Terrace Garden: ఆరోగ్యకరమైన ఆహారం కోసం మిద్దె తోటల సాగు

Terrace Garden by Gandhi Prasad Hyderabad
x

Terrace Garden: ఆరోగ్యకరమైన ఆహారం కోసం మిద్దె తోటల సాగు

Highlights

Terrace Garden: ఆయన ఓ వ్యాపారవేత్త. అనేక ఒత్తిడుల నడుమ ప్రతి రోజు గడుస్తుంటుంది.

Terrace Garden: ఆయన ఓ వ్యాపారవేత్త. అనేక ఒత్తిడుల నడుమ ప్రతి రోజు గడుస్తుంటుంది. తన గజిబిజి జీవితాన్ని కాస్త గాడిలో పెట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకు ప్రకృతితో మమేకమవ్వడమే సరైన విధానమనుకున్నారు. మితిమీరిన రసాయనాల వాడకంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రహించిన భాగ్యనగరానికి చెందిన గాంధీప్రసాద్ మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు వ్యాపార లావాదేవీలను చూసుకుంటూనే సమయాన్ని కుదుర్చుకుని స్వయంగా తన ఇంటి మేడ మీద ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలను పండించుకుంటున్నారు. మొక్కల మీద ఉన్న ఆయన ప్రేమ తన విల్లాను ఓ నందనవనంలా తయారు చేసింది.

ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలం, ఇంటి పైకప్పుపైన వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు గాంధీప్రసాద్. వీటిలో నిత్యం వినియోగించే ఆకుకూరలు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. వీటితో పాటే ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అలంకరణ మొక్కలూ ఉన్నాయి. ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన ఆహారం కావాలంటే రసాయనాల వాడకం ఉండకూడదనేది నిపుణుల మాట. ఈ మధ్యనే సేంద్రియ విధానాలపై అవగాహన పెరుగుతుండటంలో మిద్దె తోటల సాగు ఉద్యమం నగరాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు మార్కెట్ పై ఆధారపడకుండా ఉన్నంత స్థలంలో తమ ఇంటికి కావాల్సిన ఆహారాన్ని పండించుకుంటేనే మేలనుకుంటున్నారు. మిద్దె సాగుదారు గాంధీప్రసాద్‌ కూడా తన పంటల సాగుకు సేంద్రియ ద్రావణాలు, కషాయాలు వినియోగిస్తున్నారు. బయోచార్ మిశ‌్రమాన్ని ప్రత్యేకంగా తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తిని అందిపుచ్చుకుంటున్నారు.

మొక్కల పెంపకానికి సాధారణ కుండీలతో పాటు వృధాగా ఉన్న టబ్బులు, బకెట్లను వినియోగిస్తున్నారు ఈ సాగుదారు. తమ మిద్దెతోటలో ఉండే చిన్నపాటి స్థలాన్ని కూడా మొక్కలతో నింపేశారు. అంతే కాదు తీగజాతి కూరగాయల సాగు కోసం ప్రత్యేకంగా పందిర్లను ఏర్పాటు చేసుకున్నారు. నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. మిద్దె తోటల ద్వారా కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లాల్సిన పనితప్పిందని అంటున్నారు గాంధీప్రసాద్. రసాయనిక అవశేషాలు లేని రుచికరమైన ఆహారం అందుబాటులో ఉంటోందని ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం లభిస్తోందంటున్నారు. తాను మాత్రమే కాదు ఇంట్లో ఖాళీ స్థలం, మిద్దెలున్న ప్రతి ఒక్కరు ఇంటి పంటలు సాగు చేసుకున్నట్లైతే ఇటు ఆరోగ్యానికి, అటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ఈ మిద్దె సాగుదారు.


Show Full Article
Print Article
Next Story
More Stories