Top
logo

ఉత్కంఠ రేపుతున్న అమేథీ పోల్ సీన్

ఉత్కంఠ రేపుతున్న అమేథీ పోల్ సీన్
X
Highlights

అమేథీ ఓటు రాహుల్ కేనంటున్నారు అక్కడి జనం.. ఇందిర కుటుంబం తమకేం చేయకపోయినా.. తమ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే...

అమేథీ ఓటు రాహుల్ కేనంటున్నారు అక్కడి జనం.. ఇందిర కుటుంబం తమకేం చేయకపోయినా.. తమ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే చాలంటున్నారు. రాహుల్ గెలుపు తమ బాధ్యత అంటున్నారు. రాహుల్ ప్రధాని అయితే.. అది తమ నియోజక వర్గానికే గర్వ కారణం అంటున్నారు అమేథీ జనం. అమేథీతో ఇందిర కుటుంబానికి చాలా మానసిక అనుబంధం ఉంది. ఆ ప్రాంత ప్రజలు ఇందిర కుటుంబం అంటే ప్రాణం పెడతారు.. తమకోసం ఇందిర కుటుంబం ఏం చేసినా, చేయకపోయినా వారికి ఓటేయడం తమ నైతిక బాధ్యతగా భావిస్తారు. మోడీ అయిదేళ్లలో అద్భుతమైన అభివృద్ధి చేపట్టారని ఆయనకు మరో అయిదేళ్లు అవకాశం ఇవ్వాలని చెప్పే వారు సైతం అమేథీ వరకూ రాహుల్ కే తమ ఓటని తేల్చేస్తున్నారు.

మోడీ కంటికి కనిపించే అభివృద్ధి చేశారని ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని అనే అమేథీ జనం కూడా తమ ప్రాంతం విషయంలో మాత్రం తాము మనసా, వాచా రాహుల్ కే ఓటేస్తామంటున్నారు. మోడీ పెద్ద మనసు చేసుకుని అమేథీని వదిలేయాలని, అది గాంధీల కుటుంబం పుట్టినిల్లని వారంటున్నారు. రాహుల్ తమకు ఏం చేయకపోయినా, ఇక్కడనుంచి లోక్ సభకు వెళ్లడం తమకు గర్వ కారణమంటున్నారు అమేథీ వాసులు.

బీజేపీ అభ్యర్ధి స్మృతీ ఇరానీని సైతం ఈ ప్రాంత వాసులు మెచ్చుకుంటున్నారు.. తాము ఓడించినా నియోజక వర్గం వదలలేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనీ చెబుతున్నారు. పిప్రా విలేజ్ లో గోమతీ నదిపై ఆమె బ్రిడ్జి కట్టించారని చెప్తున్నారు. ఈసారి స్మృతీ, రాహుల్ మధ్య చాలా గట్టి పోటీ ఉందని, తాము రాహుల్ కి మద్దతు గా నిలబడాల్సిన బాధ్యత ఉందనీ అమేథీ వాసులంటున్నారు. గత పదిహేనేళ్లలో అమేథీకి రాహుల్ ఏం చేయక పోయినా, రాజీవ్ కుమారుడుగా, ఇందిర మనుమడుగా, కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆయన్ను గౌరవించి గుండెల్లో నిల్పు కోవాల్సిన బాధ్యత తమదేనంటున్నారు అమేథీ ప్రజలు. సంజయ్, రాజీవ్ అమేథీకి ఎంతో చేశారని వారు గుర్తు చేసుకుంటున్నారు.

రాహుల్ అమేథీ కోసం ఏం చేయకపోవడం వల్లనే స్మృతీ ఇరానీ ఇక్కడ పోటీకి దిగారని, ఇప్పుడు పోటీ నువ్వా నేనా అనే రేంజ్ లో సాగుతోందంటున్నారు. ఈ పోటీలో రాహుల్ ని గెలిపించుకోవడం తమ బాధ్యత అంటున్నారు. రాహుల్ ఏదో నాటికి ప్రధాని అవుతారు.. అది 2024 కావచ్చు లేదా 2029 కావచ్చు అప్పుడు అమేథీ ప్రధాని నియోజక వర్గం అవుతుంది. వీవీఐపీ నియోజక వర్గం అవుతుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా రాహుల్ ఎంతో కొంత మేలు చేసి తీరతారు కాబట్టి కాబోయే ప్రధానిని గెలిపించుకోకుండా ఎలా ఉంటాం అన్నది మరికొందరి వాదన.

అయితే అమేథీలో మరికొన్ని గ్రామాలు, వాడల జనం మాత్రం మోడీ అభివృద్ధి చేశారంటున్నారు. పేదలకు గృహనిర్మాణం, ఉజ్వల యోజనా పథకం, గ్యాస్ సిలిండర్లు, రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆరువేలు ఇవ్వడం లాంటి పథకాలు దళితులు, వెనుకబడిన వర్గాలను బాగా ఆకర్షిస్తున్నాయి. దాంతో తరతరాలుగా కాంగ్రెస్ ఓటర్లుగా ఉన్న వారు ఈసారికి బీజేపీ ఓటర్లుగా మారుతున్నారు. పేద గృహాలకు ఉచిత టాయిలెట్ల నిర్మాణం కూడా వారిని ఆకర్షించింది. ఎన్నికల ప్రచారం కవరేజ్ లో భాగంగా అమేథీ వెళ్లిన మీడియాతో స్థానికులంటున్నది ఒకటే.. ఇప్పటి వరకూ రాజీవ్, సంజయ్ ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని అడ్డుపెట్టుకుని రాహుల్ గెలుస్తూ వచ్చారు.రాహుల్ ఏం చేయకపోయినా.. ఆయన కుటుంబం మాకెంతో చేసింది. అలాంటప్పుడు రాహుల్ కి ఓటేయకుండా ఎందుకుంటాం అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.. అసలు గాంధీల కుటుంబం ఇక్కడ నుంచి పోటీ చేయబట్టే మీడియా ఇక్కడకొచ్చి ఆరా తీస్తోందని, లేకపోతే అసలీ మారుమూలకు వచ్చే వారా అని మీడియాను నిలదీస్తున్నారు అమేథీ వాసులు.

Next Story