Top
logo

రీల్ కాదు..రియల్ లైఫ్ శ్రీమంతుడు

రీల్ కాదు..రియల్ లైఫ్ శ్రీమంతుడు
X

రీల్ కాదు..రియల్ లైఫ్ శ్రీమంతుడు

Highlights

తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారు. సంపద ఉంది, బంధు వర్గం ఉంది అయినా ఆయనను కాపాడుకోలేకపోయారు. దీంతో తీవ్ర...

తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారు. సంపద ఉంది, బంధు వర్గం ఉంది అయినా ఆయనను కాపాడుకోలేకపోయారు. దీంతో తీవ్ర మనోవేధనకు గురయ్యాడు ఆ యువరైతు. తన తండ్రే కాదు అబం శుభం ఎరుగని చిన్నారులు క్యాన్సర్ మహమ్మారి బారినపడటం కళ్లారా చూసిన దృష్యం అతడిని తీవ్రంగా కలచివేసింది. రసాయనిక సేద్యం, వాటి ద్వారా పండించిన పంట ఉత్పత్తులను తీసుకోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని గుర్తంచాడు. ఆ పరిస్థితిని మార్చాలని తనవంతు ప్రయత్నం ప్రారంభించాడు. తానొక్కడితోనే ఆగిపోకుండా తనతో పాటు తోటి రైతులను చైతన్యవంతం చేస్తూ దేశీయ విత్తనాలను సేకరించి సేంద్రియ ఉద్యమం చేస్తున్నాడు సిద్ధిపేట జిల్లాకు చెందిన యువరైతు తిరుపతి. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు .

వెనుకట మన పూర్వికులు ఎంతటి బలశాలులో అందరికీ తెలిసిందే. కేవలం దంపుడు బియ్యం తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. పొద్దంతా పని చేసినా అలుపన్న మాటే వినిపించేది కాదు. అప్పట్లో ఏ వ్యాధులు లేవు, ఆసుపత్రుల వెంట తిరిగే అవసరము రాలేదు. దీనంతటికి కారణం అప్పటి దేశవాళీ పంటలు, పండించే విధానాలనే అని చెప్పక తప్పదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు. ఆరోగ్యాన్ని పంచే ఆహారం అనారోగ్యాన్ని పెంచుతోంది. రసాయనాల ద్వారా పండిన ఆహారాన్ని తిని ఎంతో మంది ప్రమాదకర వ్యాధుల భారిన పడుతున్నారు. ఇదే పరిస్థితి సిద్ధిపేట జిల్లా , చేర్యాల మండలం, నాగపురి గ్రామానికి చెందిన జక్కుల తిరుపతికి ఎదురైంది. తన తండ్రి క్యాన్సర్ బారిన పడి తనువు చాలించడంతో తిరుపతి తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. అడ్డగోలుగా పురుగు మందులు చల్లి పండించిన ఆహారాన్ని తినడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని గ్రహించాడు. సేద్యంలో మార్పులు తీసుకురావాలని సంకల్పించుకున్నాడు. పట్టణాన్ని వీడి పల్లె బాట పట్టాడు. పురుగు మందులకు చెక్ పెట్టి దేశీయ వరి విత్తనాలను సేకరించి సేంద్రియ విధానంలో పంట పడిస్తున్నాడు. తోటి రైతులకు, యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

దేశీయ వరి వంగడాల్లో ఉన్న ఔషధ విలువలను తెలుసుకుని వాటినే సాగు చేస్తున్నాడు యువరైతు తిరుపతి. నలుపు, ఎరుపు , సుగంధ రకాలతో పాటు దొడ్డు, సన్న వరి రకాలను కలుపుకుని 51 వరి వంగడాలను 10 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు. ఆరోగ్యమే ప్రధాన అంశంగా మధుమేహం, మోకాళ్ల నొప్పులు, బరువును తగ్గించే రకాలతో పాటు, సంతాన సమస్యలు తీర్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వంగడాలను పండిస్తున్నాడు. తానొక్కడితోనే ఈ ఉద్యమం ఆగిపోకూడదని నిర్ణయించుకున్న తిరుపతి తన గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. సేంద్రియ ఉద్యమం చేస్తున్నాడు . పూర్తిస్థాయిలో గ్రామంలోనే ఉంటూ రైతులకు అందుబాటులో ఉంటున్నాడు. నాగపురి గ్రామంలోని రైతులంతా పూర్తిగా సేంద్రియ సేద్యమే చేయాలన్నది ఈ యువరైతు సంకల్పం . రసాయన రహిత గ్రామంగా మార్చడమే లక్ష్యం. దానిని సాకారం చేసుకునేందుకు ప్రత్యేకంగా విత్తన నిధిని ఏర్పాటు చేసుకుని తోటి రైతులకు ఉచితంగా దేశీయ వరి విత్తనాలను అందిస్తున్నాడు. తన కలను సాకారం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తున్నాడు.

దక్షిణ భారతదేశంలో బియ్యం లేనిదే రోజు గడువదు. సగటున పేదవాడి దగ్గరి నుంచి సంపన్నుడి వరకు అన్నమే ప్రధాన ఆహారం. చాలా మంది చిరుధాన్యాలు తినాలని సూచిస్తున్నప్పటికీ వాటిని అరాయించుకునే శక్తి అందరికి ఉండటం లేదన్న ఈ యువరైతు వాదన. వంద మందిలో 10 మంది మాత్రమే తృప్తిగా తినగలుగుతున్నారని చెబుతున్నాడు. దక్షిణ భారతదేశంలో చాలా మంది ప్రజలు బియ్యానికే అలవాటు పడ్డారు కాబట్టి ఆ బియ్యంలోనే మంచి రకాలను ఎన్నుకుని విత్తన బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాడు . 51 రకాల దేశీ వరి వంగడాలను సాగుచేస్తున్నాడు. నల్ల వరిలోనే సుమారు 8 రకాలను పండిస్తున్నాడు. నల్ల వరిలో ఉన్న ఔషధ గుణాలే అందుకు కారణమని వివరిస్తున్నాడు.

ఏం తింటున్నాం అనే దానికన్నా ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నామన్నదే ముఖ్యం. అందుకే వందల ఏళ్ల క్రితం సాగు చేయబడిన అత్యంత ఔషధ విలువలు కలిగిన నలుపు రంగు బియ్యాన్ని పండిస్తున్నాడు తిరుపతి. అందులోనూ 8 రకాలు సాగు చేస్తున్నాడు. మొక్కతో సహా నలుపు రంగులో ఉండే నల్ల వరి రకాలకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయంటున్నాడు ఈ యువరైతు. అందుకే సిద్ధిపేట జిల్లాలో మొట్టమొదటిగా ఈ విత్తనాన్ని రైతులకు పరిచయం చేశాడు. తొటి రైతులు ఈ విత్తనాన్ని సాగు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం సాగు చేయిస్తున్న ఆర్ ఎన్ ఆర్ 15048 లో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 శాతం ఉంటే . ఈ నల్ల వరిలో 41 శాతం ఉంటుందని రైతు తిరుపతి చెబుతున్నాడు. ఈ నల్ల వరితో గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ , ఊబకాయం , షుగర్ వంటి వ్యాధులు నయం అవుతాయని తిరుపతి చెబుతున్నాడు. ఎకరం విస్తీర్ణంలో నల్ల వరి సాగుకు 30 వేల వరకు సాగు ఖర్చులు అవుతున్నాయి. ఎకరానికి 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు అందుతోంది. విత్తనంగా విక్రయిస్తే కేజీకీ 250 నుంచి 300 రూపాయల వరకు తీసుకుంటున్నాడు. ఎకరాకు ఎంత లేదన్న లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. రైతులు ధాన్యంకంటే విత్తనంగా అమ్ముకుంటేనే ఎక్కువ ఆదాయం లభిస్తుందని రైతు చెబుతున్నాడు.

వరి సాగు చేసే ముందు రైతులకు అనేక సందేహాలు ఎదురవుతుంటాయి. ఏ విధానంలో వరి సాగు చేయాలి.? ఎంత మొత్తంలో నీటిని అందించాలి.? అధిక మొత్తంలో నీరు అందించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.? ఎరువులు ఎప్పుడు చల్లుకోవాలి?. చీడపీడలను సేంద్రియ విధానంలో నివారించాలంటే ఏం చేయాలో తెలియదు. వాటికి తగిన సూచనలు అందిస్తున్నాడు యువరైతు తిరుపతి.

వరి నాటు వేసుకోవాలా...? వెద జల్లాలా. ? పొడి దుక్కిలో విత్తనాలు పెట్టుకోవాలా..? లేదా డ్రప్ సీడర్ తో విత్తనాలు నాటుకోవాలా? అన్నది చాలా మంది రైతుల్లో మొదలయ్యే ప్రశ్న. అయితే పూర్వం 100 ఏళ్ల క్రితం వెదజల్లే విధానంలోనే వరి సాగు చేసేవారు రైతులు. కానీ ఈ విధానం ద్వారా విత్తనాలను చల్లడం వల్ల కలపు సమస్య రైతును తీవ్రంగా వేధిస్తుంటుంది. నాట్లు వేసుకోవాలంటే కూలీల సమస్య ఎదురవుతుంది. ఇక పొడి దుక్కిలోనే విత్తనాలు చల్లుకోవడం వల్ల కలుపు విస్తృతంగా పెరుగుతుంది. సేంద్రియ సేద్యంలో ఈ విధానం కుదరదు. కాబట్టి రైతులు డ్రమ్ సీడర్ వీధానంలో వరి విత్తనాలు నాటుకోవాలని రైతు తిరుపతి సూచిస్తున్నాడు. ఈ విధానంలో కలుపు సమస్య తీరడంతో పాటు కూలీల అవసరం ఉండదని, అదే విధంగా దిగుబడి ఆశాజనకంగా వస్తుందని వెల్లడిస్తున్నాడు.

వరి పెరిగే దశలో ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం, మట్టి ద్రావణాలు, జీవన ఎరువులను వేసుకోవాలి. దేశవాళీ ఆవు పేడతో తయారు చేసిన ఎరువుతో చేను బలంగా తయారవుతుంది. చీడపీడల నివారణకు వేప కషాయాలు. అగ్నాస్త్రాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. చీడపీడలను గుర్తించిన వెంటనే పైరుకు అందించాలి. వరికి ఎక్కువ నీరు అవసరం అనేది ఒక అపోహ మాత్రమే. మామూలు మొక్కలతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ నీరు అవసరం అవుతుంది. అంతే కానీ అవసరం ఉన్నదానికంటే అధికంగా నీరందిస్తున్నారు చాలా మంది రైతులు. అలా చేయడం వల్ల వరిలో పిలకల శాతం తగ్గుతుంది. నీటిని ఆరుతడిగానే అందించాలని రైతు చెబుతున్నాడు. తక్కువ నీటితో ఎక్కు ఉత్పత్తిని తీసుకోవచ్చని సూచన .

నలుపు రంగు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని వారి కోసమే ప్రత్యేకమైన రకాలను సాగు చేస్తున్నాడు తిరుపతి. కుజిపటాలి, చింతలూరి సన్నాలు అనే రకాలను పండిస్తున్నాడు. ఈ రకం బియ్యం చాలా రుచిగా ఉంటాయి. ఏ వయస్సు వారు తిన్నా అరుగుదల బాగుంటుందని రైతు చెబుతున్నాడు. నేలను తట్టుకుంటాయి. పంట పడిపోదు. తెగుళ్లు తక్కువగా వస్తాయి. దిగుబడి ఆశాజనకంగా లభిస్తుంది. ఎంతలేదన్నా ఎకరాకు 20 నుంచి 30 బస్తాల వరకు ధాన్యం మొదటి సంవత్సరంలోనే చేతికి అందుతుందని రైతు చెబుతున్నాడు. అదే విధంగా ప్రభుత్వ మార్కెట్ లపై ఆధారపడకుండా తిరుపతి తానే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నాడు. వివిధ కార్యక్రమాలు, సదస్సులు, విందులు, వినోధాల్లో తాను పండిస్తున్న బియ్యం రుచిని ప్రజలకు పరిచయం చేసి ప్రచారం చేస్తున్నాడు. తద్వారా వినియోగదారులను తనవైపుకు తిప్పుకుంటున్నాడు. ఇదే తన మార్కెట్ మంత్రం అని తెలిపాడు తిరుపతి.

సంకల్పం బాగుంది. సమిష్టి కృషి సాగుతోంది. నాగపురి గ్రామంలోని రైతులు తిరుపతి సాగు తీరుతెన్నులు తెలుసుకుంటున్నారు. సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. రైతులే కాదు గ్రామ సర్పంచి,ఎంపీపీ, ఎంపీటీసీ లతో పాటు ప్రభుత్వ అధికారులు తిరుపతి సూచించిన సాగు విధానాలను అనుసరిస్తున్నారు. ఓ ఉద్యమంగా సేంద్రియ సేద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో రైతులను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు యువరైతు. నిజమైన దేశభక్తిని చాటుకోవాలంటే ప్రతీ ఒక్కరు రైతుల వద్దే నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిస్తున్నాడు.


Web TitleYoung Farmer Success Story in Natural Farming
Next Story