నాటు కోళ్ల పెంపకంలో జగిత్యాల జిల్లా దంపతులు

నాటు కోళ్ల పెంపకంలో జగిత్యాల జిల్లా దంపతులు
x
Highlights

గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాల్లో నాటు కోళ్లు పెంచడం అనాదిగా వస్తోంది. ఇదే సంప్రదాయాన్ని ఉపాధిగా...

గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాల్లో నాటు కోళ్లు పెంచడం అనాదిగా వస్తోంది. ఇదే సంప్రదాయాన్ని ఉపాధిగా మలుచుకునేందుకు యువకులు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల ఫారాల నిర్వహణపై రైతులు దృష్టిసారిస్తున్నారు. లాభాలు గడిస్తున్నారు. ఆ కోవకు చెందినవారే జగిత్యాల జిల్లాకు చెందిన అరుణ్‌, నవత దంపతులు. స్వల్ప ఖర్చుతో నాటుకోడి పిల్లల హేచరీని నిర్వహిస్తూ నికర ఆదాయాన్ని పొందుతున్నారు.

వినూత్నమైన ఆలోచనలు, మనోబలంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి నిదర్శనం ఈ యువ జంట. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కాపరబోయిన అరుణ్‌ క్రాంతి బీటెక్, ఆయన భార్య నవత ఎంబీఏ చదివారు. ఇద్దరికీ కార్పొరేట్‌ ఉద్యోగాలు వచ్చినప్పటికీ, వ్యవసాయం, అనుబంధ రంగాలపై అభిరుచితో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల సమీపంలోని తమ రెండెకరాల భూమిలో చుట్టూ ఇనుప మెష్‌ వేసి, ఒక షెడ్డు వేసుకొని, ఆరుబయటే తిరుగాడే పద్ధతిలో నాటు కోళ్లను పెంచుతున్నారు. మొదట ఈము పక్షుల పెంపకాన్ని చేపట్టి, మార్కెటింగ్‌ సమస్యల వల్ల భారీ నష్టాలను చవిచూశారు. ఆ తరువాత కూడా ఉద్యోగాల వైపు చూడకుండా మనోధైర్యంతో వినూత్నంగా నాటు కోళ్ల పెంపకం వైపు అడుగులు వేసారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కోళ్ల ఫారాలను స్వయంగా పరిశీలించారు. నాటుకోళ్లను షెడ్లలో పెంచడం వల్ల వ్యాధులు వస్తున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువై నష్టపోతున్నట్లు గ్రహించారు. షెడ్లలో పెంచడం వల్ల దాణా ఖర్చు ఎక్కువ అవుతుండటంతో పెద్దగా గిట్టుబాటు కావడం లేదని గుర్తించి, నాటు కోళ్లను వినూత్నంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. మొదట 100 గుడ్లతో కోళ్ల పెంపకం చేపట్టారు. నేడు నెలకు 50 వేల కోడి పిల్లలను అమ్మే స్థాయికి ఎదిగారు. కృత్రిమంగా గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్‌ను కొనుగోలు చేయకుండా అందుబాటులో ఉన్న వస్తువులతో తన తెలివితేటలను ఉపయోగించి తయారు చేసుకున్నారు.

ఆరు బయటకు వచ్చిన పిల్లలకు సమతుల పౌష్టికాహారంగా హైడ్రోపోనిక్‌ పద్ధతిలో ట్రేలలో పెంచే మొక్కజొన్నగడ్డి, జొన్న గడ్డి, గోధుమ గడ్డితోపాటు ఆరుబయట పొలంలో పాలకూర, ఆకుకూర, షేడ్‌నెట్‌ హౌస్‌లో అజొల్లాలను సొంతంగా పెంచి అందిస్తున్నారు. డక్‌వీడ్‌తోపాటు మినరల్స్‌ కూడా ఇస్తుంటారు. సాగు చేసిన తోటల్లో తిరుగుతూ కోళ్లు తమకు ఇష్టమైనవి తింటుంటాయి. కేవలం సాయంత్రం సమయాల్లో షెడ్లలోకి పిలిచేందుకే మొక్కజొన్న, సోయాబీన్, నూకలు, వరి తవుడును కలిపిన దాణా వేస్తుంటారు. సాధారణంగా పెరటి కోళ్లు పెంచే వారు పెట్టే ఖర్చులో 20 శాతం ఖర్చుతోనే వీరు మంచి ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం.

నాటు కోడి పిల్లలు కొనుగోలు చేసిన వ్యక్తులకు వీటిని ఏ విధంగా పెంచితే లాభాలు వస్తాయో కూడా వీరు శిక్షణ ఇస్తున్నారు. కోడి పిల్ల కొనుగోలు చేసి తీసుకెళ్లిన వారు మార్కెట్‌లో అమ్మే వరకు ఏ రోజు ఏమి చేయాలో షెడ్యూల్‌ ఇస్తుంటారు. ఇవాళ్టి ఓటమే రేపటి విజయానికి నాంది అనడానికి నిదర్శనం ఈ దంపతులు. పోగొట్టుకున్న చోటే నికర ఆదాయాన్ని పొందుతోంది ఈ జంట . ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తోంది. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అరుణ్‌, నవత దంపతులు.

Show Full Article
Print Article
Next Story
More Stories