పందిరి టమాట సాగు.. లాభాలు బహుబాగు..

Tomato Crop Cultivation By Stacking Method
x

పందిరి టమాట సాగు.. లాభాలు బహుబాగు..

Highlights

Tomato Farming: అత్యాధునిక సేద్య పద్ధతులు, శాస్త్రవేత్తల సూచనలను అందిపుచ్చుకున్న ఆ సాగుదారు సేద్యంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు.

Tomato Farming: అత్యాధునిక సేద్య పద్ధతులు, శాస్త్రవేత్తల సూచనలను అందిపుచ్చుకున్న ఆ సాగుదారు సేద్యంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నష్టాలు, కష్టాలే తప్ప సేద్యంతో మిగిలేది ఏమీ లేదనుకునే రైతులకు ఆర్ధికాభివృద్ధిని ఎలా సాధించాలో అనుభవపూర్వకంగా చూపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పాపారావు వ్యవసాయంలో సాధిస్తున్న ప్రగతి ప్రస్తుతం యావత్ రైతాంగానికి ఆదర్శంగా మారింది. 20 ఎకరాల్లో పందిరి పద్ధతిలో టమాటా సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడిని సొంతం చేసుకుంటూ ఏటా లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. పంటల సాగులో అధిక దిగుబడులు, లాభాలు పొందాలంటే రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించి ఉద్యాన పంటలను సాగు చేయాలంటున్న పాపారావు సాగు అనుభవాలను మనమూ తెలుసుకుందాం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ కు చెందిన రైతు తాళ్ళూరి పాపారావుది వ్యవసాయ కుటుంబం. 20 ఏళ్ల వ్యవసాయ అనుభవం ఉన్న ఈ సాగుదారు గత పదేళ్లుగా తనకున్న 20 ఎకరాల పొలంలో టమాట సాగు చేస్తున్నారు. అయితే ప్రారంభంలో నేలపైనే టమాట పండిస్తుండటం వల్ల అనేక సమస్యలను ఎదుర్కున్నారు. చీడపీడలు ఆశించడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాలు పంటకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. దీంతో ఏదైనా కొత్తగా చేయాలన్న తపనతో వివిధ రాష్ట్రాల్లోని టమాట తోటలను సందర్శించి అక్కడి రైతులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులను గురించి తెలుసుకున్నారు. ప్రయోగాత్మకంగా స్టేకింగ్ విధానంలో టమోట పండించడం మొదలుపెట్టారు పాపారావు. స్టేకింగ్ విధానం బాగుండటంతో 3 లక్షల రూపాయల ఖర్చుతో శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేశారు.

75 రోజులకు టమాటా పంట కోతకు వస్తుంది. ఒక్కో మొక్క ఏడు కిలోల వరకు దిగుబడిని అందిస్తోంది. భూమిపై పాకే పద్ధతిలో టమాట పంటకు చీడపీడలు ఆశిస్తాయి, వర్షాలకు కాయ కుళ్ళిపోతుంది. కర్రల పద్ధతి కూడా ఎక్కువ కాలం మనుగడ సాధించలేదని, రాతి స్తంభాలతో పందిరి సాగు చేపట్టినట్లు రైతు తెలిపారు.

గత సంవత్సరం పందిరి సాగు పద్ధతి ద్వారా ఎకరాకు 80 టన్నుల దిగుబడి సాధించినట్లు గర్వంగా తెలిపారు ఈ సాగుదారు. పందిళ్లపై పండిన టమోట నాణ్యత బాగుండటం, అధిక దిగుబడులు అందివస్తుండటంతో రైతుకు కలిసివచ్చింది. మార్కెట్ కోసం ఆందోళన పడాల్సిన పనిలేకుండా వ్యాపారులే నేరుగా తోటకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతు చెబుతున్నారు. వైజాగ్, మదనపల్లి, చెన్నై, మార్టూరు, గుడివాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు టమాటను రవాణా చేస్తున్నట్లు తెలిపారు.

ఎకరాకు ఎంతలేదన్నా 6 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ను మరో మదనపల్లె చేయాలన్నదే తన లక్ష్యం అని అంటున్నారు ఈ సాగుదారు. టమాట సాగుతో పాటు ఆరు ఎకరాల్లో షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుని వివిధ రకాల కూరగాయల నారును పెంచుతున్నారు ఈ సాగుదారు. తోటి రైతులకు నాణ్యమైన నర్సరీ మొక్కలను అందిస్తున్నారు.

పందిరి పద్ధతిని అవలంభించడం వల్ల టమాట పంటకు ఎటువంటి చీడపీడలు ఆశించవు. అంతే కాదు అధిక వర్షాలు, తీవ్రమైన గాలులు,తుఫానును సైతం పంట తట్టుకొని నిలబడుతుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ మంది కూలీల అవసరం కూడా ఉండదు. తోటి రైతులు సైతం ఆధునిక పద్ధతులను అనుసరించి సేద్యంలో రాణిస్తారని మనమూ ఆశిద్దాం.


Show Full Article
Print Article
Next Story
More Stories