కాంగ్రెస్ ఓట్లు చీల్చే పార్టీ మాత్రమేనా?

కాంగ్రెస్ ఓట్లు చీల్చే పార్టీ మాత్రమేనా?
x
Highlights

ఒకప్పుడు దేశాన్ని దశాబ్దాల పాటూ ఏలిన పార్టీ ఇప్పుడు ఓట్ కట్టర్ అంటే ఓట్లు చీల్చే పార్టీగా మిగిలిపోయిందంటున్నారు ప్రధాని మోడీ. అయిదవ దశ పోలింగ్ కోసం...

ఒకప్పుడు దేశాన్ని దశాబ్దాల పాటూ ఏలిన పార్టీ ఇప్పుడు ఓట్ కట్టర్ అంటే ఓట్లు చీల్చే పార్టీగా మిగిలిపోయిందంటున్నారు ప్రధాని మోడీ. అయిదవ దశ పోలింగ్ కోసం ప్రచార పదును పెంచిన మోడీ బెహన్ జీ మాయాపై సానుభూతి కురిపించారు. అంతేకాదు రాహుల్ కూడా డిఫెన్స్ కాంట్రాక్టులు చేశారంటూ ఆరోపించారు. అయిదో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ తన విమర్శల పదును పెంచారు. ఒకప్పుడు దేశాన్నేలిన పార్టీ ఇప్పుడు ఓట్లు చీల్చడానికే పరిమితమైందంటూ ప్రియాంక కామెంట్లపై విమర్శలు ఎక్కు పెట్టారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కలసి వారి స్వార్ధం కోసం బీఎస్పీ నేత మాయావతిని మోసం చేస్తున్నాయన్నారు. మహా ఘట్ బంధన్ లో లేకుండానే కాంగ్రెస్ నేతలు సమాజ్ వాదీ పార్టీతో కలసి ఎన్నికల ర్యాలీలలో సంతోషంగా వేదికలు పంచుకుని ప్రచారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

రాయబరేలీలో ప్రియాంక సమాజ్ వాదీ పార్టీ నేత ఏర్పాటు చేసిన ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడటంపై మోడీ ఈ కామెంట్ చేశారు. బెహన్జీ మాయాకు పాపం ఇవేమీ తెలియవని, ఆమె అమాయకంగా బలైపోతోందని సానుభూతి చూపించారు.తొలిదశ పోలింగ్ టైంకి ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారే నాలుగు దశలు పూర్తయ్యే సరికి ఓట్లు చీల్చే పార్టీగా మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు.ఈ మహా కూటమి పార్టీలకు పనేం లేదని పొద్దున్న లేచినది మొదలు తనను తిట్టడానికి డిక్షనరీ వెతికి మరీ కొత్త పదాలు కనిపెడుతున్నారన్నారు. ఒకప్పుడు పంచాయతీ ఎన్నికల నుంచి ప్రధాని పీఠం వరకూ అజేయంగా ఏళ్ల తరబడి ఏలిన పార్టీ ఇప్పుడు పతనావస్థను చవిచూస్తోందన్నారు. ప్రధాని పదవికి కలలు కనడం మాని మహా మిలావట్ ప్రతిపక్ష హోదా కోసం కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రాఫెల్ డీల్ స్కామ్ అంటూ తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న రాహుల్ కొంతమంది భాగస్వాములతో కలసి స్కార్పియాన్ పేరుమీద డిఫెన్స్ ఆఫ్ సెట్ కాంట్రాక్టులు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. మహా ఘట్ బంధన్ అధికారంలోకి వస్తే.. దేశ యువత సర్వనాశనమవుతారని హెచ్చరించారు. 80 సీట్లున్న యూపీలో నాలుగు దశల్లో 39 స్థానాలకు ఎన్నికలు పూర్తవగా, మిగిలిన మూడు దశల్లో 41 సీట్లకు పోటీ జరగాల్సి ఉంది. తొలి మూడు దశల్లో బీజేపీకి పెద్ద ఓట్లు రాలలేదన్న పార్టీ నేతల అంచనాలతో కలవరపడిన కమలం మాయావతిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని అందుకే మోడీ ఆమెకు అనుకూలంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories