ఏపీలో ఎవరికి వారే... యమునా తీరే!!

ఏపీలో ఎవరికి వారే... యమునా తీరే!!
x
Highlights

జమిలీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ఒక్కొక్కటీగా క్లారిటీ వస్తోంది. పొత్తులు ఎత్తుల స్పష్టత వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ...

జమిలీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ఒక్కొక్కటీగా క్లారిటీ వస్తోంది. పొత్తులు ఎత్తుల స్పష్టత వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనుభవాలతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో మొదటిది కాంగ్రెస్-తెలుగుదేశం మధ్య లేదన్న రఘువీరా ప్రకటన. ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి ప్రకటించారు. ఇది ఏఐసీసీ తీసుకున్న నిర్ణయమని.. ఏపీ ఇంఛార్జి ఉమెన్ చాందీ ద్వారా తమకు తెలియజేశారని రఘువీరా తెలిపారు. టీడీపీతో అవగాహన జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని తెలిపారు. కాంగ్రెస్ ఒంటరి పోరుకు కారణమేంటి?...టీడీపీ వద్దనుకుందా?....కాంగ్రెస్సే దూరం పెట్టిందా?

కాంగ్రెస్ ఒంటరిపోరు వెనక చాలా కారణాలున్నాయి. తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీ చేయడం వికటించింది. దశాబ్దాల వైరమున్న టీడీపీతో వెళ్లడాన్ని, క్షేత్రస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. అవకాశవాద పొత్తుగా భావించిన జనం, వీరి పొత్తును తిరస్కరించినట్టయ్యింది. రాహుల్, సోనియాలు కదిలివచ్చినా, ఒకే వేదిక పంచుకున్నా, రోడ్ షోలు నిర్వహించినా, టీడీపీ-కాంగ్రెస్‌ పొత్తును జనం ఆమోదించలేదు. ఓట్లు బదలాయింపు జరగలేదు. పొత్తు వల్ల టీడీపీకి ఎంత నష్టమో పక్కనపెడితే, ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్సేనన్న విశ్లేషణలున్నాయి. ఏపీలోనూ ఇదే రిపీట్ అవుతుందనుకున్న కాంగ్రెస్, ఒంటరిపోరే మేలన్న నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది.

అయితే, అటు తెలుగుదేశానిది కూడా సేమ్ ఫీలింగ్. పొత్తుతో తెలంగాణలో కాంగ్రెస్‌కు దెబ్బ తగిలితే, ఇక్కడ టీడీపీకి తప్పదని బాబు భావించారు. అసలే రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకపోవడంతో, 2014లో కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కేశారు ప్రజలు. ఏపీలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు చెల్లాచెదురైంది. కాంగ్రెస్‌ను వైసీపీ రీప్లేస్ చేసింది. కీలక నేతలంతా, టీడీపీ-వైసీపీ, బీజేపీల్లోకి వెళ్లిపోయారు. 2014లోనే కాదు, 2019లోనూ కాంగ్రెస్‌కు ఒక్క సీటైనా వస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే ఎలాంటి ప్రయోజనమూలని, అనవసరపొత్తేందుకని చంద్రబాబు కూడా భావించారు. అందులోనూ బీజేపీతో స్నేహం ఉన్నంతవరకూ కాంగ్రెస్‌ను తిట్టినతిట్టు తిట్టకుండా బాబు తిట్టారు. రాష్ట్ర పరిస్థితికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను పొగిడితే, మొదటికే మోసమనుకుంటున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ, అదే పార్టీతో పొత్తుపెట్టుకుంటే, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు రగిలిపోయే ఛాన్సుంది. తెలంగాణ తరహాలోనే ఓట్ల బదలాయింపు అసాధ్యమన్నది బాబు భావన. అందుకే, కాంగ్రెస్‌తో పొత్తుకు, బాబు కూడా సుముఖంగా లేరు. జాతీయస్థాయిలో మాత్రం, ఉంటుందని చెబుతున్నారు.

అయితే సరిగ్గా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలిసిన, మరుసటి రోజే, పొత్తులేదని కాంగ్రెస్ ప్రకటించడం వెనకా, ఏదో మతలబు ఉందన్న వాదనా వినిపిస్తోంది. పొత్తుతో ప్లస్సులు, మైనస్‌లు రాహుల్‌కు చంద్రబాబు వివరించారని తెలుస్తోంది. ఎలాగూ ఏపీలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాదు కాబట్టి, లోక్‌సభ సీట్లు సాధించి, జాతీయస్థాయిలోనే కాంగ్రెస్‌కు మద్దతిస్తామని వివరించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు-రాహుల్‌ సమాలోచనల ఫలితమే, అధిష్టానం దూతగా వుమన్‌ చాందీ అమరావతికి రావడం, టీడీపీతో పొత్తుల్లేవని తేల్చడమన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్-టీడీపీల వ్యూహాత్మక ఎత్తుగడగా వైసీపీ ఆరోపిస్తోంది.

అయితే పొత్తుల్లేవని తేల్చినా, ప్రచారంలో అసలు సవాలు ఎదురుకాబోతోంది టీడీపీ-కాంగ్రెస్‌లకు. ఏపీ ఎన్నికల క్యాంపెయిన్‌లో కాంగ్రెస్‌ ఎవరిపై విమర్శలు చేస్తుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. అధికార తెలుగుదేశాన్ని విమర్శిస్తే, జాతీయస్థాయిలో పొత్తేందుకు పెట్టుకున్నారని వైసీపీ కార్నర్ చేస్తే, కాంగ్రెస్‌ దగ్గర సమాధానం ఉండదు. అలాగని ప్రధానప్రతిపక్షాన్ని కాంగ్రెస్ విమర్శించినా, అర్థం ఉండదు. అసలు ఏపీలో పెద్దగా ఉనికిలోలేని బీజేపీని మాత్రమే టార్గెట్ చేసినా, లాభం లేదు. ఏపీ వరకూ ఎన్నికల ప్రచారంలో, ఎవరిని విమర్శించి, ఎవరి విధానాలను తప్పుబట్టి, ఓట్లు అడగాలో కాంగ్రెస్‌కు బోధపడ్డంలేదు. అయితే, ప్రత్యేక హోదా ఒక్కటే తమకు సంజీవనిగా ఖద్దరు పార్టీ భావిస్తోంది. అది కాస్తోకూస్తో మేలు చేసినా, 2014లో చట్టంలో ఎందుకు చేర్చలేదన్న రెడీమేడ్ అస్త్రం కూడా, కాంగ్రెస్‌ వైపు దూసుకొస్తుంది. అలా కక్కలేక మింగలేక అన్న చందంగా ఉంది, కాంగ్రెస్ ఒంటరిపోరు. కానీ కాంగ్రెస్ సింగిల్‌ పోరుతో చంద్రబాబుకు కొత్త తలనొప్పి తప్పినట్టయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు జనసేన, ఇటు కాంగ్రెస్, వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే, తమకే లాభమని తెలుగుదేశం శ్రేణులు లెక్కలేస్తున్నాయి. కానీ ఏపీ వరకూ ఒంటరిపోరుతో, ప్రత్యక్షంగా కాంగ్రెస్‌కు ఎలాంటి లాభంలేదని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories