ఈ పచ్చిమేత గ్రాసాలు వేస్తే: పాలు, మాంసం, ఉన్ని ఉత్పత్తి అధికం

ఈ పచ్చిమేత గ్రాసాలు వేస్తే: పాలు, మాంసం, ఉన్ని ఉత్పత్తి అధికం
x

ఈ పచ్చిమేత గ్రాసాలు వేస్తే: పాలు, మాంసం, ఉన్ని ఉత్పత్తి అధికం

Highlights

సేద్యం గిట్టుబాటు కాక, వ్యయం పెరిగిపోతుండటంతో చాలా మంది రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలవైపు మక్కువ చూపుతున్నారు. పశుసంపదపై ఆదాయం ఆర్జిస్తూ జీవనోపాధి...

సేద్యం గిట్టుబాటు కాక, వ్యయం పెరిగిపోతుండటంతో చాలా మంది రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలవైపు మక్కువ చూపుతున్నారు. పశుసంపదపై ఆదాయం ఆర్జిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో పశువుల మేత కోసం సుమారు 70 శాతం వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే చౌకగా లభించే పశుగ్రాస పంటలను పశువులకు పచ్చిమేతగా అందించడం వల్లపాలు, మాంసం, ఉన్ని మొదలైన పశు ఉత్పత్తులు పెరిగి రైతు ఆర్ధికంగా లాభాలు పొందవచ్చునన్నది నిపుణుల మాట. పచ్చిమేత తినడానికి పశువులకు సులువుగా ఉంటుంది. పోషకాలు కూడా మెండుగా లభిస్తాయి. జీర్ణ సమస్య ఉండదు. అందువల్ల రైతులు అధిక దిగుబడిని ఇచ్చే పచ్చిమేత గ్రాసాలను ఎన్నుకుని ప్రణాళికాబద్ధంగా సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏఏ గ్రాసాలను పచ్చిమేతగా పశువులకు అందించాలి? ఏ సమయంలో గ్రాసాలను సాగు చేసుకోవాలి.? ఎంత మేరా దిగుబడి అందుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

తెలుగు రాష్ట్రాల్లో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. సుమారు 106 లక్షల గోజాతి, 96 లక్షల గేదెజాతి, 200 లక్షలకు పైగానే గొర్రెలు, మేకలు ఉన్నాయి. పాడి పశువులకు పోషక విలువలు ఉన్న పశుగ్రాసాన్ని మేపటం చాలా అవసరం. వీటిని మేపటం వలన పాలు, మాంసం, ఉన్ని మొదలైన పశు ఉత్పత్తులు పెరిగి రైతు ఆర్ధికంగా లాభాలు పొందవచ్చు. సాధఆరణంగా చాలా మంది రైతులు పశువులను ఎండుగడ్డి, దాణాతో కొన్ని నెలలు మేపి ఎండాకాలంలో వూరికే వదిలేయటం జరుగుతుంది. పశువులకు పిండి పదార్థం, మాంసకృతులు, పీచుపదార్థం, లవణ మిశ్రమం, జీర్ణమయ్యే మాంసకృతులు, పోషకాలు, శక్తి చలా అవసరం, అవి పచ్చి గ్రాసాలలోనే అధికంగా దొరుకుతాయి. పశుగ్రాసాల్లో ముఖ్యంగా ఏక వార్షిక, బహువార్షిక అంటూ రెండు రకాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏక వార్షికం . ఏకవార్షిక గ్రాసాలలో ముఖ్యమైనవి జొన్న, మొక్కజొన్న, సజ్జలు, తీగజాతి రకాలైన జనుము, ఉలవలు, పిల్లి పెసర, అలసందలు. ఇవే కాకుండా అవిసె, సుబాబుల్, హెడ్జ్‌లూసర్న్ మొదలైన చెట్లను పెంచుకోవచ్చు.

జొన్న పంట పాడి పశువులకు ప్రధాన పశుగ్రాసంగా చెప్పుకోవచ్చు. జొన్న పంటలో రెండు రకాలు ఉన్నాయి. ఒకే కోతనిచ్చేవి , పలు కోతలనిచ్చేవి. ఒకే కోతనిచ్చే రకాలు చూసుకుంటే : సి.యస్.వి15, సి.యస్.హెచ్ 13, యస్.యస్.వి.84 రకాలు ఉన్నాయి. పలు కోతలనిచ్చే రకాలు చూసుకుంటే : యస్.యస్.జి. 59-3, పి.సి. 23, పి.సి.106, యస్.యస్.జి,988 రకాలు ఉన్నాయి. వీటిలో రైతులు అనువైనవి ఎన్నుకుని గ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ రకాలు సాగు చేసుకోవాలంటే ఎకరానికి సుమారు 6 నుంచి 8 కిలోల విత్తనం సరిపోతుంది. సాలుకు సాలుకు మధ్యలో 30 సెంటీమీటర్ల ఎండగా విత్తాలి. జూన్ నుంచి జూలై మాసంలో వర్షాధారంగా, సెప్టెంబర్, అక్టోబర్ లో రబీ పంటగా సాగు చేసుకోవచ్చు. జనవరిలో ఎండాకాలం పంటగా విత్తుకోవచ్చు. 50 శాతం పూత దశలోనే పంటను పశుగ్రాసంగా వాడుకోవచ్చు. ఆ తరువాత కోతలను 45 రోజుల వ్యవధిలోనే తీసుకోవాలి. దిగుబడి చూసుకున్నట్లైతే ఎకరానికి 6 నుంచి 8 టన్నుల వరకు వస్తుంది.

ఇక మొక్కజొన్నలో ఆప్రికన్ టాల్, విజయ్, కిసాన్, గంగా2,5, హెచ్‌.జి.టి.-3, జవహర్ మోతి కాంపోజిల్ రకాలను పశుగ్రాసాలుగా సాగు చేసుకోవచ్చు. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో, జనవరి నుంచి మే మధ్యలో నీటి వసతి ఉన్నప్పుడు మొక్కజొన్న గ్రాసాలను సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్నను 30 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులను అందిస్తుండాలి. 70 నుంచి 75 రోజులకు పంట కోతకు వస్తుంది. పచ్చిగడ్డిగా కోతలు చేపడిదే ఎకరానికి 160 నుంచి 200 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇందుతో 7.2 శాతం పచ్చి మంసకృత్తులు లభిస్తాయి.

సజ్జలో జెయంట్, రాజకొ, కె-599, టి.55, ఎ.పి.కాంప్లెక్స్, ఎల్‌-72, ఎల్ 74 రకాలు పశుగ్రాసాల సాగుకు అనువైనవి. జూన్ నుంచి ఆగస్టు, జనవరి నుంచి మే వరకు నీటి వసతి ఉన్నప్పుడు సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 2 కిలోల వరకు విత్తనం అవసరం అవుతుంది. నాటుకునేప్పుడు మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటించాలి. 15 నుంచి 20 రోజులకు ఒకసారి నీటి తడులను అందించాలి. 50శాతం పువ్వుతో ఉన్నప్పటి నుంచి కత్తిరింపులు చేసుకోవచ్చు. ఎకరానికి సుమారు 160 నుంచి 200 క్వింటాళ్ల వరకు పచ్చి గడ్డి దిగుబడి అందుతుంది. ఇందులో 6.9 పచ్చి మాంసకృత్తులు లభిస్తాయి.

ఇక ఏక వార్షిక తీగజాతి రకాల్లో జనుము ఒకటి. జనుము అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. అక్టోబర్ నుంచి మార్చి నెల వరకు జనుమును సాగుచేయవచ్చు. ఎకరానికి సుమారు 16 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. పంట కాలంలో ఒకటి లేదా రెండు తడులు ఇస్తే సరిపోతుంది. ఎకరాకు 5 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి అందుతుంది. ఉలవలు అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, ఆ తరువాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 12 నుంచి 16 కిలోల వరకు విత్తనం అవసరం అవుతుంది. ఒకటి లేదా రెండు తడులు సరిపోతుంది. పూత దశ లేదా చిరుకాయదశలో పంటను కోయాలి. ఎకరాకు 12 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. పశువులు పచ్చి రొట్టగా చాలా ఇష్టంగా తినే పంట పిల్లి పెసర. పిల్లి పెసరను జూన్ నుంచి ఆగస్టు వరకు, ఆ తరువాత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాగు చేసుకోవచ్చు. ఎకరాకు సరాసరిన 8 నుంచిం 10 కిలోల విత్తనం అవసరం అవుతుంది. రెండూ లేదా మూడు నీటి తడులు సరిపోతాయి. ఎకరాకు 2 నుంచి 3 టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది. అలసందల్లో యు.పి.సి. 287, ఇ.సి.4216, ఎస్.పి.3, యు.పి.సి.5286, రష్యన్ జెయంట్ రకాలు పశుగ్రాసాలకు అనుకూలం. అలసందలను జూన్ నుంచి జూలై, ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 30 కిలోల వరకు విత్తనం అవసరం ఉంటుంది. 12 నుంచి 15 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. అలసందల ద్వారా 30 నుంచి 35 టన్నుల పచ్చిమేత లభిస్తుంది.

ఇక అన్ని కాలాల్లో పచ్చి మేతను అందించే బహు వార్షిక పశుగ్రాసాల్లో ముఖ్యమైనవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బహువార్షిక పశుగ్రాసాల్లో ప్రధానంగా హైబ్రిడ్ నేపియర్ గ్రాసం పేరే వినిపిస్తుంది. నేపియర్ గడ్డిని సజ్జతో సంకర పరిరి హైబ్రిడ్ నేపియర్ గ్రాసాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు శాస్త్రవేత్తలు. ఇందులో ఎ.పి.బి.ఎన్.1, కో.1, కో.3, ఐ.జి.ఎఫ్.ఆర్.ఐ.6 , ఎన్.బి.21. రకాలను గ్రాసానికి అనుకూలం. ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో విత్తుకోవాలి. చలి కాలంలో విత్తుకోకపోవడమే మంచిది. ఎకరాకు సుమారు 22 నుంచి 30 వేల వరకు కాండపు మొక్కలు ఒకసారి నాటితే 3 నుంచి 4 సంవత్సరాల వరకు పంట ఉంటుంది. వరుసలు, వరుసల మధ్య 50 నుంచి 75 సెంటీమీటర్ల వరకు దూరం పాటించాలి. ఎండాకాలంలో 8 నుంచి 21 రోజులు , చలికాలంలో 15 నుంచి 20 రోజుల వ్యవధికి ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. నాటిని 60 నుంచి 75 రోజులకు మొదటి కోత మొదలవుతుంది. ఆ తరువాత ప్రతి 40 నుంచి 45 రోజులకు ఒకసారి 5 నుంచి 6 కోతలు వస్తుంది. ఎకరాకు 72 నుంచి 160 టన్నుల పచ్చిమేత అందుతుంది.

ఇక పార గడ్డిని దక్షిణ భారతదేశంలో జూన్ నుంచి జూలై మధ్యలో సాగుచేసుకోవచ్చు. దీనికి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల బరువు గల కాండపు మొక్కలు అవసరం అవుతాయి. లేదా 30 వేల నారు మొక్కలు నాటుకోవచ్చు. వరుసల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల అంతరములో నాటుకోవాలి. ఎండాకాలంలో 8 నంచి 16 రోజులు, చలికాలంలో 10 నుంచి 15 రోజుల వ్యవధికి ఒకసారి నీటి తడులు అందించాలి. 70 నుంచ 80 రోజులకు మొదటి కోత మొదలవుతుంది. ఆ తరువాత 40 నుంచి 45 రోజులకు ఒకసారి కోతలు చేసుకోవచ్చు. పచ్చిమేత దిగుబడి ఎకరాకు 32 నుంచి 40 టన్నుల వరకు వస్తుంది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఈ రకాన్ని లోతట్టు, మురుగు ప్రాంతాల్లో నూ పెంచవచ్చు.

గిని గడ్డిలో.. హమిల్, మాకుని, రివర్స్‌డేల్, గ్రిన్‌పానిక్, గాటన్‌పానిక్, పి.పి.బి.14 రకాలు పశుగ్రాసాలుగా సాగు చేసుకోవచ్చు. ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో సాగు చేసుకోవాలి. ఎకరాకు 30 నుంచి 40 వేల నారు మొక్కలు అవసరం అవుతాయి. నాటిని 50 నుంచి 60 రోజులకు మొదటి కోత లభిస్తుంది. ఆ తరువాత 45 రోజులకు ఒకసారి కోతలు చేసుకోవచ్చు. ఎకరాకు సుమారు 20 నుంచి 24 టన్నుల పచ్చిమేత అందుతుంది.

స్టైలో పశుగ్రాసాల్లో స్టైలో హమట, స్టైలో హమిలిస్, స్టైలో స్కాబ్రా రకాలు పశుగ్రాసాలకు అనువైనవి. జూన్ నుంచి ఆగస్ట్ మధ్యలో నీటి పారుదల క్రింద సాగు చేసుకోవాలి. ఎకరానికి రకాన్ని బట్టి సుమారుగా 10 నుంచి 20 కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది. 20 నుంచి 30 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. విత్తనాలు చల్లిన 75 రోజులకు మొదటి కోత లభిస్తుంది. ఎకరాకు 30 నుంచి 35 టన్నుల పచ్చి మేత లభిస్తుంది. లూసర్ను రకానికి వస్తే టి-9, ఆనంద్-2, ఎస్-244, కాంప్ -3, కో-1 రకాలు సాగుకు అనువైనవి. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో విత్తనాలు నాటుకోవచ్చు. వారానికి ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. 70 రోజులకు మొదటి కోత మొదలవుతుంది. ఎకరాకు 60 నుంచి 70 టన్నల వరకు పచ్చిమేత లభిస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories