Top
logo

Natural Farming: సాఫ్ట్‌వేర్ జాబ్‌ వదిలేసి...పలుగు, పారా పట్టాడు

Software Engineer Parthasarathi Turns Farmer
X

Natural Farming: సాఫ్ట్‌వేర్ జాబ్‌ వదిలేసి...పలుగు, పారా పట్టాడు

Highlights

Natural Farming: సాఫ్ట్‌వేర్‌ జాబ్ వదిలేసి పలుగు, పారా పట్టారు.

Natural Farming: సాఫ్ట్‌వేర్‌ జాబ్ వదిలేసి పలుగు, పారా పట్టారు. స్మార్ట్‌ఫోన్‌లను పక్కన పెట్టి స్మార్ట్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు. వ్యవసాయం నేర్చుకుని ఇప్పుడు వందల మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సేద్యాన్ని లాభసాటిగా ఎలా మార్చుకోవచ్చునో కళ్లారా చూపిస్తున్నారు. సహజ సిద్ధంగా పంటలు పండించడమే కాదు తోటి రైతులకు ఆ మెళకువలను నేర్పుతూ ప్రస్తుతం వ్యవసాయంలో అనంత సంపాదనను పొందుతున్నారు అనంతపురం జిల్లాకు చెందిన యువరైతు పార్థసారధి.

అనంతపురం జిల్లా ఉప్పనేసినపల్లి గ్రామానికి చెందిన పార్థసారధిది వ్యవసాయ కుటుంబమే. తన తాతల కాలం నాటి నుంచి వ్యవసాయమే చేసేవారు. అప్పట్లో వాళ్లకు 90 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేదు. కానీ ఈ భూమిలో పంటలు పండించి సంపాదించింది మాత్రం ఏమీ లేదు. రాను రాను వ్యవసాయంలో మార్పులు చోటు చేసుకోవడం. మితిమీరిన రసాయనాల వాడకం పెరిగిపోవడంతో పెట్టుబడులు పెరిగి సేద్యం భారంగా మారింది. దీనితో పార్థసారధి దృష్టిని వ్యవసాయం వైపు మళ్లించకుండా పెద్ద చదువులు చదివించారు వారి తల్లిదండ్రులు.

వ్యవసాయంలో గిట్టుబాటు కాక తండ్రి చేసిన అప్పులను తీర్చడం కోసమే కష‌్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించారు. సాఫ్ట్‌వేర్ కొలువులో చేరాడు. విదేశాల్లోనూ ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. అక్కడ కొన్నేళ్లు పనిచేసిన అనుభవం ఉంది. భారత్‌కు తిరిగి వచ్చిన తరువాత కూడా ఓ వైపు ఉద్యోగం చేస్తూనూ వ్యవసాయం మీద మక్కువతో వివిధ రకాల పంటలను రసాయనిక విధానంలోనే పండించేవారు.

తన ఊళ్లోనే కొంత భూమిని కౌలుకు తీసుకుని రకరకాల పంటలను సాగు చేసేవారు పార్థసారధి. అప్పుడే సహజ సిద్ధంగా పంటలు పండించడం గురించి ప్రాచుర్యం జరుగుతుండటంతో కెమికల్స్ కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసేకంటే సహజ సిద్ధంగా పంటలు పండించాలన్న ఆలోచన కలిగింది ఈ సాగుదారుకి. 2013లో ప్రకృతి సేద్యంపై శిక్షణ తీసుకుని కేవలం జీవామృతంతో పంటలు పండించడం మొదలుపెట్టారు. అన్ని రకాల కూరగాయలు, పండ్లను ప్రకృతి సిద్ధంగా పండించారు. ప్రకృతి సేద్యం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గిందని, రాబడి పెరిగిందని రైతు చెబుతున్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు విస్తీర్ణాన్ని పెంచారు.

పంటను పండించడం కాదు ఆ పంటను మార్కెట్ చేసుకోవడమే రైతకు ముందుండే అసలైన ఛాలెంజ్. అందులో విజయం సాధిస్తే లాభాలు తప్పనిసరిగా వస్తాయంటున్నారు ఈ సాగుదారు. ప్రకృతి వ్యవసాయం అంటే కష‌్టం ఇందులో దిగుబడలు రావు, మార్కెట్ లేదు అనే అపోహ చాలా మంది రైతుల్లో ఉందని ఆ అపోహను తొలగించేందుకు వినియోగదారులకు అవగాహన కల్పించాలంటున్నారు పార్థసార్థి. రైతులు పండించే ఉత్పత్తులపైన నమ్మకాన్ని ఏర్పచాలంటున్నారు. అందుకే అనంత నాచురల్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి బెంగళూరులో పలు ఔట్‌లెట్స్‌ను ప్రారంభించి తాను పండించే కూరగాయలు, పండ్లతో పాటు స్థానిక రైతులు ప్రకృతి విధానంలో పండిస్తున్నఉత్పత్తులను సేకరించి అమ్మడం మొదలు పెట్టాడు. ఏటా లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

ప్రకృతి సేద్యం అంటే కేవలం జీవామృతం చల్లతే సరిపోదని రైతు చెబుతున్నారు. విత్తన సేకరణ దగ్గరి నుంచి కోత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నాటు రకాల విత్తనాలను ఎన్నుకుని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలని చెబుతున్నారు. పండ్ల తోటల్లో మునగ, పసుపు వంటి పంటలు అంతర పంటలుగా సాగు చేయాలి. ప్రకృతి సేద్యంలో మల్చింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. భూమికి సూర్యరశ్మి అవసరం లేదు కాబట్టి సహజ సిద్ధంగా వరిపొట్టి, శనగపొట్టి, ఆకులు, అలమలతో భూమిని కప్పి ఉంచి సమయానుకూలంగా జీవామృతాన్ని వేయాలంటున్నారు పార్థసారధి. ఇక ఆకర్షణ పంటగా బంతి సాగు చేయాలంటున్నారు. పూత దశలో పుల్లటి మజ్జిగ ను, చీడపీడలను అదుపులో ఉంచేందుకు అవసరమైన వివిధ కషాయాలను ఎప్పటికప్పుడు తయారు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ విధానాలు అనుసరించడం వల్ల ప్రకృతి సేద్యంలో సత్ఫలితాలు తప్పక వస్తాయంటున్నారు.

అనంతపురం జిల్లా రైతాంగానికి సహజ సిద్ధంగా పంటలు ఎలా పండించాలో శిక్షణ ఇస్తున్నారు ఈ సాగుదారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో 150 మందికి పైగా రైతులు పార్థసారధి బాటలో నడుస్తూ సహజ సిద్ధంగా పంటలు పండిస్తూ లాభాలను గడిస్తున్నారు. ప్రకృతి సేద్యంపై ఆసక్తితో ముందుకు వచ్చేవారికి తమ సహకారం ఎళ్లప్పుడూ ఉంటుందంటున్నారు ఈ యువరైతు.


Web TitleSoftware Engineer Parthasarathi Turns Farmer
Next Story