పోడు భూముల సమస్యలు తీరాలంటే.. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

Solutions for  Podu Lands Problems
x

పోడు భూముల సమస్యలు తీరాలంటే.. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

Highlights

Podu Lands: పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీర్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు.

Podu Lands: పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీర్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల పోడు భూముల సమస్యలకు త్వరితగతిని పరిష్కారం చూపవచ్చంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్. అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలని గతంలో 2 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. ఇందులో 93 వేల మందికి హక్కు పత్రాలు అందాయి. మిగతా వారివి తిరస్కరించామని ప్రభుత్వం చెప్పింది. అయితే అధికారికంగా దరఖాస్తు చేసుకున్న వారికి సమాచారం లేదు.

ఈ క్రమంలో ఎవరి దరఖాస్తులు తిరస్కరించారో వారికి సమాచారం ఇవ్వడంతో పాటు అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. అదే విధంగా అర్హత ఉండీ ఇంకా హక్కు పత్రాలకు కోసం దరఖాస్తు చేసుకోని వారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం కల్పించాలంటున్నారు. ఇక అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి తాత్కాలికంగా హక్కు పత్రాలు ఇవ్వడం దీర్ఘకాలికంగా ఉమ్మడి సర్వే చేసి అది ఏ భూమో తేలితే ఆ చట్టాల మేరకు హక్కు పత్రాలు కొనసాగించాలని చెబుతున్నారు.

ఇక హక్కు పత్రాలను అందుకున్న వారికి అనేక చిక్కుముడులు ఉన్నాయి. కొద్ది మందికి వారు వాస్తవంగా సాగు చేసుకుంటున్న మొత్తం విస్తీర్ణం కాకుండా కొద్దిపాటి భూమికే హక్కు పత్రం వచ్చింది. పూర్తి విస్తీర్ణం కాకుండా ఎవరికైతే తక్కువ విస్తీర్ణం వచ్చిందో వారికి కూడా అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని సునీల్ కుమార్ సూచిస్తున్నారు‌. 2008 అటవీ హక్కుల చట్టం అదే చెబుతోందని అంటున్నారు. 10 ఎకరాల లోపు ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమికి హక్కు పత్రం ఇవ్వచ్చని అంటున్నారు. ఇక పోడు భూములు సాగు చేసుకునే వారంతా గిరిజనులు కావడం వల్ల గిరిజన సంక్షేమ శాఖ తరపున లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేసి వారి ద్వారా అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలంటున్నారు. గ్రామ స్థాయిలోనే స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించి విచారణ చేపట్టి పరిష్కారం చూపాలంటున్నారు.

అటవీ హక్కు చట్టం కేవలం అటవీ భూములను దున్నుకునే హక్కు కోసం చేసిన చట్టం మాత్రమే కాదు. అడవుల సంరక్షణ కోసమూ చేసిన చట్టం. అడవుల సంరక్షణ కోసం కమ్యూనిటీ టీమ్‌ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామూహిక హక్కుల కోసం ఎక్కడైతే దరఖాస్తులు వచ్చాయో వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలంటున్నారు సునీల్ కుమార్.


Show Full Article
Print Article
Next Story
More Stories