Top
logo

గుడ్డు ధర రూ.వెయ్యి...పుంజు ధర రూ.1.75 లక్షలు

గుడ్డు ధర రూ.వెయ్యి...పుంజు ధర రూ.1.75 లక్షలు
X
Highlights

ఒక గుడ్డు ధర అక్షరాలా వెయ్యి రూపాయలు కోడిపుంజు ధర లక్షా 25 వేలు దేశవిదేశాల్లో ఈ కోళ్లకు మంచి డిమాండ్‌ అయితే...

ఒక గుడ్డు ధర అక్షరాలా వెయ్యి రూపాయలు కోడిపుంజు ధర లక్షా 25 వేలు దేశవిదేశాల్లో ఈ కోళ్లకు మంచి డిమాండ్‌ అయితే అన్ని కోళ‌్లలా ఈ కోడి మాసం కోసం విక్రయించేది కాదు పందెం కోళ‌్లు అంతకంటే కావు అందరినీ ఆకర్షించే అందమైన కోళ‌్లు అందాల పోటీల్లో తన అందచెందాలలో పెంపకందారులకు లక్షలు సంపాదించిపెట్టే కోళ్లు అవే పర్లాజాతి కోళ్లు పర్లాజాతి కోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్న ప్రకాశం జిల్లా కంభం వాసి పై నేలతల్లి ప్రత్యేక కథనం

ఆకర్షించే అందం ఎంతో ఠివీగా రాజసం ఉట్టిపడేలా వున్న ఈ కోడి పర్లా జాతి కోడి పలుచనైన చిలక లాంటి చిన్న ముక్కు మూడు అడుగుల తోక వుండి అచ్చం మన జాతీయపక్షి నెమలిని పోలి వుండే ఈ పర్లా జాతి కొళ్ళకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపే వుంది నెమలితో పాటు రెండు మూడు రకాల కోళ్ళ జాతుల పోలికలు కలిగి వుండే ఈ పర్లా కోడి అందం మాటల్లో చెప్పలేనిది అందాల పోటీల్లో తనకు ఎదురు లేదంటూ ఈ కోళ్లు తన సత్తాను చాటుతున్నాయి.

ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన కృష్ణమాచారి ఓ నిరుద్యోగి. ఇంటర్‌, ఐటీఐ చదివిన ఈయన తన కుల వృత్తి వడ్రంగి పని వదిలి కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. అదే జీవనోపాధిగా మలచుకొని పట్టుదలతో పర్లా జాతి కోళ్లను పెంచుతూ వాటిని అమ్ముకుంటూ సాదాసీదా జీవనం గడిపే అతనికి ఆ కోళ్ల పెంపకమే ఒక వరంగా మారింది.

పర్లాజాతి కోడిపుంజు ఠీవి, అందాలను ఎవరైనా సరే కన్ను ఆర్పకుండా చూడాల్సిందే. ఇదో ప్రత్యేకమైన కోడి. ఈ కోడిలో రెండు మూడు రకాల జాతుల పోలికలు కలిగి ఉండడమే కాక మన జాతీయపక్షి నెమలిని పోలి ఉండటం దాని సొంతం. స్వతహాగా పెంచుకునే నాటుకోళ్లు, తూర్పు, పశ్చిమగోదావరి ప్రాంతాల్లో సంక్రాంతి బరిలో నిలిచే కాకిడేగ, తుమ్మెదకాకి, మిరపపండు డేగ, కోడినెమలి, కాకినెమలి, తెల్లనెమలి, పచ్చకాకి, గరుడమైల తదితర కోళ్ల మాదిరిగా కాకుండా అందానికి పెరెన్నికగల పర్లా జాతిని పెంచుతున్నారు కృష్ణమాచారి.

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా కోళ్ల పెంపకం చేపట్టడమే కాక అందులో ఉత్తమ జాతి కోళ్లను పెంచడం కోసం ఏడాది పాటు దేశమంతా తిరిగారు. చివరకు కృష్ణమాచారికి కోళ్ళపై ఉన్న మక్కువను గమనించి బొబ్బిలి కోటలో సాల్వరాజు అనే అతను రెండు కాకిడేగల పిల్లలను ఇచ్చారు. వాటితో అతను తమిళనాడు నుంచి తెచ్చిన పర్లా జాతి కోళ్లతో సంక్రమణం చేయించారు. ఎందుకంటే పర్లా జాతి కోళ్లు అందంగా, ఠీవీగా ఉండడమే కాక మంచి ధర పలుకుతుంది. కాకిడేగ బలిష్టంగా ఉంటుంది. రెండు కోళ్లలోని లక్షణాలతో మరో మంచిజాతి తయారైంది. మొదట పర్లా జాతి కోళ్లను తమిళనాడు నుంచి దిగుమతి చేసుకొన్న కృష్ణమాచారి ప్రస్తుతం అదే తమిళనాడు, ఇతర ప్రాంతాలకు కోళ్లను సరఫరా చేస్తున్నారు. నెలకు 40వేల నుంచి 50వేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు కృష్ణామాచారి .

కృష్ణమాచారి పెంచుతున్న కోళ్లకు దేశ, విదేశాల్లో బాగా డిమాండ్‌ ఉంది. ఈ జాతి కోళ్ల ధర మార్కెట్‌లో 40వేల నుంచి లక్షా 25 వేల వరకు పలికాయి. ఓ జాతి పుంజును అత్యధికంగా లక్ష పాతికవేలకు కువైట్‌ చెందిన ఖలీద్‌ అనే సేట్‌ కొనుగోలు చేశారు. ఇలాంటి అందమైన పర్లాజాతి కోళ్లను పెంచుకోవడం ఒక స్టేటస్‌ సింబల్‌గా అందరూ భావిస్తారు. అందుకే వీటి పెంపకంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటునట్లు చెబుతున్నాడు కృష్ణమాచారి. అందుకే తన నివాసంలోనే ఓ షెడ్డును ఏర్పాటు చేసి వాటి పిల్లలను, గుడ్లను అమ్ముతూ లాభాలు గడిస్తున్నాడు.

కోడిపెట్టలు, పిల్లల పెంపకానికి నెలకు 15వేల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాడు కృత్రిమంగా కాకుండా సహజ పద్ధతిలో కోళ్లను పెంచుతున్నాడు. పర్లాజాతి కోళ్లు అంతరించిపోకుండా కాపాడుతుండడంతో కృష్ణమాచారికి 2015 నుంచి 2017 వరకు వరుసగా సంక్రాంతి సంబరాల్లో అప్పటి తహసీల్దార్‌, పశువైద్యాధికారుల నుంచి ఉత్తమ అవార్డులు, రివార్డులు అందుకున్నారు. పర్లాజాతి, ఆసిల్‌ జాతి కోళ్ళను సహజపద్దతిలోనే పెంచి ఆరోగ్యవంతమైన కోళ్ళను అందిస్తున్నందుకు తమిళనాడులోని దిండిగల్‌లోని ఆల్‌ ఇండియా ఆసిల్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటుచేసిన పోటీల్లో 1,500 నుంచి 2వేల మందిలో కృష్ణమాచారి కోళ్లకు ప్రథమస్థానం లభించింది.

కృష్ణమాచారి పెంచుతున్న కోళ్లకు దేశ, విదేశాల్లో బాగా డిమాండ్‌ ఉంది. జాతి కోళ్లను రూ.40వేల నుంచి రూ.1.25లక్షల వరకు పలికాయి. అతను పెంచిన ఓ జాతి పుంజును అత్యధికంగా రూ.లక్ష పాతికవేలకు కువైట్‌ చెందిన ఖలీద్‌ అనే సేట్‌ కొనుగోలు చేశారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 200పైగా కోళ్లను విక్రయించారు. అలాగే తమిళనాడుకు చెందిన వారు ఎక్కువగా గుడ్లను, అలాగే ఆరునెలల పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, కేరళల నుంచి వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ లోనూ విక్రయాలు చేస్తున్నాడు కృష్ణమాచారి.

పర్లా, ఆషిల్‌ జాతికోళ్లు ఏడాదికి మూడుసార్లు గుడ్లు పెడతాయి. ఏడాదికి ఒక్కొక్క కోడి 35 గుడ్లు పెడతాయి. ఒక్కొక్క గుడ్డు ధర వెయ్యి రూపాయలు, జాతి కోళ్ల పిల్లలు ఒక్కొక్కటి 25వేల రూపాయల చొప్పున దుబాయ్‌, కేరళ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, ఒరిస్సా, శ్రీలంక నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసుకొని వెళుతున్నారు. ఆ పిల్లలు 7 నుంచి 8 నెలల వ్యవధిలో పుంజు, పెట్టగా వృద్ధి చెందుతున్నాయి. ఒకొక్క కోడి తోక 6 మీటర్ల పొడవు, 6 కేజీల బరువు, ముక్కు 2 నుంచి 3 అంగుళాలు ఉంటుంది.

ఇప్పటివరకు తాను సింహా అని మద్దుగా పిలుచుకునే కోడిపుంజు 5 సార్లు ఉత్తమ అవార్డు సాధించింది అంతేకాక తమిళనాడులోని జాతికోళ్ల ప్రత్యేక పోటీల్లో ప్రధమస్థానం లభించింది. వీటి పోషణలో మెలకువలు పాటించడం ద్వారా వాటి శరీరాకృతిలో ధృడత్వాన్ని, ఆహార్యంలో చక్కదనాన్ని తేగలిగానంటున్నారు కృష‌్ణమాచారి. తాను స్థానిక వైద్యాధికారుల సలహాతో మంచి కోళ్లను శ్రద్ధగా పెంచగలుగుతున్నాని తెలిపారు. తన వద్ద జాతి కోళ్లు 300 వరకు ఉన్నాయని వివరిస్తున్నాడు.

పర్లాజాతి కోళ్లను పెంచడంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. వాటికి మిశ్రమ ధాన్యం అందించాలి. ఉదయం బాదం, పిస్తా పప్పు, సొద్దలు, జొన్నలతో రాగులు కలిపి ఇవ్వాలి. ఇలాంటి అందమైన పర్లాజాతి కోళ్లను పెంచుకోవడం ఒక స్టేటస్‌ సింబల్‌గా అందరూ భావిస్తారు. అందుకే వీటి పెంపకంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటునట్లు చెబుతున్నాడు కృష్ణమాచారి. పందెంకోళ్ల మాదిరిగా కాకుండా కేవలం అన్ని గృహాల్లో అందానికి ప్రతీకగా నిలిచే పర్లా జాతి కోళ్ల పెంపకాన్ని చేపట్టిన కృష్ణమాచారి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందారు. సొంతూరి పేరు నిలబెడుతున్నారు.


Next Story