Top
logo

కరవు నేలలో సిరుల పంట

కరవు నేలలో సిరుల పంట
X
Highlights

కరవు సీమ అంటే ముందుగా గుర్తొచ్చేది అనంతపురం జిల్లా. ఇక్కడ కరవు తప్ప వర్షాలు ఉండవు, పంటలు పండవు అలాంటి కరవు...

కరవు సీమ అంటే ముందుగా గుర్తొచ్చేది అనంతపురం జిల్లా. ఇక్కడ కరవు తప్ప వర్షాలు ఉండవు, పంటలు పండవు అలాంటి కరవు నేలల్లో ఓ యువరైతు వేల రూపాయల పెట్టుబడితో లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మేడి మాకుల పల్లి గ్రామానికి చెందిన యువరైతు రాజశేఖర్ రెడ్డి. ఈ రైతు తన 8 ఎకరాల పొలంలో బీర పంటను సాగు చేస్తున్నాడు. అది పూర్తి సేంద్రియ విధానంలో పంటను పండిస్తున్నాడు. ఆధునిక సాగు పద్ధతులను అవలంభిస్తూ , తక్కువ నీటి వరనరులను వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

గత ఏడాది నుంచి బీర సాగు చేస్తున్నాడు రాజశేఖర్‌రెడ్డి. కరవు నేల కావడం వల్ల ఆధునిక విధానాలను అనుసరిస్తున్నాడు. పంట వేసే ముందే నేలను చదును చేసుకుని పంటకు అవసరమైన సేంద్రియ ఎరువులను నేలకు అందించాడు. నీటి సదుపాయం తక్కువగా వుంది కాబట్టి డ్రిప్ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత నేల మీద బీర పంట వేస్తే నాణ్యమైన దిగుబడి రాదని తెలుసుకున్న ఈ యువరైతు వరుస క్రమంలో కట్టెలను నాటి తీగలను చుట్టి వాటికి బీర తీగను అల్లికలు వేశాడు. ఇలా వేయడం ద్వారా కాయలు వంకరగా తిరగకుండా బాగా ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుందని రైతు చెబుతున్నాడు.

నేలలో నీరు ఆవిరి కాకుండా తేమను నిలిపిందుకు అలాగే మొక్కకు నీరు సంవృద్ధిగా అందేందుకు మల్చింగ్ చేశాడు. ఎకరానికి కేజీ విత్తనాలు చొప్పున 8 ఎకరాలల్లో విత్తనాలు వేశాడు. విత్తనం వేసిన రోజు నుంచి 36 రోజులకు పంట దిగుబడి వస్తుంది. ఈ పంట సాగు మొత్తం 90 రోజుల్లోనే పూర్తవుతుంది. ఈ 90 రోజుల్లో 36 రోజుల తరువాత నుండి పంటను కోత కోస్తారు. ఇలా దాదాపు 50 నుంచి 60 కోతల వరకు బీర కాయాలను కోస్తున్నారు. రోజుకు ఎకరాకు 3 టన్నుల నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తోంది.

మార్కెట్‌లో టన్ను బీరకు 30 నుంచి 40 వేల వరకు పలుకుతోంది. ఇలా ఎకరాకు ఎంతలేదన్నా 5 లక్షల రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది. ఇందులో 2 లక్షల రూపాయలు పెట్టుబడులకు కూలీల ఖర్చులు పోను మిగతా 3 లక్షల రూపాయలు ఎకరాకు నికర ఆదాయంగా మిగులుతోంది. దీంతో రైతు మొత్తం తన 8 ఎకరాలకు గాను దాదాపు 15 లక్షల రూపాయల పెట్టుబడితో దాదాపు 35 నుంచి 40 లక్షల రూపాయల వరకు నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.

కరవు నేలలో బీర పంటను సాగు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని గడిస్తూ తోటి గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు యువరైతు రాజశేఖర్ రెడ్డి. రైతు మాత్రమే ఆదాయం పొందడం కాకుండా ఆయనతో పాటు రోజూ 20 మంది కూలీలకు రోజుకు 150 నుంచి 200 రూపాయల వరకు కూలీ ఇస్తూ వారికి కూడా ఉపాధిని కల్పిస్తున్నాడు.

Next Story