Raised Bed Farming: ఈ పద్ధతిలో పండించండి.. పంట నష్టాన్ని తగ్గించండి

Raised Bed Farming Tips BY Adilabad Krishi Vigyan Kendra
x

Raised Bed Farming: ఈ పద్ధతిలో పండించండి.. పంట నష్టాన్ని తగ్గించండి

Highlights

Raised Bed Farming: ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాస్త రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Raised Bed Farming: ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాస్త రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లుపడుతుంటారు. ముఖ్యంగా అధిక వర్షాల కారణంగా చేలల్లో నీరు చేరి పంటంతా వర్షార్పణం అయిపోయే సంఘటనలు కోకొల్లలు. సంప్రదాయ పద్ధతుల్లో చేల నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యకు చక్కటి పరిష్కారం మార్గం చూపే ప్రయత్నం చేస్తోంది ఆదిలాబాద్ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం. ఎత్తుమడుల విధానంపై గత మూడేళ్లుగా చేస్తున్న ప్రయోగాలు ప్రస్తుతం సత్ఫలితాలను అందిస్తున్నాయి. మరి ఈ పద్ధతి రైతులకు ఏ విధంగా మేలు చేస్తోంది. ఏఏ పొలాలు రెయిజ్డ్‌ బెడ్స్ పద్ధతికి అనుకూలమో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు అధికం. అంతే కాదు జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. దీంతో ప్రతి ఏటా అకాల, అధిక వర్షాల కారణంగా ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో సాగయ్యే పత్తి, కంది పంటలో తీవ్ర నష్టం ఏర్పడుతుంది. పెద్ద మొత్తంలో పడే వర్షాల కారణంగా చేలల్లో నీరు చేరడంతో పంటలో ఎదుగుదల లోపిస్తోంది. చేనులో తేమ అధికంగా ఉండటం వల్ల పంటనంతా చీడపీడలు ఆశిస్తున్నాయి. తద్వారా దిగుబడులు రాక రైతుకు సాగు గిట్టుబాటు కావడం లేదు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపే దిశగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. సాధారణ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా ఏ విధానాలు రైతులకు అనుకూలంగా ఉంటాయో వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు.

గత మూడు సంవత్సరాలుగా ఎత్తుమడుల పద్ధతిలో పత్తి, కంది సాగు చేస్తున్నారు కేవీకే శాస్త్రవేత్తలు. ఇక్కడి నల్లరేగడి నేలల్లో నీరు ఇంకించుకునే శక్తి తక్కువగా ఉండటం పెద్ద మొత్తంలో వర్షం కురిసినప్పుడు నీళ‌లు నిల్వ ఉండటం వల్ల వేరు వ్యవస్థ దెబ్బతిని మొక్కల ఎదుగుదల లోపిస్తుంటుందని తద్వాద్వారా పంట నష్టపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని అరికట్టేందుకే రెయిజ్డ్‌ బెడ్ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ఎత్తుమడుల పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. తాము సాగు చేస్తున్న పంటలు సత్ఫలితాలు అందిస్తుండటమే అందుకు ఉదాహరణ అని అంటున్నారు.

వర్షాలు ఎక్కువగా కురిసినా తక్కువగా కురిసినా అది నల్లరేగడి నేలైనా ఎర్ర చల్కా నేలలైనా పత్తి, కంది, మిర్చి, పసుపు వంటి పంటలైనా లేదా వంగ వంటి కూరగాయల పంటలైనా సరే ఎత్తు మడులపై విత్తుకుంటేనే మేలని సూచిస్తున్నారు కేవీకే శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో పంటలు సాగు చేసుకుంటే అతివృష్టి, అనావృష్టి కాలాల్లో ఒత్తిళ్లను తట్టుకోవడమే కాకుండా పంటలు బాగా పెరుగుతాయని, గాలి వెలుతురు బాగా సోకడం వల్ల చీడపీడల బెడద కూడా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు.

ఆదిలాబాద్ కేవీకేలో 5 అడుగుల వెడల్పు ఎత్తు మడులపై 4 వరుసలు పత్తి, రెండు వరుసలు కంది విత్తడం వల్ల పత్తి మొక్కకు 80 కాయల వరకు వచ్చాయని శాస్త్రవేత్త చెబుతున్నారు. తక్కువ దూరం పెట్టిన చోట తోట కలిసిపోయి పిచికారీలకు ఇబ్బంది ఏర్పడిందని అంటున్నారు. కాబట్టి సాళ్ల మధ్యన 5 అడుగులు మొక్కల మధ్యన ఒక అడుగు దూరం చొప్పున 4 సాళ్లకు పత్తి, రెండు సాళ్లకు కంది విత్తాలని సూచిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల యంత్ర సాయంతో కలుపు తీయడం సులువవుతుందని అంటున్నారు.

ఆరుగాలం కష్టపడే రైతు ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో నష్టపోతూనే ఉన్నారు. వర్షాలు అధికంగా పడటం వల్ల పంట నీట మునగడం, ఒక్కోసారి సరైన సమయంలో వర్షాలు లేక పంటలు ఎండిపోవడం గమనిస్తున్నాం. ఈ క్రమంలో ఎత్తు మడుల విధానం రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories