పట్టాలున్నా సరే.. భూమి మీది కాదంటున్న అధికారులు.. గిరిజన రైతుల దీనావస్థలు !

పట్టాలున్నా సరే.. భూమి మీది కాదంటున్న అధికారులు.. గిరిజన రైతుల దీనావస్థలు !
x
Highlights

ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న తమ భూములు ప్రభుత్వానికి సంబంధించినవి అని, ఇక సాగును ఆపుకోండంటూ అధికారులు హుకూం జారీచేసారు....

ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న తమ భూములు ప్రభుత్వానికి సంబంధించినవి అని, ఇక సాగును ఆపుకోండంటూ అధికారులు హుకూం జారీచేసారు. ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లుగా అనిపించిన గిరిపుత్రులు తేరుకొనే లోపు విద్యుత్ సరఫరాను ఆపేసారు. ఏం చేయాలో తోచని గిరిజన రైతులు hmtvతో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రంగరావుపేట కేసీఆర్ తండా గిరిజనులు దశాబ్దాలుగా 266, 314, 217 సర్వే నంబర్లలోవారి భూములను చదును చేసుకొని సాగు చేస్తూ వస్తున్నారు. ఈ మూడు సర్వే నెంబర్లలో సుమారు 100 ఎకరాలపైన భూ విస్తీర్ణం ఉంటుంది. వీటిలో 130 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. 2006లో వీరికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భూ పట్టాలు ఇచ్చారు. ఆ భూముల్లో మొక్కజొన్న, వరి, సజ్జ, జొన్న, మిర్చి, పసుపు పంటలు సాగుచేస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన భూపట్టాలు ఇచ్చే క్రమంలో ఇవే సర్వే నెంబర్లకు సంబంధించిన కొంత మందికి కొత్త పట్టాలు ఇచ్చారు. మరికొంత మందికి సంబంధించినవి పెండింగులో ఉన్నాయి.

తాతల కాలం నాటి నుంచి ఇవే భూముల్ని నమ్ముకొని ఉన్న గిరిజన రైతులు ఎప్పటిలాగ ఇక్కడ ఈ ఖరీఫ్ లో వరి, మొక్కజొన్న, పసుపు పంటలు సాగు చేశారు. విషయం తెలుసుకున్న అటవీశాఖాధికారులు ఈ భూములు అటవీశాఖకు చెందినవిగా ఇక్కడ సాగు చేయడానికి వీళ్లేదని హెచ్చరించారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కి ఉండే పరికరాలు తొలగించి కరెంట్ బంద్ చేశారు. ఇలా గత నెల రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీరందక పొలాలు ఎండిపోతున్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుట్ట ప్రాంతం భూములు కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు గుట్టల నుండి జలధారలు రావడంతో కొన్ని భూములు నీరు లేకున్నా పచ్చగా ఉన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. ఈ భూములు తమవే అని తాతల కాలం నుంచి సాగు చేస్తున్నామని పాత పట్టాలు, పహానీలు తమ వద్ద ఉన్నాయని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసిన న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. రెవెన్యూ, అటవీశాఖాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని తమ సమస్యను తీర్చాలని, లేకుంటే రోడ్లపాలవుతామని గిరిజన రైతులు వేడుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories