గెలుపు కోసం దశాబ్దాల వైరం పక్కన పెట్టిన నాయకులు?

గెలుపు కోసం దశాబ్దాల వైరం పక్కన పెట్టిన నాయకులు?
x
Highlights

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవ్వరూ ఉండరనటానికి నిదర్శనమే ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నాయకుల తీరు చూస్తే తెలుస్తుంది. గెలుపు కోసం...

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవ్వరూ ఉండరనటానికి నిదర్శనమే ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నాయకుల తీరు చూస్తే తెలుస్తుంది. గెలుపు కోసం దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి వైరిపక్షాలు ఒక్కటయ్యారు. తమపార్టీ గెలుపు కోసం కలసి పనిచేయటానికి నడుంబిగించారు. ఓటరు మహాశయులు మాత్రం ఇదంతా చూస్తూ ఔనా నిజమేనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాలలో నవశకానికి తెరలేచింది. నిన్నటి వరకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహరించిన వైరివర్గాలు మరికొద్ది వారాల్లో జరిగే ఎన్నికల్లో మిత్రులుగా, ఒకే గూటి పక్షులుగా మారిపోయారు. రాజకీయ భేదాలు, కుటుంబ తగాదాలు దశాబ్దాల శత్రుత్వాన్ని మరచిపోయి అధికార టీడీపీ విజయం కోసం కలసి పనిచేస్తామంటూ ముందుకు వచ్చారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకుల రాజకీయ చాతుర్యానికి మచ్చుతునకగా మిగిలిపోతుంది.

విజయనగరం జిల్లాలో కిశోర్‌చంద్రదేవ్‌, విజయరామరాజు ఒకే వేదికపైకి వస్తారని, కర్నూలు జిల్లాలో కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కలసి ప్రచారం చేస్తారని చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నారా, నల్లారి కుటుంబాలు చేతులు కలుపుతాయని, దశాబ్దాలుగా రాజకీయంగా, వ్యక్తిగతంగా కక్షలతో రగిలిపోయిన దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా వారసులు ఒకే పార్టీలో చేరతారని, ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కలసి పనిచేస్తారని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఆ అసాధ్యాన్ని టీడీపీ సహకారంతో వివిధ జిల్లాలలోని వైరివర్గాల నాయకులు సుసాధ్యం చేయగలిగారు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఈ రెండుకుటుంబాల నాయకులు ఒకే పార్టీలోకి వచ్చి కలసి పనిచేస్తారని కొద్ది రోజుల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉండరు. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్‌ గొడవలతో మొదలైన వైరం ఆ తర్వాత రాజకీయంగానూ కొనసాగింది. రామసుబ్బారెడ్డి కుటుంబం తెదేపా ఆవిర్భావం నుంచి వెన్నంటే ఉంది. ఆదినారాయణరెడ్డి కుటుంబం కాంగ్రెస్‌లో ఉండేది. తర్వాత వైకాపాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆదినారాయణరెడ్డి తెదేపాలో చేరి మంత్రి అయ్యారు. రామసుబ్బారెడ్డిని ఒప్పించి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు తెదేపాలో చేర్చుకున్నారు. ప్రస్తుతం తెదేపా తరఫున కడప ఎంపీ స్థానం నుంచి ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి బరిలో నిలిచారు.

కర్నూలు జిల్లా రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న కోట్ల, కేఈ కుటుంబాలు తొలిసారిగా చేతులు కలిపాయి.. సూర్యప్రకాశ్‌రెడ్డి తండ్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాదన్న కాలం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉండేది. వారిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా... ప్రత్యర్థులుగా కొనసాగేవారు. తెదేపా ఆవిర్భావం వరకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, మాదన్న కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఆ తర్వాత కేఈ వర్గం తెదేపాలోకి వచ్చి.. మళ్లీ కాంగ్రెస్‌లోకి.. ఆ తర్వాత తెదేపాలో చేరింది. మొదట్నుంచి కాంగ్రెస్‌లో కోట్ల వర్గం ఉంది. తాజాగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం సహా తెదేపాలో చేరారు. ఒకప్పుడు పరస్పరం ఎదురుపడేందుకూ ఇష్టపడని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కలిసి ప్రచారం సాగిస్తున్నారు.

అంతేకాదు చిత్తూరు జిల్లాలో గత నాలుగు దశాబ్దాల రాజకీయ విభేదాల్ని పక్కనబెట్టి ...నారా, నల్లారి కుటుంబాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ నేత నల్లారి అమరనాథ్‌రెడ్డికి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలు నడిపారు చంద్రబాబు. ఇప్పుడు అదే అమరనాథ్‌రెడ్డి కుమారుడు కిశోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇచ్చారు. కొన్ని నెలల కిందట కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి తెదేపాలో చేరగా ఆయనకు పీలేరు టిక్కెట్‌ను చంద్రబాబు ఖరారు చేశారు.

ఉత్తరాంధ్రకే మకుటంగా నిలిచే విజయనగరం జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులైన విజయనగరం, బొబ్బిలి రాజులు మరోపక్క కురుపాం, మేరంగి రాజులు ఇప్పుడు తెదేపాలో చేరటం ద్వారా ఒక్కటయ్యారు. చారిత్రక వైరాన్ని పక్కన పెట్టి రాజకీయ ఫలాల కోసం ఏకమయ్యారు. విజయనగరం రాజవంశానికి చెందిన అశోక్‌గజపతిరాజు 1982లో తెదేపాలో చేరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే బొబ్బిలి రాజకుటుంబానికి చెందిన మంత్రి సుజయకృష్ణ రంగారావు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌, 2014లో వైకాపా నుంచి గెలిచారు. తెదేపాలో చేరి మంత్రి అయ్యారు. ప్రస్తుతం అశోక్‌ గజపతిరాజు, సుజయకృష్ణరంగారావు సన్నిహితంగా పనిచేస్తున్నారు.

మరోవైపు కురుపాం సంస్థానాధీసులైన శత్రుచర్ల కుటుంబానికి, మేరంగి సంస్థానాధీశులైన వైరిచర్ల కుటుంబానికి తీవ్ర విభేదాలుండేవి. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉండి, కేంద్ర మంత్రిగా పనిచేసిన కిశోర్‌చంద్రదేవ్‌ ఇటీవలే తెదేపాలో చేరారు. మరోపక్క మాజీ మంత్రి విజయరామరాజు 2014లో తెదేపాలో చేరారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకోవడం, కలసి ప్రచారం చేస్తుండటం విశేషం.

ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి హనుమంతరావు రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహించేవారు. వీరిద్దరూ ఒకరు ఒక పార్టీలో ఉంటే, మరొకరు మరో పార్టీలో ఉండేవారు. ఒకరు తెదేపాలోకి వెళితే, మరొకరు కాంగ్రెస్‌లోకి వచ్చేవారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలూ తెదేపాలోనే ఉన్నాయి. కరణం బలరాం చీరాల నుంచి, గొట్టిపాటి హనుమంతరావు సోదరుడి కుమారుడు గొట్టిపాటి రవికుమార్‌ అద్దంకి నుంచి తెదేపా అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కరణం బలరాం, గొట్టిపాటి రవి రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్నారు.

ఇక విజయవాడలో కొన్ని దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న వంగవీటి, దేవినేని కుటుంబాలు ఇప్పుడు టీడీపీ గూటికి చేరాయి. గతంలో వంగవీటి రంగా కాంగ్రెస్‌లో ఉండేవారు. దేవినేని నెహ్రూ మొదట్లో తెదేపా.. తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి.. తిరిగి తెదేపాలోకి వచ్చారు. ఇటీవలే నెహ్రూ మరణించారు. ప్రస్తుతం రంగా, నెహ్రూ వారసులిద్దరూ తెదేపాలోనే ఉన్నారు. రంగా కుమారుడు రాధాకృష్ణ మొదట కాంగ్రెస్‌లోనూ.. తర్వాత ప్రజారాజ్యం, వైకాపాలో కొనసాగి వారం కిందట తెదేపా గూటికి వచ్చారు. మరోవైపు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గుడివాడ నుంచి పోటీ చేయనున్నారు.

అనంతపురం జిల్లాలో పరిటాల రవి, జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాల మధ్య తీవ్ర రాజకీయ వైరుధ్యాలు ఉండేవి. పరిటాల కుటుంబం ఆదినుంచి తెదేపాలోనే ఉంది. ఆయన చనిపోయిన తర్వాత సతీమణి సునీత రాప్తాడు నుంచి గెలిచారు. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జేసీ కుటుంబం తెదేపాలోకి వచ్చింది. ఇప్పటికీ పరిటాల, జేసీ కుటుంబాల మధ్య అంత సయోధ్య లేకపోయినా... రాజకీయంగా ఒకే పార్టీలో కొనసాగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా చూస్తుంటే బద్ధ శత్రువులను మిత్రులుగా ఒకే గూటి పక్షులుగా ఒకే పార్టీ నీడన నిలబెట్టే శక్తి రాజకీయాలకు మాత్రమే ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories