Top
logo

ఏపీ ప్రజలు ఎవరి మాట వింటారు.. పట్టం ఎవరికి కడతారు?

ఏపీ ప్రజలు ఎవరి మాట వింటారు.. పట్టం ఎవరికి కడతారు?
X
Highlights

రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో, సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనాదక్షత చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో...

రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో, సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనాదక్షత చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో పట్టంకట్టేలా చేశాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు ఉంటే, అనేక కష్టాలతో ఏర్పడిన రాష్ట్రానికి జవసత్వాలు వస్తాయని జనం నమ్మారు. అదే దిశలో అమరావతి నిర్మాణం, ప్రపంచం మెచ్చేలా తీర్చుదిద్దుతానని చంద్రబాబు ఆశలు రేపారు. కానీ ఈ నాలుగున్నరేళ్లలో రాజధాని నిర్మాణానికి, ఒక రూపంటూ ఎందుకివ్వలేదని వైసీపీ సంధిస్తోంది. అయితే నాలుగేళ్లలో, ఒక నగరం నిర్మాణం సాధ్యమా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదని, నిధులు విడుదల చేయడం లేదని అంటున్నారు. అయినా వృద్దిరేటులో దూసుకుపోతున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో బెస్ట్‌గా అవతరించామని చెప్పుకుంటున్నారు. పోలవరం నిర్మాణం ఒక రూపుకు తెచ్చామంటున్నారు. అభివృద్దిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. అయితే అమరాతి నిర్మాణంతో పాటు ప్రత్యేక హోదాపై యూటర్న్‌, ఫిరాయింపుల ప్రోత్సాహం బాబుకు ఇబ్బందేనంటున్నారు విశ్లేషకులు. ఏపీలో చంద్రబాబుకు ఈ ఎన్నికలు జీవన్మరణం. గెలిస్తే మరో ఐదేళ్లు అధికారం. లేదంటే ఊహించుకోవడమే టీడీపీ కార్యకర్తలకు కష్టం. ఈ అభివృద్ది కొనసాగాలంటే, మరోసారి ఛాన్సివ్వాలని బాబు కోరుతున్నారు. కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే, హోదా వస్తుందంటున్నారు.

ఏపీలో వైసీపీ అధినేత జగన్‌కు కూడా 2019 అగ్నిపరీక్ష. రెండు శాతం ఓట్లతో 2014లో అధికారానికి దూరమైన వైసీపీ, ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఏడాదిగా పాదయాత్ర చేస్తూ, జనం మనసులను గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలూ వింటూ, తాము అధికారంలోకి వస్తే, అన్ని విధాలా అందరూ సుభిక్షంగా ఉంటారని చెబుతున్నారు. చంద్రబాబు వాగ్దానాలు మరిచారని, రాజధానిపై గ్రాఫిక్స్ సినిమా చూపిస్తున్నారని, హోదాపై రోజుకో మాట మాట్లాడున్నారని, కాంగ్రెస్‌ను తిట్టి, అదే పార్టీతో జట్టుకడుతున్నారని జగన్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అనేక ప్రాజెక్టుల్లో అవినీతి ఏరులై పారుతోందని ఆరోపిస్తున్నారు. ఇవన్నీ జనంలోకి బలంగా వెళ్తున్నాయా....ప్రభుత్వ వ్యతిరేకతను బలపరుస్తున్నాయా..అన్నది నాలుగు నెలల్లో చెప్పబోతున్నారు ఏపీ జనం. గెలిస్తే, తొలిసారి అధికారంలోకి రావడమే కాదు, చిన్న వయస్సులోనే సీఎం అవుతారు జగన్. లేదంటే మరో ఐదేళ్లు నిరీక్షణ తప్పదు.

ఇక ప్రశ్నిస్తానంటూ ఐదేళ్ల క్రితమే ఆవిర్భవించిన జనసేన, అసలైన ప్రత్యామ్నాయం తానేనంటోంది. మొదట బీజేపీ, టీడీపీలతో జట్టుకట్టినా, అనేక పరిణామాల నేపథ్యంలో వాటికి కటీఫ్‌ చెప్పారు పవన్ కల్యాణ్. మొదటిసారి ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారు. ఇటీవలె గ్లాసు గుర్తు దక్కించుకున్నారు. మరి ఈ ఐదేళ్లలో పవన్‌ జనంలో నమ్మకం కలింగించారా...ఓటు బ్యాంకు సాధించుకున్నారా...అన్నది 2019లోనే తేలిపోతుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి పునాదుల పడాలంటే, 2019లో పవన్‌ పోరాడాల్సిందే. మరోవైపు ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో విజయఢంకా మోగించిన కేసీఆర్, ఫెడరల్ ప్రంట్‌ ప్రయత్నాల్లో మునిగిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు సాధించి, ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడాలంటున్నారు. రెండు కూటముల్లోలేని పార్టీలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ తాను అనుకున్న సంకీర్ణమే వస్తే, ఇక్కడ సీఎం పగ్గాలు కేటీఆర్‌కు అప్పగించి, ఢిల్లీలో కీలక పదవి చేపట్టాలని ఆలోచిస్తున్నారు కేసీఆర్. మరి కేసీఆర్ అంచనాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ లెక్కలు నిజమవుతాయో లేదో పక్కాగా చెప్పబోతోంది 2019 ఏడాది. ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు, అనేక పార్టీలు, అనేకమంది ఉద్దండ రాజకీయ నాయకుల తలరాతలు రాయబోతోంది 2019. చూడాలి వచ్చే నాలుగు నెలల్లో ఏం జరగబోతోందో....

Next Story