Spine Gourd Farming: బోడకాకర సాగుతో భలే ఆదాయం

Spine Gourd Farming in Telugu by Farmer Satyanarayana Raju
x

Spine Gourd Farming: బోడకాకర సాగుతో భలే ఆదాయం

Highlights

Spine Gourd Farming: కూరగాయ పంటల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర.

Spine Gourd Farming: కూరగాయ పంటల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడ కాకర, ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లో వాణిజ్య పంటగా విరివిగా సాగవుతోంది. రుచికి వగరే అయినా రైతులకు మాత్రం లాభాల తీపిని అందిస్తోంది ఈ తీగజాతి పంట. మెడ్చల్ జిల్లా కొల్తూరు గ్రామానికి చెందిన రైతు సత్యనారా‍యణ రాజ తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకుని బోడ కాకర సేద్యం చేపట్టారు. ఎప్పడూ కొత్త పంటలు సాగు చేయాలన్నది ఈ రైతు ఆలోచన అందుకే ఎప్పటికప్పుడు పంట మార్పిడి విధానాలను అనుసరిస్తూ వైవిధ్యతను చాటుతూ బోడ కాకర సాగుతో లాభ దాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

బోడ కాకర సున్నితమైన పంట. ఈ పంటను అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని అంటున్నారు రైతు సత్యనారాయణ రాజు. దీనికి కాకర మాదిరిగానే చీడపీడలు అధికమంటున్నారు. అడవిలో పెరిగే పాదును వాణిజ్య పరంగా పెంచే రైతులు తప్పనిసరిగా పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ కాపాడుకోవాలని ఈ సాగుదారు చెబుతున్నారు. కొత్తగా ఈ పంటను వేయాలనుకునే రైతులు నాణ్యమైన విత్తనాలను ముందుగా సేకరించాలన్నారు. బోడకాకర సాగు చేసిన రైతుల అనుభవాలను , సాగు పద్ధతులను తెలుసుకుని, పంటపై పూర్తి అవగాహన వచ్చిన తరువాత కొద్దిమొత్తంలో పంటను వేసుకుని ఆ తరువాత విస్తీర్ణాన్ని పెంచాలని తెలిపారు.

మొదటి ఏడాది విత్తనం కోసం మార్కెట్‌పై ఆధారపడినా అనంతరం పంట నుంచే విత్తన సేకరణ మొదలుపెట్టారు ఈ సాగుదారు. ఇలా సేకరించిన విత్తనాన్ని పాత పద్ధతుల్లోనే విత్తనశుద్ధి చేసి ఆ తరువాతే పొలంలో నాటుకోవాలంటున్నారు. దేశీ ఆవు పేడతో పిడకలు చేసి ఆ పిడకలను కాల్చి బూడిద చేసి ఆ బూడిదను విత్తనానికి పట్టించి దానిని ఎండబెట్టుకుని విత్తనాన్ని నిల్వ చేసుకోవాలని తెలిపారు. ఎకరాకు 5 కేజీల వరకు విత్తనం అవసరమవుతుందన్నారు.

విత్తనాన్ని నాటుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. 40 ఆడపాదులకు ఒక మగ పాదు ఉండే విధంగా చూసుకోవాలి. మగ పాదులు ఎక్కువగా ఉంటే ఆడ పాదులకు ఇచ్చే ఎరువులను లాగేసుకుని అవి బలంగా పెరిగి ఆడ పాదులను పెరగనీయకుండా చేస్తాయి.

మొక్కలు ఎదిగే దగ్గరి నుంచి పిందె, కాయ దశల్లో వివిధ రకాల చీడపీడలు బోడకాకర పంటను ఆశిస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సత్యనారాయణ రాజు సూచిస్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో అధిక మొత్తంలో నీరు అందించకూడదని అవసరాన్ని బట్టి నీరు ఇస్తే సరిపోతుందని రైతు తెలిపారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల పంట నాణ్యత బాగుంటుందన్నారు. ముఖ్యంగా ఈ పంటలో కాయ నాణ్యత అత్యంత ప్రామాణికం. కాయ పుచ్చున్నా రంగు మారినా మార్కెట్‌ లో ఆశించిన ధర రాదని రైతు చెబుతున్నారు.

ఎప్పడూ కొత్త కొత్త పంటలను సాగు చేయాలనుకుంటారు ఈ రైతు. అందుకే పంట మార్పిడి విధానాలను అనుసరిస్తారు. ప్రస్తుతం బోడ కాకర చివరి దశకు చేరుకోవడంతో అదే పొలంలో బీన్స్ సాగు మొదలు పెట్టారు ఈ సాగుదారు. ఇలా ప్రణాళిక ప్రకారం పంటలు సాగు చేసుకోవడం వల్ల రైతుకు మంచి ఆదాయం దక్కుతుందంటున్నారు.

బోడకాకర వేసిన మొదటి సంవత్సరం రైతుకు పెద్దగా లాభం ఉండదంటున్నారు ఈ సాగుదారు. రెండో ఏడాది నుంచి రైతుకు ఆశించిన రాబడి వస్తుదంటున్నారు. రెండు ఎకరాల్లో బోడ కాకర సాగుకు సుమారు రెండున్నర లక్షల వరకు పెట్టుబడి అయ్యిందని అన్ని ఖర్చులు పోను రెండున్నర లక్షల వరకు లాభం మిగులుతోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories