బీడు భూమిలో బంగారు పంటలు

బీడు భూమిలో బంగారు పంటలు
x
Highlights

ఒకప్పుడు సాగు నీరు లేక బీడువారిన కొండ ప్రాంతం అది. కానీ ఇప్పుడు 130 రకాల వివిధ పండ్ల మొక్కలతో ఓ స్పూర్తి వనంగా మారింది. ఒప్పుడు గడ్డిమొలవడమే...

ఒకప్పుడు సాగు నీరు లేక బీడువారిన కొండ ప్రాంతం అది. కానీ ఇప్పుడు 130 రకాల వివిధ పండ్ల మొక్కలతో ఓ స్పూర్తి వనంగా మారింది. ఒప్పుడు గడ్డిమొలవడమే కష్టతరంగా ఉండే ప్రాంతం అది కానీ ఇప్పుడు పచ్చని చెట్లతో ఎంతో మందికి సాగులో ఉన్న ప్రశ్నలకు సమాదానంగా నిలుస్తోంది. బాల వికాస్‌ సంస్థను స్థాపించి ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూనే ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న ఆ సంస్థ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి తాను అందరికి పాఠాలు చెప్పడం మాత్రమే కాదు స్వయంగా ప్రకృతి సాగును చేస్తున్నారు.

బాల వికాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సింగారెడ్డి శౌరిరెడ్డి ఒక మారు మూల గ్రామంలో జన్మించారు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. కేవలం మైకులు పట్టుకుని రైతులకు పాఠాలు చెప్పడమే కాదు తాను స్వయంగా సేంద్రియ విధానంలో పంటల సాగు చేస్తూ దాన్ని ఓ మోడల్ ఫామ్‌గా రూపొందించారు. ఓ స్పూర్తి వనంలా నిర్మించారు.

వరంగల్ కి అతి సమీపంలో వున్న కుమ్మరి గూడెం ప్రాంతంలోని తమ 5 ఎకరాల పొలంలో పండ్ల తోటల సాగును ఏడేళ్ల క్రితం మొదలు పెట్టారు. అయితే స్థానికంగా నీటి లభ్యత లేదు దీంతో మూడు బోర్లను తవ్వించారు అయినా పెద్దగా నీరు అందలేదు. దీంతో తన పొలంలోని కొంత భాగంలో 24 లక్షల లీటర్ల నీరు నిల్వ సామర్ధ్యం గల నీటి కుంటను నిర్మించుకున్నారు. దీంతో ఇప్పుడు ఏడాది పొడవునా ఈ కుంటల్లో నీరు అందుబాటులో ఉండడమే కాదు భూగర్భజలాల స్థాయి కూడా పెరిగింది. అంతే కాదు ఈ నీటి కుంటల్లో చేపలను పెంచుతు సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నానంటున్నారు శౌరిరెడ్డి.

స్పూర్తి వనంలో సుమారు 130 రకాల పండ్ల చెట్లను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. ఇక్కడ ఏడాదంతా పండ్ల ఉత్పత్తి వస్తూనే ఉంటుంది. వాతావరణానికి తగ్గట్లుగా మొక్కలను పెంచుతున్నారు. ఆపిల్‌లో నాలుగు రకాలు, మామిడిలో 24 రకాలు, 60 నుంచి 70 రకాలు దేశవిదేశాల నుంచి వచ్చిన పండ్ల చెట్లను పెంచుతున్నారు. కొత్త తరహా పంటలు పండించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు శౌరిరెడ్డి. నేటి తరకానికి, సాగులో ప్రయోగాలు చేయాలనుకునే రైతులకు ఈ వ్యవసాయ క్షేత్రం ఓ ప్రయోగశాలగా నిలుస్తుందంటున్నారు ఈయన.

ఎలిఫంట్ ఆపిల్, బిలింబి, రామాఫలం, లక్ష్మణఫలం, హన్మాన్ ఫలం, స్వీట్ సీతాఫలం, మౌంటేన్ సీతాఫలం, పీనట్ బట్టర్, చెర్రీ గోవా, స్నేక్ ఫ్రూట్, లిచీ, ఇలా ఎన్నో దేశీ, విదేశీ రకాల పండ్ల చెట్లు ఈ ప్రయోగక్షేత్రంలో మనకు దర్శనమిస్తాయి. ముఖ్యంగా హిమాలయల్లో పండే రుద్రాక్ష ఇక్కడ ప్రత్యేక ఆకర్శణగా అందరిని ఆకట్టుకుంటుంది.

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరికి తన వ్యవసాయ క్షేత్రం స్పూర్తి గా నిలవాలంటూ శౌరిరెడ్డి చేస్తున్న కృషి ఎంతో మందికి ఆలోచింపజేస్తోంది. ఈ ప్రయోగాల క్షేత్రం ద్వారా తమ సందేహాలను తీర్చుకుంటున్నారు రైతులు. నేటి తరం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ స్పూర్తి వనం నిజంగా అందరిలో స్పూర్తిని కలిగించాలని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories