Rain Damages Crops: అతివృష్టి అనావృష్టితో అనంత రైతుల కష్టాలు

Rain Damages Crops: అతివృష్టి అనావృష్టితో అనంత రైతుల కష్టాలు
x
Highlights

Rain Damages Crops: అతివృష్టి, అనావృష్టి ఏదైనా అనంత రైతులకు కష్టాలు తప్పేలా లేవు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో ప్రాంతంగా...

Rain Damages Crops: అతివృష్టి, అనావృష్టి ఏదైనా అనంత రైతులకు కష్టాలు తప్పేలా లేవు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో ప్రాంతంగా ఉన్న కరవు సీమలో ఈ ఏడాది అధిక వర్షాలు నిండా ముంచుతున్నాయి. ముందస్తు వర్షాలతో పులకరించిన అన్నదాతల ఆశలు అంతలోనే ఆవిరవుతున్నాయి. వేరుశనగ ప్రధాన పంటగా సాగయ్యే ఖరీఫ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో పంటకు తీవ్ర నష్టం వాటిళ్లుతోంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అనంతలో ఖరీఫ్ సాగు కష్టాలపై హెచ్ ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్.

కరవుకు మారు పేరైన అనంతపురం జిల్లాలో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొంది. రుతుపవనాల ఆగమనంతోనే ఆశించిన దానికంటే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచే పదును కావడంతో రైతులు జూన్ మొదటి వారం నుంచే సాగుచేయడం ప్రారంభించారు. గతంలో ఎన్నడు లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికి వందశాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.

జిల్లాలో సగటున ఖరీఫ్ లో మెట్ట కింద 6.82 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ 4.7 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రధాన పంటగా సాగుచేసే వేరుశనగ సగటున 4.6 లక్షల హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా దాదాపు 4 లక్షల హెక్టార్లలో 85 శాతానికి పైగా సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వేరుశనగలో అంతర పంటలుగా విడిగా సాగుచేసే కంది, ఆముదం, చిరుధాన్యాల పంటలు సుమారు లక్ష హెక్టార్ల లో సాగవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ 50 వేల హెక్టార్లలో సాగైంది. చిరుధాన్యాలు, ఉలవలు, కొర్ర వంటి పంటల సాగుకు ఇంకా సమయం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రధాన పంట వేరుశనగ సాగుచేసిన రైతులను అధిక వర్షాలు నిండా ముంచుతున్నాయి. జిల్లాలో వేరుశనగ 20 నుంచి 40 రోజలు వయస్సులో ఉంది. విత్తనం వేసిన నాటి నుంచి నిత్యం వర్షం కురుస్తూండడంతో పైరులో విపరీతంగా కలుపు పెరిగి పైరు కనిపించనంతగా కప్పేసింది. పైరు చిత్తడిగా ఉండడంతో పచ్చదోమ, శనగపచ్చ పురుగు ఎక్కవగా వ్యాపించాయి. కొన్నేళ్లుగా వరస పంట వైఫల్యాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన కరవు రైతులకు ఈ ఏడాది కురుస్తున్న వర్షాలు మరింత నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఒక ఎకరాకు సగటున విత్తనం రూ.10 నుంచి 15 వేల వరకూ ఖర్చు వస్తోంది. ఎకరా కలుపు తీయడానికి రూ.30 వేలకు పైగా ఖర్చు వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు.

అధిక వర్షాలతో వేరుశనగకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు. వేరుశనగ సాగు చేసిన నాటి నుంచి 20 రోజులు బెట్ట ఉండాలని 20 నుంచి నెల రోజులకు ఓ సారి వర్షం కురిస్తే పంట ఆశించిన స్థాయిలో వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో రైతు సకాలంలో పురుగుల మందులు వాడుతూండడం వల్ల పంటను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. కలుపు పెరగడంతో రైతుల ఖర్చులు పెరిగాయని దిగుబడి ఆశాజనకంగా ఉండకపోవచ్చని అంటున్నారు.

గడిచిన 17 ఏళ్లలో వరసగా 14 సంవత్సరాలు కరవు సంభవించిన అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులు ఛిద్రమయ్యారు. సాగు చేసిన పంటలు చేతిక రాక పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారు. వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలు ఊరించినా అతిగా కురవడంతో పంటలు పూర్తీగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి ఏటా అనంత రైతన్న బలిపశువుగా మారుతున్నాడు. ప్రభుత్వం రైతుల పరిస్థితిపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా రైతాంగాన్ని ముఖ్యంగా వేరుశనగ పంటను ప్రత్యేకంగా పరిగణించి ఆదుకోవాలని కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories