Top
logo

బెంగాల్‌ దంగల్‌... దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందా?

బెంగాల్‌ దంగల్‌... దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందా?
X
Highlights

అత్యున్నత దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మగా మారుతున్నాయా? కేంద్రం తనకు నచ్చని...

అత్యున్నత దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మగా మారుతున్నాయా? కేంద్రం తనకు నచ్చని రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు దర్యాప్తు సంస్థలను ఒక ఆయుధంగా వాడుతోందా? బెంగాల్ లో మోడీ, వర్సెస్ దీదీ మధ్య యుద్ధం ఈ ఆరోపణలకు తావిస్తోంది. అవినీతిపై పోరాటం తప్పా అని బిజెపి ప్రశ్నిస్తే.. కక్షతోనే తమను వేధిస్తున్నారంటుంది దీదీ.. లోక్ సభ ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయం చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ముందు బెంగల్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈసారి ప్రధాని పదవికి అభ్యర్ధిగా భావిస్తున్న తరుణంలో బెంగాల్ వేదికగా రాజకీయాలు ఊపందుకున్నాయి. రాష్ట్రం ఒక్కసారిగా యుద్ధభూమిలా మారిపోయింది. మొన్నటికి మొన్న 23 ప్రాంతీయ పార్టీలు కొల్ కతా వేదికగా అతిపెద్ద ర్యాలీని నిర్వహించి బిజెపికి సవాల్ విసిరాయి. 42 సీట్లతో పశ్చిమ బెంగాల్ యూపీ తర్వాత అతి పెద్ద రాష్ట్రం కావడంతో అందరి చూపు దానిపైనే ఉంది. బెంగాల్ లో ఎన్నికల ప్రచారానికి వెడుతున్న బిజెపి నేతలకు దీదీ మమత చుక్కలు చూపిస్తున్నారు.. వారి సభలకు అనుమతులివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.

వివాదాస్పద రోజ్ వ్యాలీ స్కాం,శారదా చిట్ ఫండ్ స్కామ్ లపై దర్యాప్తు పేరుతో ఆదివారం హటాత్తుగా రాష్ట్రం అనుమతి లేకుండా సిబిఐ అధికారులు కొల్ కతా సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటి తలుపు తట్టడం మొత్తం గొడవకు కారణమైంది.తమ అనుమతి లేకుండా ప్రవేశించారంటూ నగర పోలీసులు సిబిఐ అధికారులను ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పడేశారు.. దాదాపు 25 మంది అధికారులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇది జరగగానే క్షణాల్లో మమత పోలీస్ కమిషనర్ ఇంటికి వచ్చి ఆయనకు మద్దతుగా అక్కడే బైఠాయించారు. కేంద్రం రాష్ట్రాలను ఇబ్బందుల్లో పెడుతోందని ఈవైఖరికి నిరసనగా ధర్నా చేస్తున్నామని బడ్జెట్ అక్కడనుంచే ప్రవేశ పెడతాననీ మమత తెలిపారు. మమతకు మద్దతుగా రాష్ట్ర పోలీసులు కూడా ధర్నాలో కూర్చున్నారు. ఇది ఐపీఎస్ అధికారుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం.. సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను అవసరమైతే సస్పెండ్ చేసే అధికారం కేంద్ర హోంశాఖకు ఉంది. అయితే మమత కావాలనే వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ కు రక్షణగా ఉండేలా బహిరంగ ప్రదేశాన్ని ఆఫీస్ గా మార్చుకోవడంతో ఆమెకు భద్రత కల్పించడం కోసం కమిషనర్ అక్కడ కూర్చోక తప్పని స్థితి కల్పించారు. తద్వారా టెక్నికల్ గా అధికారులను ఇబ్బందుల్లో పెట్టారు..

వాస్తవానికి చాలా కాలం నుంచే రోజ్ వాలీ స్కామ్, శారదా చిట్ ఫండ్ అవినీతి కేసుల్లో సాక్ష్యాధారాలను పోలీస్ కమిషనర్ తారుమారు చేస్తున్నారని సిబిఐ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే విచారణకు రమ్మని పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. ఆయన రాకపోవడంతో సిబిఐ అధికారులే ఆయన ఇంటికొచ్చారు.2017లోనే ఈ విచారణ నత్త నడక నడిచేలా అప్పటి సిబిఐ డైరక్టర్ అలోక్ వర్మను రాజీవ్ కుమార్ తప్పుదారి పట్టించారని, కేసు సాక్ష్యా ధారాలు నాశనం చేశారన్నది సిబిఐ ఆరోపణ. రాజీవ్ కుమార్ కు అనేక మార్లు సమన్లు, ఆదేశాలు జారీ చేసిన సిిబిఐ ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటిపై దాడి చేసింది. అయితే సిబిఐ కావాలనే వేధిస్తోందంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే పోలీస్ కమిషనర్ కు మద్దతు పలకడం, డీజీపీ ఇతర పోలీసు సిబ్బంది ఆమెకు అండగా నిలవడంతో బెంగాల్ లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్న విమర్శలు రేగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. బిజెపి నేతలను బెంగాల్ లో అడుగు పెట్టనివ్వబోమని మమతా బెనర్జీ బెదిరించారు. సెక్షన్ 144 అమల్లో ఉందని హెచ్చరించారు.

రాష్ట్రాలపై అలవిమాలిన పెత్తనం పెడుతూ సిిబిఐని కేంద్రం కక్ష సాధింపు పనిముట్టుగా వాడుతోందన్నది మమతా బెనర్జీ ప్రధానమైన ఆరోపణ.. విపక్షాల ర్యాలీ చూసి ఓర్వలేక కేంద్రం ఇలా వేధిస్తోందంటున్నారామె.. ఇప్పటికే కేంద్రంతో విభేదిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు హుటాహుటిన మమతాకు మద్దతు ప్రకటించారు. ఇతర పార్టీల మద్దతూ కూడగట్టే పనిలో ఉన్నారు. మొత్తం పరిస్థితిపై బెంగాల్ గవర్నర్ హోంశాఖకు నివేదిక సమర్పించారు.

Next Story