డాలర్‌ డ్రీమ్స్‌ కరిగిపోతున్నాయ్‌... అమెరికా కథలు ఏం చెబుతున్నాయ్‌?

డాలర్‌ డ్రీమ్స్‌ కరిగిపోతున్నాయ్‌... అమెరికా కథలు ఏం చెబుతున్నాయ్‌?
x
Highlights

అమెరికాలో వీసా కుంభకోణంలో వందలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకోవడం సంచలనం కలిగించింది. వందలాది మంది విద్యార్థులు ఈ కుంభకోణంలో చిక్కుకుపోయారు....

అమెరికాలో వీసా కుంభకోణంలో వందలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకోవడం సంచలనం కలిగించింది. వందలాది మంది విద్యార్థులు ఈ కుంభకోణంలో చిక్కుకుపోయారు. నిజానికి ఇదేమీ కొత్తదేమీ కానప్పటికీ....ఇంత భారీ సంఖ్యలో విద్యారులు అమెరికా ప్రభుత్వ ఉచ్చులో చిక్కుకుపోవడం మాత్రం ఇదే మొదటిసారి. గత రెండు, మూడేళ్ళ నుంచే అమెరికా డాలర్ డ్రీమ్స్ కరిగిపోవడం మొదలైనా అమెరికా చదువులు, ఉద్యోగాలపై మాత్రం మోజు తగ్గడం లేదు. అసలు అమెరికా ఇంతగా ఎందుకు విద్యార్థులను ఆకర్షిస్తోంది? అక్కడి ఉద్యోగాలపై ఎందుకంత మోజు? అనుబంధాలను వదులకుని మరీ అక్కడే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇతర దేశాల్లో పరిస్థితులేంటి? సాఫ్ట్ వేర్ ఉద్యోగాల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులేంటి

డాలర్ డ్రీమ్స్ తో విదేశాలకు ....మరీ ముఖ్యంగా అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్య లక్షలకు చేరుకుంది. 2000 సంవత్సరంలో 66 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తే....2016 నాటికే ఆ సంఖ్య మూడు లక్షలను దాటింది. అమెరికా, బ్రిటన్ కు వెళ్ళే వారి సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, విదేశీ వ్యామోహం మాత్రం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వదిలి పెట్టడం లేదు. అదే తాజాగా అమెరికాలో విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. కొన్ని సందర్భాల్లో కటకటాల పాలు చేస్తోంది. మరో వైపున ఆస్ట్రేలియా, కెనడాలకు వెళ్ళే వారి సంఖ్య పెరుగుతోంది. విదేశీ విద్య భావన కొత్తదేమీ కాదు. గత రెండు, మూడు దశాబ్దాలుగా ఇది క్రమంగా పెరుగుతూనే ఉంది. ఒక అంచనా ప్రకారం 2016లో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది స్వదేశాన్ని వీడి విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ విషయంలో చైనా అగ్రగామిగా ఉంది. ఆ తరువాతి స్థానంలో భారతదేశం నిలిచింది. 2000 సంవత్సరంలో భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిన వారిలో 59 శాతం మంది అమెరికాకే వెళ్ళారు. ఆస్ట్రేలియాకు 7 శాతం మంది, బ్రిటన్ కు 6 శాతం మంది, కెనడాకు ఒక శాతం మంది వెళ్ళారు. ఇతర దేశాలకు 27 శాతం మంది వెళ్ళారు. 2016 నాటికి అమెరికాకు వెళ్ళిన వారి సంఖ్య 45 శాతానికి తగ్గిపోయింది. కెనడాకు 7 శాతం మంది, బ్రిటన్ కు 6 శాతం మంది వెళ్ళారు. ఆస్ట్రేలియాకు 15 శాతం మంది వెళ్ళారు. 2016లో మొత్తం 3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్ళారు.

అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం తారస్థాయిలో ఉన్న 2013లో మాత్రం విదేశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య కాస్తంత పడిపోయింది. 2010లో 2 లక్షల 10 వేల మందికి పైగా విద్యార్థులు విదేశాలకు వెళ్తే.... 2013లో వారి సంఖ్య 1 లక్ష 90 వేలకు పడిపోయింది. ఆ తరువాత మాత్రం క్రమంగా పెరుగుతూ వచ్చింది అమెరికాలో ట్రంప్ గెలవడం, బ్రిటన్ లో బ్రెగ్జిట్ వివాదంతో ఆ దేశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. మరో వైపున ఆ రెండు దేశాల్లోనూ ఇమ్మిగ్రేషన్, వీసా నిబంధనలు కూడా కఠినమైపోయాయి. చదువుకునే సమయంలో, ఆ తరువాత ఉద్యోగాలు చేయడంపై ఆంక్షలు అధికమైపోయాయి. 2011లో బ్రిటన్‌కు 38 వేలకు పైగా భారతీయ విద్యార్థులు వెళ్లారు. 2016లో నిబంధనలను కఠినతరం చేయడంతో ఆ సంఖ్య 16 వేలకు పడిపోయింది. గత పదహారేళ్ళ కాలంలో భారత్ నుంచి విదేశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి సగటున ఏటా 22 శాతంగా ఉంది. మధ్యతరగతి ఆదాయ వర్గాల వారు తమ పిల్లలను విదేశాల్లో చదివించాలనుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. . సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథ్స్ రంగాలకు చెందిన విద్యార్థులే అధికంగా విదేశాలకు వెళ్తున్నారు. వీరిలోనూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంఖ్యనే అధికంగా ఉంది. వీరిలో అత్యధికులు యూఎస్ చేరుకున్నారు. అక్కడ ఎంఎస్ చేస్తూ......ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా ఉద్యోగాలు చేస్తూ....అంతిమంగా హెచ్-1బి వీసా పొందాలన్నది వారి ధ్యేయం. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు అక్రమాలకు పాల్పడడం ఆనవాయితీగా వస్తోంది. వీరి చర్యల కారణంగా స్థానిక అమెరికన్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం అక్కడ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అక్రమాలపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది. అదే తాజాగా వందలాది భారతీయ విద్యార్థుల అరెస్టులకు దారి తీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories