రెడ్ క్యాబేజీ సాగుతో మంచి లాభాలను పొందుతున్న యువ రైతు

Red Cabbage Farming Young Farmer Success Story
x

రెడ్ క్యాబేజీ సాగుతో మంచి లాభాలను పొందుతున్న యువ రైతు

Highlights

Red Cabbage Farming: వ్యవసాయం చాలామందికి బ్రతుకు తెరువు. ఆరుగాలం శ్రమించి , అష్టకష్టాలు పడి బంగారు పంటలు పండిస్తారు.

Red Cabbage Farming: వ్యవసాయం చాలామందికి బ్రతుకు తెరువు. ఆరుగాలం శ్రమించి , అష్టకష్టాలు పడి బంగారు పంటలు పండిస్తారు. అయినా వచ్చే ఆదాయం సాగు ఖర్చులకే సరిపోతాయి కానీ లాభాలు అంతంత మాత్రమే లభిస్తాయి. కానీ అదే వ్యవసాయం నేడు కొందరికి అభిరుచిగా మారింది. ఎంతో ఇష్టంగా పంటలు సాగు చేసేందుకు యువరైతులు ముందుకు వస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలు అమలు పరుస్తూ కొంగొత్త పంటలను పరిచయం చేస్తున్నారు. ఆధునిక సేద్యపు విధానాలను అందిపుచ్చుకుని సాగులో అద్భుతమైన సాధిస్తున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ యువరైతు గత ఐదేళ్లుగా రెడ్ క్యాబేజీని పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సేద్యంలో నష్టాలే ఉంటాయనుకునే సాగుదారులకు కొత్త పంటలతో ఆర్ధికాభివృద్ధిని ఎలా సాధించాలో ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు.

క్యాబేజీ పేరు చెప్పగానే తెలుపు, ఆకుపచ్చ-తెలుపు కలగలుపుతూ ఉన్న క్యాబేజీ గుర్తుకొస్తుంది. కానీ క్యాబేజీలో కూడా ఎన్నో రంగులు సాగు అవుతాయనే విషయం ఎవరికీ తెలియదు. సాధారణంగా సాగు చేయబడే క్యాబేజీ జాతికి చెందిన ఈ కొత్త రకం క్యాబేజీని రెడ్ క్యాబేజీ అంటారు. ఆంధోసైయనిన్ అనే పిగ్మెంట్ వల్ల ఎరుపు రంగు లేదా ఊదారంగు దీనికి వస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లను నివారించే లక్షణం కలిగి ఉంటుంది . అదే విధంగా విటమిన్ సి, విటమిన్ కె, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలను పుష్కలంగా లభిస్తాయి. ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లో ఎరుపు రంగులో ఉన్న క్యాబేజి సాగును అరుదుగా చూస్తుంటాం. అది కూడా సాధారణ కూరగాయల మార్కెట్ లో కాకుండా సూపర్ మార్కెట్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రెడ్ క్యాబేజీ చూడగానే ఆకట్టుకునేలా ఉండటంతో పాటు గ్రీన్ క్యాబేజీ కంటే పోషకాలు అధికంగా ఉండటం వల్ల మార్కెట్‌లో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకే సాధారణ క్యాబేజీ సాగుచేసే రైతుల కంటే ఈ రెడ్ క్యాబేజీ సాగు చేసిన రైతులు లాభాలు గడిస్తున్నారు. అది తెలుసుకున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రైతులు సాంప్రదాయ పంటలకు బదులుగా రెడ్ క్యాబేజీ సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంగితుర్తి గ్రామానికి చెందిన యువ రైతు కందా దుర్గారావు గత ఐదేళ్లుగా రెడ్ క్యాబేజీ సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

దుర్గారావు వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో గతంలో బెంగళూరు వెళ్లి అక్కడ రెడ్ క్యాబేజీ సాగుపైన శిక్షణ తీసుకున్నాడు. కొత్త రకం పంట కావటంతో పాటు అందులో పోషకాలు అధికంగా ఉన్నాయని తెలుసుకుని తనకున్న పొలంలో పండించాలని నిర్ణయించుకున్నాడు. బెంగళూరు నుంచే విత్తనాలను తెప్పించి నాటుకుననాడు. విత్తనం వేసింది మొదలు కాయ సైజు కేజిన్నర వచ్చే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని రైతు తెలిపాడు. పంటను దళారులకు విక్రయించకుండా తానే స్వయంగా రైతు బజార్లలో అమ్ముతున్నాడు. కిలో రెడ్ క్యాబేజీని 20 నుంచి 30 రూపాయలకు అమ్ముతున్నాని అన్ని ఖర్చులు పోను లాభదాయకమైన ఆదాయం ఈ కొత్త పంట ద్వారా లభిస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

ఇలాంటి కొత్త పంటలు సాగు చేయాలనుకునే రైతులు తప్పనిసరిగా సాగుపైన అవగాహన కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైన విషయమని దుర్గారావు సూచిస్తున్నాడు. సాగు చేసే నేల నుంచి నీరు అందించే విధానం, యాజమాన్య పద్ధతులతో పాటు పంటను అమ్ముకునే విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నాడు.

సంప్రదాయ పంటలను పండించి మొక్కుబడిగా వచ్చే అంత అంతమాత్రం ఆదాయంతో సేద్యం చేసే బదులుగా ఇలా కొత్త కొత్త పంటలను పండించి మంచి ఆదాయాన్ని రైతులు పొందవచ్చు. వ్యవసాయాధికారులు ఇలాంటి కొత్త పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తే మరింత మంది ముందుకు వచ్చి విభిన్న రకాల పంటలను పండించే అవకాశం ఉంటుందని యువరైతు తెలిపాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories