికి పూర్తిస్థాయిలో తెర తీశారు. హామీలు ఇవ్వకముందే .....వాటిని అమలు చేసే కొత్త వ్యూహాన్ని పాటించారు.

ఎన్నికల సందర్భంలో హామీలు ఇవ్వడంతో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కూడా విపక్షనేత జగన్ కు దీటుగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కొత్తగా హామీలు ఇవ్వడం అంత తేలికేం కాదు.....ఈ నాలుగేళ్ళలో ఆ హామీలను ఎందుకు ప్రస్తావించలేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. అందుకే తాను ఇవ్వబోయే హామీలను ఏకంగా అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో కొన్ని జగన్ ఇచ్చిన హామీలు కూడా ఉండడం విశేషం. అయితే ఒక ఏడాదిగా చంద్రబాబు ప్రభుత్వం సైతం అలాంటి అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నందు వల్ల టీడీపీ వారు సైతం అవి తమవేనని చెప్పుకునే అవకాశం కలిగింది.

హామీలు ఇచ్చే విషయంలో గతంతో పోలిస్తే ఇప్పుడు నేతలు ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒక హామీ ఇచ్చేటప్పుడు అది ఆచరణసాధ్యమా....కాదా....అనే విషయం విస్మరిస్తున్నారు. ఏ హామీ ఇచ్చినా.....అది సాధ్యం కాదనుకుంటే....నిబంధనలు పెట్టి ఖర్చు తగ్గించుకోవచ్చునని చూస్తున్నారు. నేతల హామీలను పైపైన చూస్తే అవి సాధారణ ప్రజలందరికీ వర్తించేవిగా అనిపిస్తుంటాయి. అధికారం చేపట్టిన తరువాత మాత్రం ఆ హామీలను నెరవేర్చడం సాధ్యమయ్యే విషయం కాదని తెలుస్తుంది. ఈలోగా చేసిన వాగ్దానాలతో అధికారం వస్తుంది కదా....అనే మొండి ధైర్యం నేతలను ముందుకు నడిపిస్తోంది. అందుకే ఏపీలో ఇప్పుడు హామీల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories