Top
logo

చేదెక్కుతున్న చెరకు సాగు

చేదెక్కుతున్న చెరకు సాగు
X
Highlights

కడప జిల్లాలో చెరకు పంట సాగు చేసిన రైతులకు చేదు అనుభవాలే మిగులుతున్నాయి. ఏటా రైతులు మక్కువతో పంటను సాగు...

కడప జిల్లాలో చెరకు పంట సాగు చేసిన రైతులకు చేదు అనుభవాలే మిగులుతున్నాయి. ఏటా రైతులు మక్కువతో పంటను సాగు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందివ్వక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఏడాదికేడాది పంట సాగు భారీగా తగ్గిపోతోంది. సాగు నుంచి పంట కోత వరకు రైతులు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. స్థానికంగా ఉన్న చక్కెర కర్మాగారం మూతపడటంతో మరింత నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

కడప జిల్లాలో చెన్నూరు, ఖాజీపేట, చాపాడు తదితర మండలాల పరిధిలో చెరుకు సాగవుతొంది. ఇది వరకు వేల ఎకరాల్లో చెరుకు సాగువుతుండగా, ఇప్పుడు వందల ఎకరాలకు ఈ విస్తీర్ణం పడిపోయింది. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి రైతులకు కూడా మంచి ప్రోత్సాహం ఉండటంతో వేల ఎకరాల్లో చెరుకును సాగు చేసేవారు. జిల్లాలో మొత్తం ఏడు నుంచి ఎనిమిది వేల ఎకరాల్లో చెరువు సాగవుతుండగా ఇఫ్పుడు మాత్రం కేవలం 250 హెక్టార్లకు లోపుగానే విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రభుత్వం నుంచి ఏలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో పాటు చెన్నూరు షుగర్ పరిశ‌్రమలో క్రిషింగ్ నిలిపివేయడంతో ఇలా వందల ఎకరాలకు చెరుకు సాగు విస్తీర్ణం పడిపోయింది. అరకొరగా సాగు చేస్తున్న రైతులు ఇఫ్పడు పండించిన చెరుకును ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి రావడంతో ప్రతి యేటా కష్టాలు నష్టాలు తప్పా రైతుకు కలిసివచ్చింది శూన్యమే.

కడప జిల్లాలో ఏకైక వ్యవసాధారిత పరిశ్రమ చెన్నూరు చక్కెర పరిశ్రమ కావడం విశేషం. అయితే 1986లో ప్రారంభించిన చక్కెర కర్మాగారానికి 1995లో వేఆఫ్ ప్రకటించారు. అటు తరువాత 2005లో తిరిగి తెరిచారు. కర్మాగారం తెరిచినప్పటి నుంచి ప్రతి ఏటా క్రషింగ్‌కు ఆప్కాబ్ నుంచి అప్పు తెచ్చుకోవడం ఉత్పత్తైన చక్కెర, మొలాసిస్ అమ్మీ తెచ్చిన అప్పు తీర్చడంతో సరిపోయేది. అయితే జీతాలకు, కర్మాగారం మరమ్మతులకు ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడవలసిన దయనీయ పరిస్ధితి. దీంతో కర్మాగారం భవిష్యత్తు ఏటా ఇబ్బందికర పరిస్ధితుల్లోను నడిచింది. రైతులు చక్కెర కర్మాగారాన్ని నమ్ముకుంటే కష్టం - నష్టం తప్ప ఏమి లేకపోవడంతో చెరుకు సాగు అంటేనే భయపడుతున్నారు. సీమాంధ్రలోని 10 ఫ్యాక్టరీలలో కడప చక్కెర కర్మాగారం పరిస్థితే దారుణంగా మారింది.

అయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పరిశ్రమలకు తిరిగి ప్రాణం పోస్తామని చెప్పిన విషయంతో కార్మికుల్లో తిరిగి ఆశలు చిగురింపచేసినా అధికారంలోకి వచ్చాక మాత్రం పెద్దగా దృష్టి సారించలేకపోయింది. దీంతో జగన్ ప్రభుత్వమైనా పరిశ్రమను ఆదుకోకపోతుందా..? అన్న ఆశతో ఎదురుచూస్తు వచ్చారు. కానీ ఇంత వరకు అటు వైపు కన్నెతి కూడా చూడలేదు. చక్కెర పరిశ్రమ పరిస్ధితి ఇలా ఉంటే రైతుల పరిస్ధితి మాత్రం పెన్నం మీద నుంచి పోయ్యిలో పడినట్లుగా మారింది. ఒకప్పుడు వేల ఎకరాలలో పండించే చెరుకు ఇప్పుడు కేవలం వందల ఎకరాల విస్తరణకు పడిపోయింది.

జిల్లాలో ప్రస్తుతం చెరుకు పంట సాగుతోంది. చెన్నూరు, ఖాజీపేట, దువ్వురు మండలాల్లో దాదాపుగా చాలా మంది రైతులు చెరుకు సాగు మానుకోగా, 250 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే చెరుకు పంట సాగు చేశారు. దిగుబడి నామమాత్రంగానే వస్తుంది. కూలీలు, సరఫరా సొంత ఖర్చులతో సమకుర్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం పూర్తిగా కరువవ్వడం వల్లే రైతులకు ఈ ఇబ్బందికర పరిస్ధితి దాపురించిందని విమర్శిస్తున్నారు. టన్ను చెరకును సిద్దం చేసేందుకు కూలీలకు 700 వరకు చెల్లించాల్సి వస్తుండగా, పరిశ్రమకు చెరకును తరలించేందుకు రవాణాకు టన్నుకు వెయ్యి రూపాయల వరకు బాడుగ అవుతోందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు వాతావరణ పరిస్ధితుల వల్ల పంట దిగుబడి తగ్గుతొంది. ఎకరాకు 30 టన్నుల దిగుబడికు మించడం లేదని రైతులు వాపోతున్నారు. ఆ లెక్కలో 60 వేలు కూడా రావడం లేదంటూ పెదవి విరుస్తున్నారు. ఏడాది పొడవునా పంట సాగుకు 35 వేలకు పైగా ఖర్చు వస్తుంది. అన్ని ఖర్చులు పోను 15 వేల లోపుగా మాత్రమే మిగులుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో చెన్నూరు చక్కెర పరిశ్రమ వారు విత్తన సరఫరా, కోత సమయంలో కూలీల ఏర్పాటు, సాగుకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సాహం అందించేవారని ఇఫ్పుడు అలాంటి పరిస్ధితి లేకపోవడంతోనే రైతులకు కష్టాలు దాపురించాయని విమర్శిస్తున్నారు. పరిశ్రమ మూత పడిన తర్వాత చెరకు సాగును ప్రోత్సహించే వారే కరువయ్యారు. ఇఫ్పుడు సాగు చేసిన చెరుకు పంటను రైతులు నెల్లూరు జిల్లా పొదలకూరు చక్కెర పరిశ్రమకు తరలిస్తున్నారు. అన్ని ఖర్చులు వెచ్చించి పంటను ఫ్యాక్టరీకి తరలిస్తే నెల తరువాత మాత్రమే రైతుకు ప్రతిఫలం అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోతే, రానున్న రెండు, మూడు సంవత్సరాలలో చెరుకు సాగు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెరకు పంటను సాగు చేసే రైతులకు ప్రోత్సాహాకం కల్పించాల్సి ఉందని, జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.

అయితే గతేడాది జులై 8న జమ్మలమడుగులో నిర్వహించిన బహిరంగ సభలో చెన్నూరు చక్కెర కర్మగారాన్ని తెరిపిస్తామని సిఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలోనూ దీని గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచిపోయినా ఈ హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చెన్నూరు చక్కెర కర్మాగారానికి పునర్వైభవం తీసుకొచ్చి తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.


Web TitleSpecial Story on Chennur Sugar Factory
Next Story