ఎర్ర బెండతోనే ఆదాయం అధికం.. రుజువు చేస్తున్న వరంగల్ రైతు

Red Lady Finger Farming by Warangal Farmer Prabhakar Reddy
x

ఎర్ర బెండతోనే ఆదాయం అధికం.. రుజువు చేస్తున్న వరంగల్ రైతు 

Highlights

Red Lady Finger: వ్యవసాయంలో వినూత్న విధానాలను, కొత్త కొత్త వంగడాలను సాగు చేస్తూ కొంత మంది సాగుదారులు అద్భుతాలు సృష్టిస్తున్నారు.

Red Lady Finger: వ్యవసాయంలో వినూత్న విధానాలను, కొత్త కొత్త వంగడాలను సాగు చేస్తూ కొంత మంది సాగుదారులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు సంప్రదాయ పద్ధతులను సేద్యంలో సమ్మిళితం చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా మంచి ధర లభించే సరికొత్త రకాలను ఎన్నుకుని అధిక మొత్తంలో సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతూ సేద్యాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. అదే కోవలోకి వస్తారు వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి. సాధారణంగా బెండకాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ ఈ రైతు మాత్రం తోటి రైతులకు భిన్నంగా వినూత్నంగా ఎరుపు రంగులో ఉండే బెండను పండిస్తున్నారు. అది కూడా పూర్తి సేంద్రియ పద్దతిలోనే పంటను సాగు చేస్తున్నారు. ఈ అరుదైన రకమైన బెండ ప్రస్తుతం జిల్లా రైతాంగాన్ని ఆకట్టుకుంటోంది. మరి ఈ ఎర్ర బెండ సాగుతో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రభాకర్ రెడ్డిపై ప్రత్యేక కథనం.

ఒకప్పుడు తమిళనాడు, దక్షిణాంద్ర ప్రాంతాల్లో కనిపించే ఎర్ర బెండ పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకుంది. సాధారణంగా ఆకుపచ్చ బెండ తింటే తెలివితేటలు వస్తాయని చురుగ్గా ఉంటారని చెబుతుంటారు అదే విధంగా ముదురు ఎరుపు రంగులో ఉండే బెండలోనూ ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎర్రగా నిగనిగలాడుతూ మందంగా కనిపించే ఈ బెండకు ప్రస్తుతం మార్కెట్‌ లో మంచి గిరాకీ ఉంది. ఆ గిరాకీనే అందిపుచ్చుకుంటున్నారు వరంగల్ అర్బన్ జిల్లా హాసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి. వినూత్నంగా తన పొలంలో ఎరుపు రంగు బెండకాయలు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రభాకర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే ఎప్పుడు పండించే పంటలేనా కొత్తగా ఏమైనా సాగు చేద్దామన్న ఆలోచన తనకు తట్టింది. దీంతో మార్కెట్ లో ఎరుపు రంగు బెండకు ఉన్న డిమాండ్ ను గుర్తించారు. బెంగుళూరు నుంచి విత్తనాలను సేకరించి పండించడం మొదలు పెట్టారు. నాలుగు గుంటల భూమిలో సాగు చేసిన ఈ బెండకాయలను చూసి మొదటల్లో ఊరివారంతా ఆశ్చర్యంగా చూశారు. కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఎంతో ధీమాతో ఉన్నారు. అనుకున్నట్లుగానే పంట బాగా రావడం ఆకుపచ్చ బెండకంటే అధిక లాభాలు రావడంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ ఎర్ర బెండ సాగు తెలంగాణ ప్రాంతంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇందులో సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఈ ఎరుపు రకం వంగడాన్ని రాధిక అని పిలుస్తారు. దీని పంటకాలం ఐదు నెలలు ఉంటుంది. ఈ మొక్కల ఎత్తు సుమారుగా 8 అడుగుల వరకు పెరుగుతుంది. బెండకాయలు 8 ఇంచుల వరకు పెరుగుతాయి. ఆకుపచ్చ బెండ వండేప్పుడు జిగుటుగా ఉంటుంది. కానీ ఈ రకానికి బంక రాదు, జిగుటు ఉండదు.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఎర్ర బెండను పూర్తి సేంద్రియ విధానంలోనే సాగు చేస్తున్నారు రైతు. తనకున్న రెండు ఆవులు, గేదెల నుంచి వచ్చిన వ్యర్థాలను సేకరించి సొంతంగా ఎరువును తయారు చేసుకుంటున్నారు. సమయానుకూలంగా పంటకు అందిస్తున్నారు. సేంద్రియ విధానం కావడంతో పంట ఎదుగుదల బాగుందని దిగుబడి కూడా ఆశాజనకంగా వస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట నాణ్యతను చూసి తన పొలం వద్దకే వచ్చి వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారని రైతు చెబుతున్నారు.

సేద్యంలో రసాయనాల వినియోగం అధికమవడం పెట్టుబడులు పెరగడంతో పాటు పంటలో నాణ్యత లోపిస్తుండటంతో సేంద్రియ పద్ధతులకే పట్టం కట్టారు ఈ రైతు. సేంద్రియ విధానంలో పంటలు సాగు చేసేందుకు ప్రభాకర్ రెడ్డి తన క్షేత్రంలోనే రెండు ఆవులు, గేదెలను పెంచుతున్నారు. వాటి నుంచి వచ్చిన పేడను మూత్రాన్ని సేకరించి జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. జీవామృతంతో పాటు వానపాములను సమయానుకూలంగా పంటకు అందిస్తున్నారు. నాణ్యమైన, అధిక దిగుబడిని అందుకుంటున్నారు.

ఇప్పటి వరకు 8 క్వింటాళ్ల బెండ దిగుబడి వచ్చిందని సాధారణ రకం కంటే ఎర్ర బెండ కాయకు మార్కెట్‌లో ధర ఎక్కువ ఉందని రైతు చెబుతున్నారు. దీంతో లాభాల సాగుతో ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఊరిలోనే ఆదర్శ రైతుగా మారారు. చుట్టు పక్కన వున్న గ్రామాలోని ప్రజలు సైతం ప్రభాకర్ రెడ్డి తోట దగ్గరికి వచ్చి ఎర్ర బెండను కొనుక్కువెళుతున్నారు. తోటి రైతులు సైతం ఈ అరుదైన బెండ సాగు గురించి అడిగి మరీ తెలుసుకుంటున్నారని రైతు చెబుతున్నారు. తోటి రైతులు సైతం సేంద్రియ విధానంలో అరుదైన పంటలను సాగు చూస్తే పోషకాలతో కూడిని ఆహారాన్ని వినియోగదారులకు అందించడంతో పాటు రైతుకు లాభాలు దక్కుతాయంటున్నారు రైతు ప్రభాకర్ రెడ్డి.


Show Full Article
Print Article
Next Story
More Stories