పీఎం కిసాన్‌లో తేలిపోయిన తెలంగాణ వాటా

పీఎం కిసాన్‌లో తేలిపోయిన తెలంగాణ వాటా
x
Highlights

పీఎం-కిసాన్ పథకం కింద తెలంగాణకు 1,500 కోట్ల రూపాయలు అందబోతున్నాయి. తొలి విడతలో 500 కోట్ల రూపాయలు రానున్నాయి. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 25 లక్షల...

పీఎం-కిసాన్ పథకం కింద తెలంగాణకు 1,500 కోట్ల రూపాయలు అందబోతున్నాయి. తొలి విడతలో 500 కోట్ల రూపాయలు రానున్నాయి. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 25 లక్షల మంది చిన్న, సన్నకారు రైతాంగానికి ఆర్ధిక ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 24 న రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో తెలంగాణ రాష్ట్ర వాటా తేలిపోయింది. కేంద్రం ఏడాదికి 6 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 25 లక్షల మంది చిన్న, సన్నకారు రైతాంగానికి ఏడాదికి రూ.1,500 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఒక్కో విడతకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో రాష్ట్రానికి రూ.500 కోట్లు రానున్నాయి. ఈ నెల 24వ తేదీన ప్రధాని మోదీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి రోజు రాష్ట్ర రైతుల్లో కొందరి ఖాతాలోనైనా డబ్బులు పడాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 52.9 లక్షల మంది రైతులుండగా పీఎం-కిసాన్ పథకంలో లబ్ధిదారుల సంఖ్య సగానికంటే తక్కువకు పడిపోయింది.

పౌరసరఫరాల శాఖ జారీ చేసిన రేషన్‌ కార్డులు, సీసీఎల్‌ఏ జారీ చేసిన పట్టాదారుల వివరాలు, ఐటీ శాఖ నుంచి తీసుకున్న ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలు, రెవెన్యూ, జీఏడీ నుంచి సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి స్ర్కీనింగ్‌ చేశారు. 5 ఎకరాలకు మించి ఉన్న కుటుంబాలను, ఆదాయపు పన్ను చెల్లించే రైతులను, నాలుగో తరగతి కంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులను, రూ.10 వేలకు మించి పెన్షన్‌ పొందే వారిని, తాజా, మాజీ ప్రజాప్రతినిధులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. 5 ఎకరాల్లోపు భూమి ఉండి, మార్గదర్శకాలకు లోబడి ఉన్న రైతుల సంఖ్య 21 లక్షలుగా తేలింది. ఒక కుటుంబంలో ఒక ఖాతా కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలు మరో 3 లక్షలు తేలాయి. 18 ఏళ్లు నిండిన వారిని వేరు చేస్తే మరో లక్ష పెరిగి 4 లక్షలకు చేరుతుంది. ఈ లెక్కన పీఎం-కిసాన్ లబ్ధిదారుల సంఖ్య రాష్ట్రంలో 25 లక్షలు అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది.

పీఎం-కిసాన్‌ పథకానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో కసరత్తు జోరుగా సాగుతోంది. వ్యవసాయ విస్తరణాధికారులు సగానికి పైగా గ్రామసభలు నిర్వహించారు. నిబంధనలకు లోబడి ఉన్న వాటిని స్టేట్‌ పోర్టల్‌లో ట్యాబుల ద్వారా అప్‌లోడ్‌ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు కూడా సేకరించి అప్‌లోడ్‌ చేస్తుండటంతో నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్ ద్వారా నగదు బదిలీ సులభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 12,757 గ్రామాలు ఉన్నాయి. మూడు దశల స్ర్కీనింగ్‌ తర్వాత డేటాను ఢిల్లీకి పంపిస్తారు. సెంట్రల్‌ పోర్టల్‌లో 19, 20 తేదీల్లో అప్‌లోడ్‌ చేసేలా కసరత్తు జరుగుతోంది. 24న పీఎం మోదీ ప్రారంభించే నాటికి రాష్ట్రం నుంచి డేటా అప్‌లోడ్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories