కాసులు పండించే పుచ్చకాయ

Watermelon
x
Watermelon
Highlights

వేసవి వచ్చిందంటే ఎవరికైనా పుచ్చకాయలు గుర్తుకొస్తాయి. ఉష్ణతాపంతో ఉపశమనమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చే ఈ కాయకు మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు దీని సాగుకు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది.

వేసవి వచ్చిందంటే ఎవరికైనా పుచ్చకాయలు గుర్తుకొస్తాయి. ఉష్ణతాపంతో ఉపశమనమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చే ఈ కాయకు మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు దీని సాగుకు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పంటను ఇప్పుడే విత్తుకుంటే వేసవి ప్రారంభం నాటికి కాయలు చేతికి అందుతాయి. డిసెంబర్‌ మూడో వారం నుంచి జనవరి రెండో వారం వరకు పుచ్చను వేసుకోవచ్చు. వ్యవసాయ నిపుణుల సూచనలు, సలహాల మేరకు యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడిని సాధించి లాభాలు గడించొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సాగు చేసే తీగజాతి పంట పుచ్చ. ఈ పంట మూలాలు దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పటికీ భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో పుచ్చ వినియోగం, సాగు ఎక్కు మొత్తంలో మనం చూడవచ్చు. పుచ్చకాయలో 92 శాతం నీటితో పాటుగా ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్‌లు, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ కాలరీలు ఉండటం వల్ల , దాహాన్ని తీర్చే గుణం కలిగి ఉండటం వల్ల పుచ్చ వినియోగం వేసవిలో అధికంగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో పుచ్చ వినియోగం మిగతా కాలాల్లో కూడా బాగా పెరిగింది. అందువల్ల పుచ్చ సాగు సంవత్సరం పొడవునా చేస్తున్నప్పటికీ ఎక్కువ శాతం సాగు వేసవిని దృష్టిలో ఉంచుకుని జరుగుతోంది.

ఫిబ్రవరి నెల నుంచి పుచ్చ వినియోగం పెరిగి, జూన్ నెలాఖరు వరకు బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫిబ్రవరిలో పంటను తీసుకోవాలంటే చలి కాలంలో పుచ్చసాగును చేపట్టాలి. కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని పుచ్చసాగు చేయాల్సి ఉంటుంది, పుచ్చసాగును శాస్త్రీయంగా చేపట్టినట్లయితే మంచి దిగుబడి ఆదాయం పొందవచ్చు.

గాలిలో తేమ తక్కువగా ఉండి, వర్షపాతం సాధారణంగా ఉండే ప్రాంతాలు పుచ్చ సాగుకు అనుకూలం. అధిక చలి లేదా అధిక వేడి ప్రాంతాలలో పుచ్చ సాగు కష్టంతో కూడుకున్నది. మొక్క ఎదుగుదలకు 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత బాగా అనుకూలం. రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల కన్నా తక్కువ ఉంటే విత్తన మొలకశాతం బాగా తగ్గుతుంది. మంచు వర్షం ఎక్కువగా కురిసే ప్రాంతాలలో తెగుళ్ళు ఎక్కువగా సోకుతాయి. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉంటే మగపూలు ఎక్కువగా రావడమే కాకుండా పిందె కట్టడం తగ్గుతుంది.

దాదాపుగా అన్ని రకాల నేలలో పుచ్చ సాగు చేయవచ్చు. తేలికపాటి ఇసుక నేల నుంచి బంక నేలల వరకు అన్ని నేలల్లో సాగు చేసుకోవచ్చు. అధిక ఆమ్ల గుణం లేదా క్షార గుణం ఉండే నేలలు అనుకూలం కాదు. మురుగు నీరు పోయే సౌకర్యం ఉండాలి సాగ నీటి నాణ్యత కూడా బాగా ఉండాలి.

వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి విడుదల చేసిన రకాలు ఉన్నప్పటికీ ప్రైవేటు సంస్థల వారి హైబ్రిడ్ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన రకాల్లో అర్కజ్యోతి, అర్కమానిక్, షుగర్ బేబి, దుర్గాపూర్ మీఠా, దుర్గాపూర్ కేసర్‌, అసాహి యమాటో ఇంప్రైవ్‌డ్ షిప్పర్ మొదలైనవి ఉన్నాయి. ప్రైవేటు రకాల్లో ఎన్‌ఎస్‌-777, ఎన్‌ఎస్‌-295, అపూర్వ, మధుబాల, వసుధ, క్రిష్ణ, సుప్రీత్, ఐశ‌్వర్య వంటి పెద్దరకాలు, కిరణ్, అరుణ్, మాక్స్‌, రాజా, సుగర్ క్వీన్ , కిరణ్-2, సుమన్‌, బ్లాక్ మ్యాజిడ్, ఎన్‌ఎస్‌-20, ఎన్‌ఎస్‌-34 వంటి చిన్న కాయ రకాలు ఉన్నాయి. రైతులు వారి వారి ప్రాతాలకు అనుకూలంగా ఉండే రకాన్ని ఎంచుకుని సాగు చేసుకోవాలి.

పుచ్చ సాగులో పొలం తయారీ ఏవిధంగా చేపట్టాలి.? నీరు పారించే పద్ధతులేంటి? ఎకరానికి ఎంత మోతాదులో విత్తనాన్ని నాటుకోవాల్సి ఉంటుంది.

పొలం తయారీ విషయానికి వస్తే నేల బాగా గుల్ల బారే వరకు దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు బాగా మాగిన పశువుల ఎరువు 10 నుంచి 12 టన్నులు వేసి కలియదున్నాలి. నీటిని పారించే పద్ధతిలో సాగు చేయాలనుకుంటే ఒకటిన్నర నుంచి 2 మీటర్లు లేదా 3 నుంచి మూడున్నర మీటర్ల దూరంలో కాలువలు తయారు చేసుకోవాలి. అదే డ్రిప్ , లేదా మల్చింగ్‌తో సాగుకు 1.20 లేదా 1.5 మీటర్ల దూరంలో డ్రిప్ లేటరల్ లైనులు ఏర్పాటు చేసుకుని 60 సెంటీమీటర్ల వెడల్పు 20-25 సెంటీమీటర్ల ఎత్తు ఉండే బెడ్స్‌ను తయారు చేసుకోవాలి.

నీరు పారించే పద్ధతిలో అయితే ఒకటిన్నర నుంచి 2 మీటర్ల దూరంలో కాలువలు తయారు చేసుకుని కాలువకు ఒక వైపు 50 సెంటీమీటర్ల దూరంలో విత్తకోవాలి. లేదా 3 నుంచి మూడున్నర మీటర్ల దూరంలో కాలువలు తయారు చేసుకుని కాలువకు రెండు వైపులా 50 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. అదే డ్రిప్ పద్ధతిలో ప్లాస్టిక్ మల్చింగ్ కింద సాగు చేసుకోవాలంటే 1.2-1.5 మీటర్ల దూరంలో డ్రిప్ లైన్ వేసుకుని దానిపైన 3 అడుగుల వెడల్పు ఉండే 30 మైక్రాన్‌ మందం గల మల్చ్‌షీట్‌ను 20 నుంచి 25 సెంటీమీటర్ల ఎత్తైన బెడ్‌లపై ఏర్పాటు చేసుకుని మల్చ్‌షీట్‌ను 60 నుంచి 75 సెంటీమీటర్ల దురంలో ఒకే వరుసలో రంద్రాలు చేసుకుని విత్తనం లేదా మొక్క నాటుకోవాలి. లేదా రెండున్నర మీటర్ల దూరంలో డబుల్ లేటరల్ పైపులు ఏర్పాటు చేసుకుని 4 అడుగుల వెడల్పు గల మల్చి షీట్‌ను వేసుకుని ఒక్కో బెడ్‌పై రెండు వరుసల విత్తనం లేదా మొక్కనాటుకోవాలి.

సాధారణంగా డిసెంబర్ నుంచి జనవరి నెలలో విత్తుకునేటప్పుడు చలి ఎక్కువగా ఉండటం వల్ల విత్తనం సరిగ్గా మొలకెత్తదు. అందువల్ల విత్తనాన్ని గోరు వెచ్చని నీటిలో రెండు నుంచి మూడు గంటలు నాబెట్టి ప్రోట్రేలలో నాటుకుని నారు పెంచి నాటుకోవాలి. ప్రోట్రేలలో నారు పెంచుకున్నట్లయితే విత్తనం మొలకశాతం బాగా ఉండి విత్తనం వృథా కాదు.

నీరు పారించే పద్ధతిలో కాలువలలో నాటుకొనే పద్ధతిలో లావు గింజ రకాలైతే 700 నుంచి 800 గ్రాములు సన్నగింజ రకాలైతే 550 నుంచి 600 గ్రాములు అవసరమవుతాయి. అదే డ్రిప్ పద్ధతిలో సాగుకు లావు గింజ రకాలయితే 500నుంచి 600 గ్రాములు సన్న గింజ రకాలయితే 450 నుంచి 500 గ్రామలు అవసరమవుతాయి. అదే ప్రోట్రేలలో పెంచి నాటుకున్నట్లయితే 20 నుంచి 25 శాతం విత్తనం ఆదా అవుతుంది. సన్న గింజ రకాలయితే ప్రోట్రేలలో పెంచుకున్నప్పుడు ఎకరాకు 300 నుంచి 350 గ్రామల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని విత్తేముందు విత్తన శుద్ధి తప్పనిసరి చేయాలి. విత్తన శుద్ధి చేసిన తరువాత విత్తనాన్ని నీడన ఆరబెట్టి తరువాత విత్తుకోవాలి.

మొక్క లేదా విత్తనం నాటిన వెంటనే క్రమం తప్పకుండా నీటి తడులు ఇవ్వాలి. డ్రిప్ ద్వారా నీటిని అందించటం ద్వారా మంచి దిగుబడిని సాధించవచ్చు. కాయ ఎదుగుదల దశలో నీటి తడులలో ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి. లేకపోతే కాయలపై పగుళ్ళు ఏర్పడతాయి. డ్రిప్ లైన్‌లను ఏర్పాటు చేసుకునేటప్పుడు 30 సెంటీమీటర్ల దూరంలో 2 ఎల్‌పిహెచ్‌ డ్రిప్పర్లు ఉన్న ఇన్‌లైన్ డ్రిప్‌ను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం పూట 30 నుంచి 45 నిమిషాల పాటు డ్రిప్ వదలాలి. ఎండలు ముదిరేకొద్దీ డ్రిప్ వదిలే సమయాన్ని అవసరాన్ని బట్టి, పంట దశను బట్టి పెంచుకోవాలి.

కలుపు మొక్కలు లేకుండా మల్చి షీట్‌ రంధ్రాలలో ఎప్పటికప్పుడు కలుపును తీసివేయాలి. నాటిన 30 రోజుల తరువాత గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. కాయ ఎదుగుదల దశలో 4 నుంచి 5 రోజులకు ఒకసారి కాయలను తిప్పుతూ ఉంటే కాయపై పసుపు రంగు మచ్చ ఏర్పడదు. కాయ పక్వానికి వచ్చినప్పుడు కాయ మొదట్లో ఉండే తీగ ఎండిపోతుంది. కాయ నేలకు తగిలే భాగం పుసుపు రంగుకు మారుతుంది. కాయను చేతితో తట్టినప్పుడు డొల్లశబ్ధం వస్తుంది. డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే 20 నుంచి 25 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు.

పుచ్చను వివిధ పంటల్లో అంతర పంటగాను సాగు చేసుకోవచ్చు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సాగులో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పుచ్చ సాగులో మంచి దిగుబడిని సాధించవచ్చు. రైతుకు మంచి ఆదాయం దక్కుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories