ఉద్యమంగా దేశీ వరి విత్తనాల సాగు

ఉద్యమంగా దేశీ వరి విత్తనాల సాగు
x
దేశీ వరి విత్తనాల సాగు
Highlights

ప్రకృతి వ్యవసాయం! హరితవిప్లవపు కోరల్లో చిక్కుకుని కనుమరుగైన అసలైన వ్యవసాయ పద్ధతి నేలతల్లిని కళ్ళకు అద్దుకుని, ప్రకృతి వనరులని గుండెలకు హత్తుకొని, దేశి...

ప్రకృతి వ్యవసాయం! హరితవిప్లవపు కోరల్లో చిక్కుకుని కనుమరుగైన అసలైన వ్యవసాయ పద్ధతి నేలతల్లిని కళ్ళకు అద్దుకుని, ప్రకృతి వనరులని గుండెలకు హత్తుకొని, దేశి ఆవులతో మమేకమై సేద్యం చెయ్యడం భారతీయ రైతులకు మాత్రమే తెలిసిన వ్యవసాయం. ఆధునిక పోకడలతో ఆదమరిచిన పాత పంటలని మళ్లీ అదిమి పట్టుకుని మేలైన దేశీ వరి వంగడాలకు పునరుజ్జీవం పోస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు. అభ్యుదయ రైతు బాపారావు, భారత్ బీజ్ స్వరాజ్ స్థాపకులు శివప్రసాద రాజు సహకారంతో దాదాపు 86 ఎకరాలకు పైగా సుభాష్ పాలేకర్ విధానంలో మేలైన దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. నాణ్యమైన ,ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే మా లక్ష్యం అంటున్న ఈ అభ్యుదయ రైతుల సాగు పై ప్రత్యేక కథనం.

రసాయనాల వ్యవసాయం వ్యసనంగా మారిన తరుణంలో, ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నా రైతులు ఆర్ధికంగా బలపడాలన్నా ఒకే ఒక్క మార్గం, మన దేశానికి మాత్రమే సొంతమైన ప్రకృతి వ్యవసాయం. పంటలతో పాటు పర్యావరణాన్ని కాపాడాలంటే, ప్రతీ రైతు ఈ విధంగా ముందుకు వెళ్లాలని, సహజ ఎరువులతో సేద్యం చేస్తూ పెట్టుబడులని తగ్గించుకుంటూ, సమాజానికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అంటున్నారు గుంటూరు జిల్లా వెల్లిపాడు గ్రామానికి చెందిన వ్యవసాయశాఖ రిటైర్డ్ అధికారి శ్రీ రామ మూర్తి.

గుంటూరు జిల్లా, తూములూరు గ్రామానికి చెందిన రైతు వేంకటప్పా రెడ్డి అభ్యుదయ రైతు బాపారావు తో కలిసి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మేలైన దేశీ వరి జాతి అయిన రత్నసాలీ రకాన్ని సాగు చేస్తున్నాడు. దేశీ ఆవులతో సాగు చేస్తూ తక్కువ పెట్టుబడులతో మంచి దిగుబడిని సాగిస్తున్నామని, పోషక విలువలు ఉన్న రత్నసాలీ, ఇతర దేశీ వరి రకాల సేద్యంపై చాల మంది రైతుల్లో ఆసక్తి పెరుగుతుందని అంటున్నారు ఈ రైతు.

నామన రోశయ్య గుంటూరు జిల్లా, అత్తోట గ్రామానికి చెందిన ఈ రైతు 1969 నుండి వ్యవసాయం చేస్తున్నాడు ! 2008 సంవత్సరంలో సుభాష్ పాలేకర్ శిక్షణ తరగతులకు వెళ్లిన ఆయన రసాయన సేద్యాన్ని వదిలి, తనకున్న 75 సెంట్ల భూమిలో దాదాపు 300కు పైగా పండ్ల చెట్లను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నాడు. అంతేకాకుండా కౌలు తీసుకున్న మాగాణిలో 206 రకాల దేశీ విత్తనాలతో మేలైన వరి వంగడాలని పండిస్తున్నాడు. ICRP సభ్యుడిగా ఉంటూ ఎంతో మంది రైతులకు దేశీ విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నాడు ఈ రైతు.

రైతులే కాదు భావితరాల యువత కూడా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తుంది. వ్యవసాయ రంగంపై ఆసక్తితో, తక్కువ పెట్టుబడి. ఎక్కువ దిగుబడినిచ్చే దేశావాళి వరి రకాలపై రీసెర్చ్ చేస్తున్నాడు మోహన్ అనే విద్యార్థి. MA డెవలప్మెంట్ కోర్సులో భాగంగా రీసెర్చ్ కి వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నానని, అధిక పోషకాలుండే దేశీ వరి రకాల సాగు రైతుల మేలు కలిగిస్తుందని అంటున్నారు ఈ విద్యార్ధి .

గుంటూరు జిల్లా, అత్తోట గ్రామానికి చెందిన రైతు రవీంద్ర బాబు నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. 72 రకాల దేశీ వరిని సాగు చేయడంతో పాటు అభ్యుదయ రైతు బాపారావు స్పూర్తితో, విత్తన పండుగలు నిర్వహిస్తూ ఇతర రైతులకు వాటిపై అవగాహన కల్పిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు అప్పారావు ICRP సభ్యుడిగా ఉంటూ 200 రకాల దేశీ వరి రకాలను సాగు చేస్తూనే, వాటి ఉపయోగాలను రైతులకు తెలియజేస్తున్నాడు.

చూసారుగా ఈ ప్రకృతి వ్యవసాయ విప్లవ వీరుల కథ దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి, రాజు లేని రాజ్యాలున్నాయేమోకానీ రైతు లేని రాజ్యం లేదు. అలాంటి రాజ్యంలో రైతు రాజుగా ఉండాలంటే అది ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమవుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories