Top
logo

Terrace Gardening: వ్యర్థాలతో అర్థవంతంగా మిద్దెతోట పెంపకం

Terrace Gardening by Sathyanarayana
X

Terrace Gardening: వ్యర్థాలతో అర్థవంతంగా మిద్దెతోట పెంపకం 

Highlights

Terrace Gardening: వృత్తి న్యాయవాధి, ప్రవృత్తి సామాజిక కార్యకర్త.

Terrace Gardening: వృత్తి న్యాయవాధి, ప్రవృత్తి సామాజిక కార్యకర్త. గత 40 ఏళ్లుగా వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు నాగోల్‌లోని విజయగార్డెన్ కాలనీకి చెందిన ముద్దసాని సత్యనారాయణ రెడ్డి. ఈ క్రమంలో పెరుగుతున్న పర్యావరణ కాలుష్యంతో పాటు, ఆహారం రసాయనాలతో కలుషుతం అవుతున్న విషయాన్ని గమనించారు. తనవంతు బాధ్యతగా ఏదైనా చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన ఇంటి నుంచే మిద్దెతోటల విప్లవాన్ని 20ఏళ్ల క్రితమే మొదలు పెట్టారు. రసాయనరహిత ఆహారాన్ని తన మిద్దె వనం ద్వారా సమకూర్చుకుంటున్నారు. వయస్సు ఏడు పదులు దాటినా ప్రతి రోజు మిద్దె తోటల పనులు చేసుకుంటూ ఎంతో ఆరోగ్యకరమైన ఆహ్లాదబరితమైన జీవితాన్ని గడుపుతున్నారు. నగరవాసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

125 గజాల మిద్దె తోటలో 20 రకాల కూరగాయలు, 10 రకాల ఆకుకూరలతో పాటు పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వంటింటి వ్యర్ధాలనే కంపోస్టుగా మార్చుకుని మొక్కలకు పోషకాలను అందిస్తున్నారు. సేంద్రియ ఆహార ఉత్పత్తులను పొందుతున్నారు. గత 10 ఏళ్లగా కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లిన సందర్భం లేదంటున్నారు. అంతే కాదు మానసిక ఆనందానికి, శారీరక వ్యాయామానికి , పర్యావరణ పరిరక్షణకు మిద్దె తోటలు ఎంతగానో ఉపకరిస్తాయని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నారు. మిద్దె పంటల సాగు కూడా ఓ రకమైన సామాజిక సేవే అంటారు ఈయన.

చాలా మంది మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నదన్న అపోహలో ఉంటారు. కానీ మన ఇంట్లో ప్రతి గదిలో వృథాగా పడివున్న వస్తువులతో పెద్దగా ఖర్చులేని సేద్యం చేయవచ్చంటున్నారు. ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటిపంటల పెంపకానికి కావేవీ అనర్హం అని అంటున్నారు ఈ మిద్దె సాగుదారు. అందుకు నిదర్శం ఈయన మిద్దె తోట అని చెప్పక తప్పదు. పాడైన టైర్లు, పగిలిన కుండలు, నీళ్ల డ్రమ్ములు, సూట్‌కేస్‌లు, థర్మాకోల్ బాక్సులు, పెయింట్ బక్కెట్లు, చెక్కపెట్టెలు, కూలర్ బాక్సులు ఇలా వృథాగా ఏ వస్తువు కనిపించినా అందులో మొక్కకు జీవం పోస్తుంటారు సత్యనారాయణ. ఈ రకంగా అతి తక్కువ ఖర్చుతో మిద్దె పంటలు పండించుకోవచ్చని చెబుతున్నారు.

మిద్దె తోటల సాగులో చీడపీడల సమస్య సాధారణం. వాటిని సేంద్రియ పద్ధతుల్లోనే నివారిస్తున్నారు ఈ మిద్దెసాగుదారు. కుంకుడు కాయల రసం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్‌లను కలుపుకుని అందులో కొంచెం నూనె వేసి మొక్కలపైన పిచికారీ చేస్తున్నారు. తద్వారా చీడపీడల సమస్య తీరిందంటున్నారు. అతి తక్కువ ఖర్చుతో సులువైన పద్ధతుల్లో సేంద్రియ విధానంలో మిద్దె తోటలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు 70 ఏళ్ల సత్యనారాయణ రెడ్డి గారు. ఈయన స్ఫూర్తితో మిద్దె సాగు విస్తీర్ణం మరింతగా పెరుగుతుందని ఆశిద్దాం.


Web TitleTerrace Gardening by Sathyanarayana
Next Story