Hydroponic Grass: మొలక గడ్డితో పాల వెల్లువ

Step by step of Growing Hydroponic Grass
x

Hydroponic Grass: మొలక గడ్డితో పాల వెల్లువ

Highlights

Hydroponic Grass: చిన్నసన్నకారు రైతుల్లో చాలా మందికి పంట ద్వారా కన్నా పాడి ద్వారానే అధిక నికరాదాయం వస్తున్న మాట వాస్తవం.

Hydroponic Grass: చిన్నసన్నకారు రైతుల్లో చాలా మందికి పంట ద్వారా కన్నా పాడి ద్వారానే అధిక నికరాదాయం వస్తున్న మాట వాస్తవం. అటువంటి పాడికి ఆధారం పచ్చిమేత. పశువులకు సంపూర్ణ ఆహారం అందించాలంటే పచ్చిమేత తప్పనిసరి. అయితే 365 రోజులు పచ్చిగ్రాసాన్ని పాడి పశువులకు అందించడం కాస్త వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. నేల , కూలీల కొరత, కరవు వంటి పరిస్థితుల కారణంగా పాడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో, కూలీల అవసరం లేకుండా, ఇంటిపట్టునే ఆరోగ్యకరమైన విధానంలో మొలక గడ్డని పండించే పద్ధతిని కామారెడ్డి జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మొలకగడ్డిని నక్షేపంగా పెంచుకుని అధికాదాయం పొందవచ్చని రుజువు చేస్తున్నారు పలువురు పాడి రైతులు ఆ వివరాలు మీకోసం .

విస్తారమైన నేల అవసరం లేకుండానే ఇండిపట్టున ఏడాది పొడవునా నిశ్చింతగా పచ్చిమేత పెంచుకునే పద్ధతిని కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పచ్చి గ్రాసాల కొరతతో ఇబ్బందులు పడుతున్న పాడి రైతులకు సులువైన ప్రత్యామ్నాయాన్ని అందించే లక్ష్యంతో మొలక గడ్డి సాగును అధికారులు ప్రోత్సహిస్తున్నారు. అధికారులు సూచనలు, సలహాలతో జిల్లాలోని శాబ్దిపూర్‌కు చెందిన యువరైతు బాబా గౌడ్‌ మొలకగడ్డి పెంపకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి సత్ఫలితాలు సాధించాడు. 9 రోజుల్లోనే ట్రేలల్లో హైడ్రోపోనిక్స్ పద్ధతిల్లో మొలకగడ్డిని పండించి పశువులకు అందించి అధిక పాల దిగుబడిని సొంతం చేసుకున్నాడు. వేసవి సమయంలో పశుగ్రాసం కొరత తీరిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

మొక్కజొన్న, బార్లీ, సజ్జ విత్తనాలు శుభ్ర పరిచి తడి గోనె సంచిలో 24 గంటలు ఉంచితే విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తన నాణ్యత పై ఉష్ణోగ్రత ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని విత్తనాలు 24 గంటల తర్వాత మొలుస్తాయి. వెదురు బొంగులు, గ్రీన్ నెట్ సాయంతో పందిరి ఏర్పాటు చేసుకోవాలి. అడుగుబాగాల రంధ్రాలు ఉన్న ట్రేల్లో మొలకలు అమర్చి పెంచాలి. చిన్న ట్రేలో అరకిలో, పెద్ద ట్రేలో కిలో విత్తనాలు వేయొచ్చు.. స్వయం నియంత్రిత పరికరం ద్వారా 8 రోజుల పాటు పన్నెండు దఫాలుగా తుంపర పద్ధతిలో నీరు చల్లాలి. ఎక్కువైన నీరు రంధ్రాల ద్వారా కిందకు వెళ్లేలా ఏర్పాటు చేయాలి. తొమ్మిదో రోజు పెరిగిన గడ్డిని పశువుల దాణాగా వినియోగించవచ్చు.

హైడ్రోఫోనిక్ పద్ధతిలో పెరిగిన గడ్డి సాధారణ గ్రాసం కంటే మెరుగైందని పశు వైద్యాధికారులు ధ్రువీకరిస్తున్నారు. కిలో విత్తనాల నుంచి 9 నుంచి 10 కిలోల మొలకెత్తిన గడ్డి వస్తుందన్నారు. ఒక పశువుకు 15 నుంచి 20 కిలోల గడ్డి వినియోగించాల్సి ఉంటుందని వివరించారు. ఈ విధానంలో రెండు కిలోల విత్తనాలు సరి పోతాయన్నారు. దాణా వ్యయం మూడోవంతు తగ్గుతుందని వివరించారు. పాల దిగుబడి 15 శాతం వరకు పెరుగుతున్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. మొలక గడ్డి పశువులకే కాకుండా గొర్రెలకు మేకలకు వేయవచ్చన్నారు. ఈ విదానం వల్ల పశు పోషణ ఖర్చు తగ్గుతుందని తెలిపారు. యువ రైతు ప్రయోగాత్మకంగా చేస్తున్న హైడ్రోపోనిక్ మొలక గడ్డి సాగుపైన మిగతా రైతులు ఆసక్తి చూపెడుతున్నారు. ఈ తరహా సాగుతో వేసవిలో ఎదురయ్యే పశుగ్రాసం కొరత అదిగమించే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories