Top
logo

Dairy Farming: పాడి రంగంలో రాణిస్తున్న యువరైతు కళ్యాణ్

Pure Cow Milk Production in Dairy Farming by Kalyan
X

Dairy Farming: పాడి రంగంలో రాణిస్తున్న యువరైతు కళ్యాణ్

Highlights

Dairy Farming: చేసే ఏ పనిలో అయినా...సంపద ఉంటే చాలదు సంతృప్తి కూడా ముఖ్యమే అది లేకే చాలా మంది యువకులు లక్షల్లో జీతం వస్తున్నా సాఫ్ట్‌వేర్ కొలువులను సైతం వీడి స్వయం ఉపాధి పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు.

Dairy Farming: చేసే ఏ పనిలో అయినా...సంపద ఉంటే చాలదు సంతృప్తి కూడా ముఖ్యమే అది లేకే చాలా మంది యువకులు లక్షల్లో జీతం వస్తున్నా సాఫ్ట్‌వేర్ కొలువులను సైతం వీడి స్వయం ఉపాధి పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు. అనుభవం లేకున్నా ఆదిలో కాస్త ఇబ్బందులు ఎదురైనా సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుకుని తోటి రైతుల నుంచి సలహాలను తీసుకుని పట్టుదలతో కృషి చేస్తూ పాడి రంగంలో రాణిస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తాడు మేడ్చల్ జిల్లా కు చెందిన యువరైతు. స్వయంకృషితో పాడి పరిశ్రమను ఏర్పాటు చేసీ దేశీ ఆవులు, గేదెల పెంపకం చేపడుతూ తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నాడు. తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మేడ్చల్ జిల్లాకు చెందిన కళ్యాణ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొన్నాళ్లు పనిచేశాడు. అయితే ఉద్యోగంలో ఆదాయం బాగున్నా సంతృప్తి కొరవడింది. ఏదో చేయాలన్న ఆలోచన మొదలైంది. వ్యాపార రంగంలోనే రాణించాలనుకున్నాడు. అయితే చేసే వ్యాపారంలో డబ్బులే లక్ష్యంగా చూడలేదు. ఏ పనిలో అయినా సంపద ఒక్కటే కాదు సంతృప్తి ము‌ఖ్యమంటాడు కళ్యాణ్. స్వయం ఉపాధి పొంది నలుగురికి ఉపాధి కల్పించాలని సంకల్పించుకున్నాడు. అందుకు వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమే సరైన మార్గమని నిర్ణయించుకున్నాడు. స్వతహాగా ఎలాంటి అనుభవం లేకున్నా ఏదో చేయాలన్న తపనే ఆర్గానిక్ డైరీ ఫాం కి అంకురార్పన చేసింది. జిల్లాలో 30 ఎకరాల స్థలం కౌలుకు తీసుకొని దేశీయ ఆవులు, దేశీ గేదెలతో ఫాం నిర్వహిస్తున్నాడు కళ్యాణ్. దేశీ పాలను, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ విజయపథంలో ముందుకెళ్తున్నాడ.

ఆదిలో కొన్ని అడ్డంకులు ఎదురైనా పట్టువదలక మరింత అవగాహన పెంచుకుని పాడి రంగంలో రాణిస్తున్నాడు కళ్యాణ్. మొదట రెండు ఆవులు, గేదెలతో పరిశ్రమను నెలకొల్పాడు కళ్యాణ్. ప్రస్తుతం ఈ యువరైతు ఫామ్‌లో 130 దేశీ గోవులు, గేదెల ఉన్నాయి. 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. పరిశ్రమను నెలకొల్పిన ఏడాదిన్నర కాలంలోనే సాఫ్ట్ వేర్ కొలువులో వచ్చే ఆదాయం లభిస్తోందని ఈ యువరైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

ఆర్గానిక్ డైయిరీ ఫామ్ ను నిర్వహించడం అనేది అంత సులువైన పని కాదని అంటున్నాడు కళ్యాణ్. తన విజయం వెనకాల రెండేళ్ల శ్రమ ఉందంటున్నాడు. స్వచ్ఛమైన తాజా దేశీ పాలను వినియోగదారులకు అందించడమే ఈ యువకుడి ప్రధాన లక్ష్యం. అందుకోసమే ఒంగోలు, గిర్, కాంక్రేజ్ వంటి దేశీయ ఆవులతో పాటు ముర్రా వంటి గేదెలను కేవలం పాల ఉత్పత్తి కోసమే పెంచుతున్నాడు.

నాణ్యమైన పాల దిగుబడిని అందిస్తేనే రైతకు లాభాలు దక్కుతాయన్నది కళ్యాణ్ సిద్ధాంతం. అందుకే పాల ఉత్పత్తిలో ఏ విధంగానూ రాజీపడడు. మన దేశ సంతతికి చెందిన దేశీయ ఆవులను , గేదెలను వివిధ రాష్ట్రాల నుంచి సేకరించాడు. ప్రధానంగా ఒంగోలు, గిర్, కాంక్రీజ్ వంటి మూడు రకాల దేశీయ ఆవులు ఈ ఫామ్ లో కనిపిస్తాయి.

ఆవు మెడ కింద వేలాడే చర్మం, పొడవైన కొమ్ములు, పైన మూపురం ఇవన్నీ దేశవాళీ ఆవుల్లోనే కనిపిస్తాయి. ఈ దేశీ ఆవులు ఏ2 పాలను అందిస్తాయని వాటిలో ప్రోటీన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయని అంటున్నాడు కళ్యాణ్. జెర్సీ ఆవులతో పోల్చుకుంటే పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నా నాణ్యమైన దేశీ పాలను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా వీటిని పెంచుతున్నామని చెబుతున్నాడు ఈ యువరైతు.

గేదెల్లోనూ మూడు రకాల బ్రీడ్ లను పెంచుతున్నాడు కళ్యాణ్. హర్యానా నుంచి ముర్రా గేదెలు, మహారాష్ట్ర నుంచి జాఫరాబాడీ, బన్నీ జాతుల గేదెలను దిగుమతి చేసుకుని పెంచుతున్నాడు. ఈ గేదెలు కూడా 12 నుంచి 13 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇస్తాయని తెలిపాడు.

పశువులకు అందించే దాణా విషయంలోనూ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ యవరైతు. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా సహజ పద్ధతుల్లో పండిన గ్రాసాలనే దాణాగా అందిస్తున్నాడు. పశువుల నుంచి విచ్చిన వ్యర్ధాలను ప్రత్యేకంగా సేకరించి తన క్షేత్రంలోనే గ్రాసాలను ప్రకృతి విధానంలో సాగు చేయిస్తున్నాడు. అనంతపురం రైతుల నుంచి సేకరించిన ఉలవలు, మొక్కజొన్నలు, చిన్న జొన్నలను పిండిగా చేసి పోషకాల దాణాగా పశువులకు అందిస్తున్నాడు. అజొల్లాను సైతం అందిస్తూ పశువులకు పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాడు. ప్రకృతి విధానాలను అనుసరించడం వల్ల నాణ్యమైన పాల దిగుబడి అందుతుందని కళ్యాణ్ చెబుతున్నాడు.

పాల విక్రయంలో సరికొత్త విధానాన్ని అవలంభిస్తున్నాడు యువరైతు కళ్యాణ్. పాలు పితికిన వెంటనే తాజా పాలను వినియోగదారులకు అందించేస్తున్నాడు . అదే తన సక్సెస్ మంత్ర అని అంటున్నాడు. ఈ ఫాంలో ప్రతి రోజు 600 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. వీటిని ఫ్రీజర్లలో నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందిస్తున్నాడు. మిగతా వారికి భిన్నంగా ప్లాస్టిక్ కవర్లను వినియోగించకుండా స్టీల్ సీసాలను పాల విక్రయానికి వినియోగిస్తున్నాడు. సాఫ్ట్ వేర్ కొలువును సైతం వీడి పాడి రంగంలో రాణిస్తున్న కళ్యాణ్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. స్వచ్ఛమైన పాలను విక్రయించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నాడు. లాభాలు ఆర్జిస్తున్నాడు.


Web TitlePure Cow Milk Production in Dairy Farming by Kalyan
Next Story