Organic Farming: కళాశాలే వ్యవసాయ క్షేత్రం

Special Story on Ratnapuri Agriculture College
x

Organic Farming: కళాశాలే వ్యవసాయ క్షేత్రం

Highlights

Organic Farming: అత్యంత ఆరోగ్యకరమైన , ఉపయోగకరమైన , నిజాయితీతో కూడిన వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయం మాత్రమే.

Organic Farming: అత్యంత ఆరోగ్యకరమైన , ఉపయోగకరమైన , నిజాయితీతో కూడిన వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయం మాత్రమే. అయితే సేద్యంలో పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు కాకపోవడమే కారణంగా చూపుతూ చాలా మంది యువత సొంత ఊరుని, అయిన వారిని వీడి ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్న పరిస్థితులు కోకొల్లలు మనకు కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో యువత దృష్టిని వ్యవసాయ అనుబంధ రంగాలవైపు మళ్లించేందుకు తమ వంతు కృషి చేస్తోంది సంగారెడ్డి జిల్లాలోని రత్నపురి కళాశాల. గ్రామీణ ప్రాంతాల్లోని యువత, రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించేలా శిక్షణ అందించడంతో పాటు వారికి ఉపాధి లభించే మార్గాలపైన అవగాహన కల్పిస్తోంది. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన ఆదాయం పొందే విధంగా యువతలో నైపుణ్యతను పెంచుతోంది.

సరైన శిక్షణ అందిస్తే వ్యవసాయ అనుబంధ రంగాల్లో అద్భుతాలు సాధించగలరనే నమ్మకంతో గ్రామీణ యువతను ఆ దిశగా ప్రోత్సహించేందుకు సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ గ్రామంలోని రత్నపురి కళాశాల కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తోంది. తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే విధంగా యువతలో నైపుణ్యతను పెంచేందుకు నిపుణుల ద్వారా శిక్షణ అందిస్తోంది.

2009 లో రత్నపురి కళాశాల ఏర్పాటైంది. అగ్రికల్చర్ పాలిటెక్నిక్, పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులతో పాటు వివిధ కోర్సులను అందిస్తోంది. వ్యవసాయంతో పాటు సేద్యంలో నూతనంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్ధులకు అందించి వారిని తీర్చిదిద్దే దిశగా కళాశాల యాజమాన్యం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కరోనా కల్లోలంలో ఉద్యోగాలు లభించడం కష్టతరమవుతోంది. ఈ తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లోనే యువతకు, యువ రైతులకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను అందిస్తోంది రత్నపురి కళాశాల. రైతులకు శిక్షణ ఇవ్వడమే కాదు ప్రత్యక్షంగా కళాశాల ప్రాంగణంలోనే మోడల్ క్షేత్రాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తోంది. ఔత్సాహిక యువతకు వివిధ బ్యాంకులు, నాబార్డ్ నుంచి రుణాలు ఇప్పించి వ్యవసాయ అనుబంధ రంగాలవైపు నడిపిస్తోంది.

రత్నపురి ఆర్గానిక్ కంపెనీని ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతుల్లో ఫ్రీరేంజ్ లో నాటుకోళ‌్లను కళాశాల ప్రాంగణంలోనే పెంచుతున్నారు. తక్కువ పెట్టుబడితో ప్రతి నెల ఉద్యోగి మాదిరి ఉపాధి పొంతే విధంగా వారిలో నైపుణ్యతను పెంచుతున్నారు. ఒక రోజు కోడి పిల్ల నుంచి మార్కెట్ చేసే వరకు రైతులు ఏ విధానాలను అనుసరించాలి, ఏ సమయంలో వ్యాక్సిన్ వేయించాలి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ధర లభించే మార్గాలేమిటే సవివరంగా వివరిస్తున్నారు.

కళాశాల ప్రాగణంలో మోడల్ క్షేత్రాలను ఏర్పాటు చేసి విద్యార్ధులు, రైతులకు శిక్షణ ఇస్తున్నారు. కేజ్ కల్చర్ విధానంలో కాకుండా ఫ్రీరేంజ్ లోనే నాటు కోళ్లను పెంచుతున్నారు. అసిల్, వనశ్రీ, గ్రామప్రియ, కడక్‌నాథ్ వంటి నాలుగు రకాల బ్రీడ్లను పెంచుతున్నారు. ఒక రోజు పిల్లను తీసుకువచ్చి కిలోన్నర బరువు తూగే వరకు వాటికి సమయానుకూలంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

కోళ్లకు కావాల్సిన దాణాను స్వయంగా తయారుచేసుకుంటున్నారు. హాస్టల్ కిచెన్ నుంచి వచ్చే కూరగాయల వ్యర్థాలను అందిస్తున్నారు. హైడ్రోపోనిక్స్ విధానంలో పండిన దాణాతో పాటు అజొల్లాను దాణాగా ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటు కోళ్ల పెంపకం చక్కటి ఉపాధి మార్గం. అందుకే యువతకు ఈ రంగంలో శిక్షణ అందిస్తున్నామంటున్నారు నిర్వాహకులు. పెంపకంలో శిక్షణ ఇవ్వడంతో పాటు రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మార్కెటింగ్ చేసే బాధ్యతను తీసుకుంది.

కళాశాల ప్రాంగణంలోనే సేంద్రియ విధానంలో కూరగాయలు, వరి, చెరకు వంటి పంటలను విద్యార్ధులే స్వయంగా సాగు చేస్తారు. వాటికి కవాల్సిన ఎరువులను వారే స్వయంగా తయారు చేసుకుంటారు. ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేసుకుని వర్మికంపోస్ట్, వర్మి వాష్ వంటి సేంద్రియ ఎరువులను తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నారు. అంతే కాదు ప్రత్యేక పద్ధతుల్లో సేంద్రియ ఎరువులను జల్లెడ పట్టి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. రైతులు వర్మికంపోస్ట్ ను స్వయంగా తయారు చేసుకుని సాగులో వినియోగించినట్లైతే సాగు ఖర్చులు 50 శాతం వరకు తగ్గడమే కాకుండా నేలసారం పెరుగుతుందంటున్నారు నిర్వాహకులు.

వ్యవసాయం దండుగ కాదు అందులో మెళకువలు పాటిస్తే పండగే అని నిరూపించే ప్రయత్నం చేస్తోంది రత్నపురి కళాశాల. గ్రామీణ ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించడంతో పాటు సేద్యపు ఖర్చులు తగ్గించే మార్గాలను రైతులకు పరిచయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. నేటి యువత ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోకుండా కాపాడేందుకు తాము కృషి చేస్తున్నామంటోంది యాజమాన్యం. రానున్న రోజుల్లో మరిన్ని పద్ధతులు ప్రవేశపెట్టి గ్రామీణ రైతులకు చేయూతనిస్తామంటోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories